కోపం, ఆవేశం, బాధ లాంటివి కలిగినా అవన్నీ ప్రక్కనపెట్టి సర్దుకొని ఆటలు ఆడవ లసినదేనని, గెలుపు ఓటములు సహజమని, ఎవరూ నేర్పకుండానే వారికి అలవడుతాయి. ప్రతి ఆటకు వేరువేరు నియమాలు ఉంటా యని, వాటిని తప్పకుండా పాటిస్తేనే ఆటలు ఆడగలమని అప్రయత్నంగానే చిన్నారులు నేర్చుకుంటారు. మార్కెట్‌లో తక్కువ ధరలో దొరికే మెదడుకు మేత ఆటలు, పజిల్స్ తయారు చేయడం, సుడోకు నింపడం, రూబిక్ క్యూబ్ కలపడం, తికమక ఆట వస్తువులు, కలర్ బ్రిక్స్ లాంటివి చిన్నారులకు అందుబా టులో ఉంచి నేర్పించడం వల్ల సమయాన్ని సద్వినియోగ పరుచుకుంటూ ఏకాగ్రతను పెంచుకోగలుగుతారు.
వేసవి సెలవులు అంటే చిన్నారులకు ఎంతో ఇష్టం. ఎంత సేపూ మొబైల్ ఫోన్లలో గేమ్స్, టివిలో సినిమాలు కాకుండా చిన్నారులకు ప్రత్యేకంగా ఏమైనా నేర్పించవచ్చని ఆలోచించండి. తల్లిదండ్రులారా మీ పిల్లలకు ప్రత్యేక, వినూత్న ఆలోచనలు కలిగేలా ప్రోత్సహించండి. ‘బాల్యపు ఆనందాలను వేసవి సెలవుల్లో ఇంట్లో తల్లిదండ్రులు, పెద్దలు చిన్నారులకు అందించడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా పూర్వప్రాథమిక విద్య నేర్చుకొనే పిల్లల నుండి ప్రాథమిక పాఠశాలకు వెళ్లే వయసున్న చిన్నారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం ఎంతైనా అవసరం. కాబట్టి ఈ రెండు నెలలు ప్రణాళిక బద్ధంగా చిన్నారులతో గడుపుచు వారికి ఆనందాన్ని, విజ్ఞానాన్ని అందించండి. దీనికి మీరు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాల్సి అవసరం ఏమి లేదు. మీ ఇంట్లో మీ పిల్లలతో ఆడుతూ… పాడుతూ నేర్పించవచ్చు.
మీరేమీ చేయవచ్చు
పిల్లల్లో చదువుతో పాటు సృజనాత్మకత పెంచడానికి వివిధ ప్రక్రియలు పెంపొందించవచ్చు. బొమ్మలు వేయడం నేర్పాలని అనుకుంటే కలర్ పెన్సిల్స్, క్రేయన్స్, కొన్ని వాటర్ కలర్స్ ఉంటే చాలు. నచ్చిన బొమ్మ గీయడం, గీతలతో బొమ్మలు, నమూనాలు, సున్నాలతో బొమ్మలు, రంగులు వేయడం, వస్తువులను చూసి బొమ్మలు గీయడం, మట్టితో బొమ్మలు, అగ్గిపుల్లను అతికిస్తే బొమ్మ, చేతి గాజు ముక్కలతో బొమ్మలు, ఇసుక అంటించి బొమ్మలు వేయడం, పప్పులు, ధాన్యాలు అతికించి బొమ్మలు, పెన్సిల్ చెక్కతో బొమ్మలు ఇలా ఇంట్లో ఉన్న రకరకాల పదార్థాలతో, వ్యర్థాలతో ప్రతి దానికీ అర్థాన్ని కల్పిస్తూ నేర్పించ వచ్చు. ఇలా చేయడం వల్ల చిన్నారుల్లో సృజనాత్మకత పెరుగుతుంది. దీని వల్ల మంచి ఆలోచన విధానం పెరిగి, తమ తోటి పిల్లలతో వారు రూపొందించిన చిత్రానికి కథ, మాటలు అల్లి వారి భాషలో వ్యక్తీకరిస్తారు. మనము ఊహించిన దాని కంటే వినూత్నంగా వారు వాటి గురించి చెప్పగలుగుతారు.
ఇవి నేర్పించవచ్చు
ఇంకా మిగిలిన సమయాల్లో పిల్లలకు భారత, భాగవత, రామాయణ, పంచతంత్ర కథలు చెప్పండి, వారితో తిరిగి చెప్పించండి. ఇలా చేయడం వల్ల వారిలో ధారణశక్తి పెరిగి స్పష్టంగా మాట్లాడడం, తప్పులు లేకుండా, భయం లేకుండా మాట్లాడడం అలవాటు అవుతుంది. సుమతీ శతకం, వేమన శతకం లాంటి శతకాల నుండి నీతి పద్యాలు నేర్పించండి. వారు వినేలా, తిరిగి చెప్పేలా చూస్తే వారు ఉత్సాహంగా నేర్చుకుంటారు. రాగయుక్తంగా పాడడం వల్ల వారు పాటలు పడడం అంటే ఇష్టపడే అవకాశం ఉంది. చిన్నారులు ఒకసారి ఇటు వైపు ఆలోచించడం మొదలు పెడితే ఇక వారికి కాలమే సరిపోదు. మీరు కేవలం పరిశీలకులుగా మాత్రం ఉంటే చాలు. ఇలా చేయడం వల్ల వారిని ఉన్నతులుగా ఎదగడానికి అవకాశం కల్పించిన వారు అవుతారు. అంతేకాక చిన్నారులను అన్ని రంగాల్లో ప్రోత్సహించిన వారు కూడా అవుతారు.
ఇవి ఆడించవచ్చు
మీ తీరిక వేళల్లో ఇంట్లో కూర్చొని ‘మరుగున పడనున్న’ గ్రామీణ ఆటలను నేర్పించవచ్చు. పులి మేక, పచ్చిసు, గవ్వలాట, అష్ట చెమ్మ, కచ్చకాయలు, కైలాసం లాంటి ఆటలు ఆడే విధానం ఒకసారి నేర్పిస్తే వారు ఆడుకునే అవకాశం ఉంటుంది. దీని వల్ల ఆట నియమాలు, గెలుపు ఓటములు సమంగా స్వీకరించడం, గెలవడానికి ప్రయత్నించడం నేర్చుకుంటారు. ఆటలాడుతూ పెరిగిన పిల్లలు ఓటమికి అతిగా కుంగిపోవడం గాని, ఒక్క గెలుపుతో ఇక చెయ్యాల్సింది లేదన్నట్టు ఉండడం గాని చెయ్యరు. ఆటలలో ప్రతి చిన్న వ్యక్తిగత విజయం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతు, చదువులలో నెమ్మదిగా ఉండే పిల్లలకు తన నైపుణ్యానికి జట్టులో లభించే గుర్తింపు వల్ల ఆత్మగౌరవం పెరిగి చదవడంలో ఆసక్తి పెంచుకుంటాడు.
వీటిని తయారు చేయించవచ్చు
ఇంట్లో ఉండే చిత్తు పేపర్స్‌తో పాము, తరాజు, పంచపాల, తుపాకీ, జల్లెడ, చొక్కా, కేమెరా, గులాబీ పువ్వు, పూలబుట్టి, రాకెట్, పడవ, కత్తి పడవ, తల, ఇల్లు లాంటి ఎన్నో రకాల బొమ్మలు తయారు చేయడం కూడా నేర్పించవచ్చు. దీనికి మీరు కేవలం అతికించడానికి గమ్, కొన్ని రంగు కాగితాలు, పాత దినపత్రికలు అందుబాటులో ఉంచితే చాలు. మీరు ఊహించని బొమ్మలు కూడా తయారు చేసి మీకు బహుమతిగా ఇస్తారు. పిల్లల్లో సహజంగా ఉన్న తెలివి తేటలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అందుకే మీ పిల్లలకు మీరు మంచి నడవడికతో పాటు సృజనాత్మకత పెంచే అన్ని సహజసిద్ధ ఆటలు, పనులు నేర్పించండి.
ఇవి నేర్చుకుంటారు
కోపం, ఆవేశం, బాధ లాంటివి కలిగినా అవన్నీ ప్రక్కనపెట్టి సర్దుకొని ఆటలు ఆడవలసినదేనని, గెలుపు ఓటములు సహజమని, ఎవరూ నేర్పకుండానే వారికి అలవడుతాయి. ప్రతి ఆటకు వేరువేరు నియమాలు ఉంటాయని, వాటిని తప్పకుండా పాటిస్తేనే ఆటలు ఆడగలమని అప్రయత్నంగానే చిన్నారులు నేర్చుకుంటారు. మార్కెట్‌లో తక్కువ ధరలో దొరికే మెదడుకు మేత ఆటలు, పజిల్స్ తయారు చేయడం, సుడోకు నింపడం, రూబిక్ క్యూబ్ కలపడం, తికమక ఆట వస్తువులు, కలర్ బ్రిక్స్ లాంటివి చిన్నారులకు అందుబాటులో ఉంచి నేర్పించడం వల్ల సమయాన్ని సద్వినియోగ పరుచుకుంటూ ఏకాగ్రతను పెంచుకోగలుగుతారు. నాటి కాలంలో పిల్లలకు అన్నం తినిపించాలంటే ఇంట్లో నుండి చిన్నారులని వాకిట్లోకి లేదా ఆరుబయటకు తీసుకు వెళ్లి చందమామను చూపించడమో లేదా పాట పాడుతూ ప్రకృతి దృశ్యాలు చూపిస్తూ గోరుముద్దలు తిని పించేవారు. కానీ నేటి కాలంలో అలా జరగడం లేదు. ఆకాశాన్ని, ప్రకృతిని చూపించే తీరికా లేదు. పాట పాడుతూ తినిపించేటంత ఓపిక లేదు.
అందుకు వారు ఎంచుకున్న మార్గం ‘పిల్లల చేతిలో సెల్ ఫోన్ పెట్టడం పిల్లవాడి నోట్లో ముద్ద పెట్టడం’ అనే టెక్నిక్‌ను వాడుకున్నారు. తల్లిదండ్రులకూ కావలసింది పిల్లవాడు తినడం మాత్రమే. పిల్లవాడికి కావలసినది మొబైల్ ఫోన్ మాత్రమే. అసలు పిల్లవాడు ఏమి చేస్తున్నాడో, ఏమి తింటున్నాడో, ఎంత తింటున్నాడో ఎవరికీ తెలియదు. ఈ పద్ధతికి అలవాటైన పిల్లలు సెల్ ఫోన్ చేతిలో పెట్టి బొమ్మలు చూపితే గానీ అన్నం తినము అనే స్థాయికి చేరుకున్నారంటే వారిని ఏ స్థాయికి తీసుకు వచ్చామో తల్లిదండ్రులు గమనించాలి. అందుకే చిన్నారులతో ఎక్కువ సమయం గడుపుచు, కొత్త కొత్త విషయాలు నేర్పిస్తూ, సృజనాత్మకత పెరిగేలా వివిధ ప్రక్రియలు నేర్పిస్తూ ఈ వేసవి సెలవులు ఉపయోగించుకొని ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే అవకాశం మీ చేతిలోనే ఉందని గుర్తిస్తారని, నేటి బాలలే రేపటి ఉత్తమ పౌరులని, అలాంటి ఉత్తమ పౌరులుగా మీ చిన్నారులను తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నాను.
గడప రఘుపతిరావు
99634 99282