జఫర్‌గడ్ : మండల కేంద్రంలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేసిన ఘటన కలకల రేపింది. వివరాల్లోకి వెళితే… మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల వెనుక ఉన్న ఖాళీ స్థలంలో బుధవారం రాత్రి 7 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఒకరు తవ్వకాల ప్రారంభించారు. దీంతో గునపం శబ్దం వస్తున్నట్లు గమనించిన చుట్టుపక్కల వారు బయటికి వచ్చి చూశారు. తవ్వకాలు జరుపుతున్న ప్రదేశం చీకటిగా ఉండడంతో ఇరుగు పొరుగు వారు టార్చిలైటు వెలుతురు వేసి చూసే ప్రయత్నం చేశారు. ఇది గమనించిన అతడు అక్కడి నుంచి పారిపోయాడు.
కాగా తవ్వకం చుట్టూ గిరిగీసి నిమ్మకాయలు, కొబ్బరికాయ కొట్టి ఉండడంతో స్థానికులు భయ భ్రాంతులకు గురయ్యారు. కాగా గతంలో జఫర్‌గడ్ మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా సార్లు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినా పట్టుబడ్డ సందర్భాలు లేవు. జఫర్‌గడ్ చారిత్రక ప్రదేశం కావడంతో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని పోలీసులు నిఘా పెడితే నిందితులు పట్టుబడే అవకాశం ఉందని స్థానికులు కోరుతున్నారు.