Wednesday, January 22, 2025

డిజిటల్ సాగుకు జై

- Advertisement -
- Advertisement -

Digital agriculture has bright future:PM modi

వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెంచాలి

కష్టాల్లో చిన్న రైతులు
దేశంలో 80శాతం సన్న, చిన్నకారు వ్యవసాయదారులే, వారి సమస్యల పరిష్కారంపై దృష్టిపెడదాం
టెక్నాలజీ ద్వారా సాగు కష్టాలు దాటుదాం
ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల వేదిక నుంచి ప్రధాని మోడీ

మనతెలంగాణ/హైదరాబాద్ : వ్యవసాయ రంగంలో ప్రపంచ స్థాయి పరిశోధనలకు మనదేశం మంచి వేదికగా మారిందని ప్రధాని నరేంద్రమోడీ వెల్లడించారు. హైదరాబాద్ కేంద్రంగా మెట్ట పంటల వ్యవసాయ పరిశోధనల కేంద్రంగా పనిచేస్తున్న ఇక్రిశాట్ ఏర్పడి 50ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారంనాడు పటాన్‌చెరులోని ఇక్రిశాట్ కేంద్రంలో ప్రధాని ఆ సంస్థ స్వర్ణోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఇక్రిశాట్ ఏర్పడి ఐదు దశాబ్దాలు పూర్తయ్యాని ఈ సుదీర్ఘ యాత్రలో ఎన్నో మైలు రాళ్లను అధిగమించామన్నారు. మన శాస్త్రవేత్తల పరిశోధనలు , మన సాంకేతికత వ్యవసాయ రంగాన్ని సుస్థిరం చేశాయన్నారు. రానున్న 25ఏళ్లలో లక్ష్యాలను నిర్దేశించుకోవాలని శాస్తవేత్తలకు సూచించారు. ఇక్రిశాట్ ప్రపంచ వ్యవసాయ రంగానికి కొత్త దారులు చూపాలని కోరారు. గడిచిన 50ఏళ్లలో ఈ సంస్థ ద్వారా శాస్త్రవేత్తలు ఎన్నో ఎన్నేన్నో అద్భతాలు చేసి చూపారని ప్రశంసించారు. పంటల సాగులో పర్యావరణ హితంగా ఆవిష్కరణలు చేశారంటూ అభినందించారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయటంలో ఇక్రిశాట్ కృషి అమోఘం అన్నారు.

స్వర్ణత్సవ వేళ వ్యవసాయ పరిశోధనల్లో 50ఏళ్ల అనుభవం ఇక్రిశాట్ శాస్త్రవేత్తల సొంతం అని ప్రకటించారు. దేశంలోని 170జిల్లాల్లో కరువు పరిస్థితులు ఉన్నాయన్నారు. ఆరు రుతువులు 50అగ్రి క్లైమాటిక్ జోన్లు ఉన్నట్టు తెలిపారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులకు కూడా తట్టుకుని మంచి దిగుబడులు అందించగల కొత్త రకం వంగడాలను సృష్టించాల్సిన అవసరం ఉందని సూచించారు. మనదేశ వ్యవసాయ రంగానికి ఎంతో ప్రాచీన అనుభవం ఉందన్నారు.పంటల సాగులో భిన్నమైన సాంప్రదాయాలు ఉన్నాయని తెలిపారు. దేశంలో 80శాతం సన్న , చిన్న కారు రైతులే ఉన్నారన్నారు. వీరిలో అధికశాతం సంక్షోభాన్ని ఎదుర్కొంటూ సమస్యలతో నష్టపోతున్నారన్నారు. శాస్త్రవేత్తలు వీరిపై దృష్టిపెట్టాలని సూచించారు. వ్యవసాయంలో సాగు ఖర్చులు తగ్గించేందకు కృషి చేయాలన్నారు. చిరుధాన్య పంటల సాగును పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రసాయన రహిత, సహజ సిద్దమైన ప్రకృతి వ్యవసాయం , సేంద్రియ వ్యవసాయానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని వెల్లడించారు. వ్యవసాయ రంగంలో అధునాతన సాంకేతికను అందిపుచ్చుకోవాలని , పంటల సాగులో డ్రోన్ల వినియోగం పెంచాలన్నారు. పంటల విస్తీర్ణం విశ్లేషణ , పైర్ల పరిస్థితి,తదితర వాటికి డ్రోన్లు వినియోగించుకునేందుకు బడ్జెట్‌లో నిధులు కేయాయించినట్లు తెలిపారు.

డిజిటల్ వ్యసాయానిదే భవిష్యత్తు :

డిజిటల్ వ్యవసాయనికి ఉజ్వల భవిష్యత్తు ఉందని ప్రధాని నరేంద్రమోడి ప్రకటించారు. దేశ వ్యవసాయ ముఖచిత్రాన్ని ఇది పూర్తిగా మార్చివేయనుందన్నారు. యువత ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు. టెక్నాలజీని ఉపయోగించుకుంటూ కృత్రిమ మేధను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ అమృత కాలంలో కఠిన పరిస్థితులను తట్టుకునే శక్తిని పెంపోందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సాగునీటి సంరక్షణ జరగాలన్నారు. నీటి వినియోగపు సామర్థ్ధాన్ని పెంచుకోవాలని సూచించారు. మైక్రో ఇరిగేషన్‌కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేసే అవకాశాలను పెంచుకోవలన్నారు. అయిల్ పామ్‌లో స్వయం సమృద్ధిని సాధించేందుకు ప్రత్యేక మిషన్‌ను అమలు చేస్తున్నామన్నారు. ఈ మిషన్ ద్వారా తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఎంతో ఉపయోగం ఉందన్నారు. ఈ రాష్ట్రాల్లో అయిల్ పామ్ సాగుకు అవసరమైన ప్రోత్సాహం ఇస్తున్నట్టు తెలిపారు.దేశంలో 35మిలియన్ టన్నుల వ్యవసాయ ఉత్పత్తుల నిల్వకు శీతల గిడ్డంగులు నిర్మిస్తున్నట్టు వెల్లడించారు.

వ్యవసాయ రంగంలో మౌలిక వసతులును పెంపోందించేందుకు లక్ష కోట్లు కేటాయించామని తెలిపారు. దేశం వ్యవసాయోత్పత్తుల్లో స్వయం సమృద్దిని సాధించిందన్నారు. ఆహారధాన్యాల్లో మిగులు స్థితికి చేరామని ఇప్పుడు ఆహార భధ్రతతోపాటు పోషకాహార భద్రత రావాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా నూతన వంగడాలు రూపొందించాలని సూచించారు. ఇందుకోసం ఎంతో అనుభవం ఉన్న ఇక్రిశాట్‌తోపాటు ఐసిఏఆర్ , వ్యవసాయ విశ్వవిద్యాలయాలు కలిసి కట్టుగా కృషి చేయాలని సూచించారు.తనకు పోహకాహార భద్రతను సాధిస్తామన్న నమ్మకం ఉందన్నారు. వ్యవసాయరంగంలో సమస్యలకు టెక్నాలజీ ద్వారానే పరిస్కారం చూపాలన్నారు. సరికొత్త సంకల్పంతో ముందుకు సాగుదామని ప్రధాని నరేంద్రమోడి వ్యవసాయ శాస్త్రవేత్తలకు పిలుపు నిచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News