అహ్మదాబాద్: క్రికెట్‌లో విచిత్రమైన సంఘటనలు జరగడం సర్వసాధారణం. కానీ, ఇలాంటి దురదృష్టకమైన ఘటన జరగడం ఇదే తొలిసారి కావొచ్చు. రంజీ ట్రోఫీ 2024-25 కేరళతో జరిగిన సెమీ ఫైనల్‌లో గుజరాత్‌కు చెందిన ఆటగాడు నగస్వల్లా విచిత్రమైన రీతిలో ఔట్ అయ్యి.. కేరళను ఫైనల్స్‌కు చేర్చాడు.
అసలు జరిగిందేటంటే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేరళ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 457 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ ఆరంభం నుంచి కేరళకు గట్టి పోటీ ఇచ్చింది. అయితే 455 పరుగుల వద్ద అంటే.. మరో మూడు పరుగులు చేస్తే ఆధిక్యంలోకి వస్తుందనే తరుణంలో బ్యాట్స్‌మెన్ నగస్వల్లా ఆడిన బంతి.. షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సల్మాన్ హెల్మెట్‌కి తగిలి.. స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సచిన్ బేబీ చేతిలోకి వెళ్లింది. దీంతో నగస్వల్లా ఔట్ అయ్యాడు.
అయితే రంజీ రూల్స్ ప్రకారం మ్యాచ్‌లో ఫలితం తేలని పక్షంలో తొలి ఇన్నింగ్స్‌లో లీడ్ సాధించిన జట్టు విజేతగా నిలుస్తుంది. గుజరాత్, కేరళ మ్యాచ్‌లో ఫలితం తేలడం అసాధ్యం కాబట్టి, కేరళ విజేతగా నిలిచి ఫైనల్‌కు చేరుకుంటుంది. అయితే 91 సంవత్సరాల రంజీ చరిత్రలో కేరళ ఫైనల్స్‌కి చేరడం ఇదే తొలిసారి కావడం విశేషం.