ఉడుపి కేంద్రంగా కర్నాటకను కుదిపేసిన హిజాబ్ (ముస్లిం మహిళలు ధరించే తలగుడ్డ) కేసులో ఇద్దరు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం నాడిచ్చిన పరస్పర విరుద్ధ తీర్పులు వివాదాన్ని ఎటూ తేల్చలేదు. దీనితో హిజాబ్ ధారణపై కర్నాటక ప్రభుత్వం విధించిన నిషేధం కొనసాగుతుంది. ఈ వాజ్యాన్ని త్రిసభ్య ధర్మాసనం పరిశీలనకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పంపించవలసి వుంటుంది. ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులలో ఒకరైన జస్టిస్ హేమంత్ గుప్తా నిషేధాన్ని పూర్తిగా సమర్థించారు. సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను త్రోసిపుచ్చారు.
ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనాన్ని నెలకొల్పేటప్పు డు పరిశీలించవలసినవంటూ 11 అంశాలను పూసగుచ్చారు. మత స్వేచ్ఛ హక్కును కూలంకషంగా తరచి చూడాలని అన్నారు. మరో న్యాయమూర్తి జస్టిస్ సుధాంశు ధుల్లా హిజాబ్ ధారణ ముస్లిం మహిళల ఇష్టానికి సంబంధించినదని, ధరించడం మానుకోడం వారికే వదిలేయాలని దీనిపై ఇంతకు తక్కువగాగాని, మించి గాని చెప్పాల్సిందేమీ లేదని తీర్పు ఇచ్చారు. హిజాబ్ తప్పనిసరి మత పద్ధతుల్లోకి వస్తుందా, రాదా అనేది ఈ వివాద పరిష్కారంలో పూర్తిగా అనవసరమైన అంశమని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.తన దృష్టి అంతా ఆడ పిల్లల విద్యా హక్కు మీదనేనని ఆయన స్పష్టం చేశారు. చాలా చోట్ల ఆడపిల్ల పాఠశాలకు వెళ్లే ముందు ఇంటి చాకిరీ చేస్తుందని జస్టిస్ ధుల్లా అన్నారు. హిజాబ్‌ను నిషేధించడం ద్వారా ఆమె బతుకును మనమేమైనా బాగు చేయగలుగుతామా అని ప్రశ్నించారు. ముస్లిం విద్యార్థినుల హిజాబ్ ధారణపై గత డిసెంబర్‌లో కర్నాటకలో ఒక్కసారిగా అభ్యంతరం తలెత్తడం వెనుక రాజకీయం ఉన్నదనే అభిప్రాయం ఏర్పడింది. కర్నాటకలో ఉన్నది బిజెపి ప్రభుత్వం కనుక హిందుత్వ శక్తులు ఈ వివాదానికి ఆ రాష్ట్రాన్ని వేదికగా ఎంచుకున్నారనే భావన కలిగింది.
ఉడుపి కళాశాల ఉదంతం తర్వాత ఆందోళన తలెత్తడంతో కర్నాటక ప్రభుత్వం గత ఫిబ్రవరి 5న ఒక ఉత్తర్వు జారీ చేసింది. పాఠశాలలు, కళాశాలల్లో సమానత్వం, సమగ్రత, శాంతి భద్రతలకు హాని కలిగించే దుస్తులను నిషేధిస్తున్నట్టు ఆ ఉత్తర్వు పేర్కొన్నది. అంటే దాని అర్థం హిజాబ్ ధారణను నిషేధించడమే.దీని మీద కొందరు ముస్లిం విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. హిజాబ్ ధారణ అవసరమైన ఇస్లాం మతాచారమా కాదా అనే మీమాంసపై చర్చ జరిగింది. క్రైస్తవ విద్యార్థినులు శిలువ గుర్తును ధరించడం, హిందువులు గాజులు వేసుకోడాన్ని ముస్లిం విద్యార్థులు ప్రస్తావించారు. అదే విధంగా హిజాబ్‌ను కూడా అనుమతించాలని కోర్టును కోరారు. చిక్‌మగళూరులో కొంత మంది హిందూ విద్యార్థులు కాషాయ శాలువాలతో తరగతి గదులకు అనుమతించాలని కోరుతూ ఆందోళన చేశారు.
దీనితో వివాదానికి రాజకీయ రంగు పూర్తిగా అంటుకొన్నది. కర్నాటక హైకోర్టు గత మార్చి 15న హిజాబ్ అనుకూల పిటిషన్లను కొట్టివేసింది. హిజాబ్ ధారణ ఇస్లాం మతపరమైన విధుల్లోకి రాదని తీర్పు ఇచ్చింది. దానితో వివాదం సుప్రీంకోర్టు కెక్కింది. హిజాబ్‌కు అనుకూలంగా 26 వేర్వేరు పిటిషన్లు అక్కడ దాఖలయ్యాయి. ఈ కేసులో ఇప్పుడు పరస్పర విరుద్ధమైన తీర్పులు రావడంతో హిజాబ్ ధారణపై కర్నాటక ప్రభుత్వం విధించిన నిషేధం కొనసాగుతుంది. అయితే హిజాబ్ అనుకూల పిటిషనర్లు ఎత్తి చూపిన శిలువ ధారణ, గాజులు, సిందూరం వంటి చిహ్నాల వంటివి సబబా కాదా అనే విషయంపై స్పష్టత లేకుండా పోతుంది. దేశాన్ని పాలిస్తున్నది హిందుత్వ ప్రభుత్వం కాబట్టి అది కోరుకుంటున్న విధంగా జరుగుతున్నదనే అభిప్రాయం ఎవరికైనా కలిగితే కలగవచ్చు. కాని విస్తృత ధర్మాసనం తేల్చే వరకు ఈ విషయంలో ఎవరూ చేయగలిగేదేమీ వుండదు. ఎంతో కలకలం రేపిన సున్నితమైన అంశంపై స్పష్టత కొరవడడం సమాజాన్ని ఆందోళనకు గురి చేసి అయోమయంలో పడవేస్తుంది.
అంతకు ముందు వరకు లేని వివాదం తలెత్తడం, సహజీవనం సాగిస్తున్న రెండు మతవర్గాల మధ్య విభజనకు దారి తీయడం దేశ సెక్యులర్ నీతికి విఘాతకరం. విచిత్రంగా మన దేశంలో ముస్లిం మహిళలు హిజాబ్ ధారణను అనుమతించాలని ఆందోళన చేయగా ఇరాన్‌లో ఇందుకు విరుద్ధంగా అక్కడి మహిళలు ఉద్యమిస్తున్నారు. హిజాబ్‌ను సవ్యంగా ధరించలేదనే కారణం చూపి ఒక మహిళను ఇరాన్ నైతిక పోలీసులు నిర్బంధంలోకి తీసుకోడం ఆమె వారి కస్టడీలోనే మరణించడం అక్కడ అతి పెద్ద నిరసనోద్యమానికి దారి తీసింది. 40 మందికి పైగా మరణించినట్టు వార్తలు వచ్చాయి. మృతుల్లో పోలీసులు కూడా వున్నారు. అక్కడ హిజాబ్‌ను వద్దంటున్న ముస్లిం మహిళలు, ఇక్కడ దానిని కావాలంటున్న వారు తమ స్వేచ్ఛను మాత్రమే కోరుకుంటున్నారు. రెండు చోట్లా హిజాబ్ గాని, మత పద్ధతులు గాని ప్రధానమైనవి ఎంత మాత్రం కాదు. తాము కోరుకునే విధంగా దుస్తులను ధరించనివ్వడం లేదనేదే అక్కడి, ఇక్కడి ముస్లిం మహిళల అభ్యంతరం.