Monday, December 23, 2024

అద్దెలు కట్టలేని స్థితిలో ప్రభుత్వ శాఖ కార్యాలయాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సొంత భవనాలు లేకపోవడంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ, ఆబ్కారీ శాఖ కార్యాలయాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చాలావరకు ఈ కార్యాలయాలన్నీ అద్దె భవనాల్లో కొనసాగుతుండడంతో ఆయా భవనాల యజమానులు అద్దెల కోసం అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు శాఖలు కూడా ప్రభుత్వానికి భారీగా ఆదాయం తెచ్చిపెడుతుంటాయి. అయినా వీటి అద్దె చెల్లింపుల్లో ఆలస్యం చేస్తుండడంతో, భవన యజమానులు కోర్టులకు వెళుతున్నారని, దీంతో తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు వాపోతున్నారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ నుంచి ప్రతి సంవత్సరం రూ.10 వేల పైచిలుకు ఆదాయం వస్తుండగా,

ఆబ్కారీ శాఖ నుంచి ప్రతి సంవత్సరం సుమారుగా రూ.30 వేల కోట్ల పైచిలుకు ఆదాయం వస్తోంది. ప్రస్తుతం సబ్ రిజిస్ట్రేషన్ భవనాలు రాష్ట్రవ్యాప్తంగా సుమారుగా 141 ఉండగా, ఆబ్కారీ భవనాలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 40 ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాలతో పాటు 139 ఆబ్కారీ పోలీస్‌స్టేషన్‌లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. వీటి అద్దెలు నెలకు సుమారు రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. దీంతోపాటు నెట్, కరెంట్ బిల్లుల చెల్లింపులో కూడా ఇబ్బందులు తలెత్తుతుండడంతో ఆయా స్టేషన్‌లకు సంబంధించిన అధికారులు ఇబ్బందులు పడుతున్నారు.
నెట్, కరెంట్ బిల్లుల చెల్లింపులు
తమ సొంత డబ్బులతో నెట్, కరెంట్ బిల్లులను చెల్లింపులు చేసి రోజు వారీ పనులు జరిగేలా చూస్తున్నామని అధికారులు పేర్కొంటున్నారు. అయితే చాలాచోట్ల కిరాయిలు, మిగతా బిల్లులను తాము చెల్లించలేమని మరికొందరు అధికారులు చేతులెత్తేయడంతో ఆయా భవనాల యజమానులు కోర్టును ఆశ్రయించి నోటీసులు జారీ చేస్తున్నారు. దీనికి తోడు వాహనాల అద్దె చెల్లిం పుల విషయంలోనూ బకాయిలను చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని ఆబ్కారీ శాఖ అధికారులు వాపోతున్నారు. ఈ రెండు శాఖల్లో కూడా సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల కిరాయిలను ఆయా భవనాలకు చెల్లించడం లేదని ఇదే విషయమై ఉన్నతస్థాయి అధికారులకు సమాచారం అందించామని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం కొన్ని చోట్ల యజమానుల ఒత్తిళ్లను తట్టుకోలేక ఇరు శాఖల అధికారులు తమ సొంత డబ్బుల్లో కొంత చెల్లించి యజమానుల ఒత్తిడి నుంచి కొంత ఉపశమనం పొందుతున్నారు.
ఒక్కో వాహనానికి రూ.33 వేల చొప్పున….
దీంతోపాటు ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యాలయంలో ఒకరిద్దరు ఉన్నతాధికారులు తప్ప మిగిలిన అధికారులందరూ అద్దె వాహనాలనే వినియోగిస్తున్నారు. రాష్ట్రంలోని ఈఎస్ కార్యాలయాల, ఎక్సైజ్ స్టేషన్‌లది అదే పరిస్థితి. ఒక్కో వాహనానికి రూ.33 వేల చొప్పున నెల వారీ అద్దెను నిర్ణయించారు. వీటిలో చాలా వాహనాలకు 10 నెలలుగా అద్దె చెల్లించడం లేదని తెలుస్తోంది దీంతోపాటు పెట్రోల్, డీజిల్‌కు కూడా తమ సొంత డబ్బులతో పాటు పోయించుకోవాల్సి వస్తుందని ఎక్సైజ్ అధికారులు వాపోతున్నారు.
రంగారెడ్డిలోని ఈఎస్ కార్యాలయాలు నాంపల్లికి తరలింపు
రంగారెడ్డి జిల్లా పరిధిలో ఆబ్కారీ శాఖకు 2 ఈఎస్ కార్యాలయాలు ఉన్నాయి. ఈ రెండింటి అద్దె భారీగా బకాయిపడడంతో వాటిని నాంపల్లిలోని ఎక్సైజ్ ప్రధాన కార్యాలయంలోకి మార్చారు. గోల్కొండ ఎక్సైజ్ స్టేషన్‌ను కిస్మత్‌పూర్‌లోని ఎక్సైజ్ అకాడమీకి తరలించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఆరు ఎక్సైజ్ స్టేషన్‌లకు సంబంధించి రెండేళ్లు అద్దె చెల్లించకపోవడంతో ఆయా భవన యజమానులు కోర్టు మెట్లు ఎక్కినట్టుగా తెలిసింది. దీంతోపాటు వాహనాలకు ఏడాది కాలంగా అద్దె బకాయిలు పేరుకుపోయాయి.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 14 స్టేషన్లు ఉండగా ఈఎస్ కార్యాలయంతో పాటు ఆదిలాబాద్ స్టేషన్‌కు మాత్రమే సొంత భవనాలున్నాయి. మిగతా 12 భవనాల్లో కొనసాగుతున్న కార్యాలయాలకు ఏడాదిగా అద్దె చెల్లించకపోవడంతో యజమాని నుంచి ఒత్తిళ్లు ఎదురవుతున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన స్టేషన్లకూ ఆరు నెలల నుంచి ఏడాది వరకు అద్దె బకాయిలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇలా చాలా జిల్లాలో ఇరు శాఖల కార్యాలయాలకు సంబంధించి అద్దెలు చెల్లించకపోవడంతో అధికారులు ఇబ్బందులు పడుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News