శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, మీడియాలు ప్రజాస్వామ్య పరిరక్షణకుఉన్న ప్రధాన నాలుగు స్తంభాలు. ఈ నాలుగు స్తంభాలలో ఉన్న మీడియా ప్రజాస్వామ్య పరిరక్షణలో అత్యంత ప్రధానమైన భూమిక పోషిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అంతటి ప్రాధాన్యత కలిగిన మీడియా రంగంలో పని చేసే జర్నలిస్టుల జీవనాలు ప్రస్తుతం ఇంట్లో ఈగల మోత -బయట పల్లకీ మోతగా ఉంది. దేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని మీడియా సంస్థలలో పని చేస్తున్న వివిధ వర్గాల వారు అనుభవిస్తున్న కష్టాలు వర్ణనాతీతం. మీడియా సంస్థలలో వివిధ హోదాల్లో పని చేస్తున్నవారు తమ ఆరోగ్యాలు సైతం లెక్కచేయకుండా రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ ప్రజాస్వామ్య విలువలు కాపాడేందుకు తమ జీవితాలు అర్పిస్తున్నారు. కానీ మీడియా సంస్థలలో పని చేస్తున్న వారిలో 90% పైగా దుర్లభమైన జీవితాన్ని అనుభవిస్తుండడం దురదృష్టకరం.
చాలీచాలని జీతాలతో, పిల్లలను సరైన చదువులు చదివించుకోలేక, స్వంత ఇళ్ళు లేక, ఇంటి బాడుగలు కట్ట లేక, అకస్మాత్తుగా తీవ్రమైన అనారోగ్యం చేస్తే తగిన వైద్యం చేయించుకునే ఆర్ధిక స్తోమత లేక, ఉద్యోగ రక్షణ లేక అష్టకష్టాలు అనుభవిస్తున్నారు. అదే విధంగా జర్నలిస్టులు అకాల మరణం చెందుతుండడంతోవారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. జర్నలిస్టు సమస్యలను పరిష్కరించమని అనేక సంవత్సరాలుగా జర్నలిస్టు యూనియన్లు అన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాయి. అయినా అనేక సంవత్సరాలుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు జర్నలిస్టుల సమస్యలపై మీనమేషాలు లెక్కిస్తున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో రాష్ట్రంలోని జర్నలిస్టులు ప్రధానపాత్ర పోషించారని కచ్చితంగా చెప్పవచ్చు.
తెలంగాణ నూతన రాష్ట్రం ఏర్పడితే ఎన్నో సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు తీరుతాయని జర్నలిస్టులు అనేక ఆశలు పెట్టుకొని ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. తెలంగాణ నూతన రాష్ట్రం ఏర్పడిన కొద్ది రోజులకే జర్నలిస్టుల ఆశలు అడియాశలు అయ్యా యి. గత పది సంవత్సరాలుగా కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో జర్నలిస్టులు ఒక విధంగా నిరాదరణకు గురి అయ్యారనే చెప్పాలి. 2014 లో నూతనంగా ఏర్పడిన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన కె. చంద్రశేఖర్ రావు జర్నలిస్టులకు అనేక హామీలు ఇచ్చారు. ప్రింట్ మీడియా, ఎలెక్ట్రానిక్ మీడియా లాంటి వివిధ రకాల మాధ్యమాలలో జర్నలిస్టుగా, డెస్క్‌లో పని చేస్తున్న వారితో పాటు ఫోటో గ్రాఫర్, వీడియో షూటర్ లాంటి వివిధ హోదాలలో పని చేస్తున్న అర్హులైనందరికీ అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేస్తామని, రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ త్రిబుల్ బెడ్ రూమ్‌లు ఇస్తామని, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలు కొని జర్నలిస్టులు అందరికీ ఇళ్ళు వచ్చేటట్లు జర్నలిస్టు కాలనీలు నిర్మిస్తామని, ప్రతి జర్నలిస్టుకు హెల్త్ కార్డు అందచేసి వారికి అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం అందే విధంగా చర్యలు తీసుకుంటామని, ప్రతి సంవత్సరం రూ. 100 కోట్లతో జర్నలిస్టుల సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని గత సిఎం కె. చంద్రశేఖర్ రావు జర్నలిస్టులకు ఇచ్చిన హామీలలో ముఖ్యమైనవి.
కానీ ఇవేమీ అమలుకు నోచుకోకపోవడం గమనార్హం. రాష్ట్రంలోని జర్నలిస్టులకు ఒక్క త్రిబుల్ బెడ్ రూమ్ ఇచ్చిన దాఖలాలూ లేవు. మండల, జిల్లాల పరిధిలోని విలేకరులకు అక్కడక్కడా ఆయా శాసన సభ్యుల చొరవతో కొంతమంది విలేకరులకు మాత్రం ఇండ్ల స్థలాలు 2019 ఎన్నికల ముందు కేటాయించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆ ఊసే లేదు. అనేక ప్రధానమైన కార్పొరేట్ ఆసుపత్రుల్లో జర్నలిస్టుల హెల్త్ కార్డులను ఆమోదించే పరిస్థితి నేటికీ లేదు. దాంతో కిడ్నీ, లివర్, గుండె, బ్రైన్ లాంటి సున్నితమైన జబ్బులకు అన్ని సౌకర్యాలు కలిగిన నాణ్యమైన వైద్యం చేయించుకోలేక జర్నలిస్టులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రెస్ అకాడెమీ ద్వారా జర్నలిస్టుల సంక్షేమ నిధి సంవత్సరానికి కేవలం రూ. 20 కోట్ల కేటాయించడంతో అనేక ఇబ్బందులుపడుతున్న జర్నలిస్టులందరికీ తగిన ఆర్ధిక సహాయం అందడం లేదు. గత ప్రభుత్వంలో నిరాదరణకు గురైన జర్నలిస్టులు ఇటీవల రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కోటి ఆశలు పెట్టుకున్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా ఏర్పడినందున ఇంకా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం వైపు చూపు మరల్చలేదు. అనేక సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉండి తమ ప్రభుత్వంపై అనేక ఆశలు పెట్టుకున్న జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించవలసిన బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వంపైన ఉందని కచ్చితంగా చెప్పవచ్చు. మీడియా రంగంలో పని చేసే అందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్ళు యుద్ధ ప్రాతిపదికన ఇవ్వడం, సంవత్సరానికి రూ. 500 కోట్లతో జర్నలిస్టుల సంక్షేమ నిధి ఏర్పాటు చేయడం, సుదీర్ఘ కాలం బాధ్యతలు నిర్వర్తించి ఉద్యోగ విరమణ చేసిన పాత్రికేయులకు ప్రభుత్వ పరంగా తగిన పెన్షన్ ఇవ్వడం, అక్రిడిటేషన్ కలిగిన పాత్రికేయుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలో ఫీజుల రాయితీ కల్పించడం వంటి అనేక జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యలు వెంటనే పరిష్కరించి, రాష్ట్రంలోని జర్నలిస్టుల కుటుంబాలలో సిఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెలుగులు నింపుతుందని ఆశిదాం.
కైలసాని శివప్రసాద్
9440203999