Wednesday, December 4, 2024

ప్రతి ఇంటికి డిజిటల్ నెంబర్‌లు, క్యూ ఆర్ కోడ్‌లు

- Advertisement -
- Advertisement -

డిజిటల్ డోర్ నెంబర్ ఆధారంగా
ఇళ్లు నగరం/పట్టణం, వార్డు/డివిజన్‌లు ఎక్కడ ఉన్నాయో
ఈజీగా తెలుసుకునేలా గూగుల్‌మ్యాప్‌తో అనుసంధానం
రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్ల త్వరలో అమల్లోకి

Digital and QR code to every house

మనతెలంగాణ/హైదరాబాద్:  మున్సిపాలిటీ, కార్పొరేషన్‌లలో ఉన్న ప్రతి ఇంటికి డిజిటల్ నెంబర్‌లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే దీనికి సంబంధించి పైలెట్ ప్రాజెక్టుగా గతంలో సూర్యాపేట మున్సిపాలిటీని ఎంపిక చేసి అక్కడ చాలా ఇళ్లకు నెంబర్‌లను కేటాయించగా, ప్రస్తుతం హైదరాబాద్‌లోని నిజాంపేట నగరపాలక సంస్థ ప్రగతినగర్‌లోని 5వ డివిజన్, బాచుపల్లిలోని 17వ డివిజన్, బండ్లగూడ 19వ డివిజన్‌లో డిజిటల్ నెంబర్‌లను కేటాయించాలని అధికారులు నిర్ణయించారు. డిజిటల్ నెంబర్‌లతో పాటు వీటికి క్యూ ఆర్ కోడ్‌ను కేటాయించనున్నారు. ప్రతి డిజిటల్ నెంబర్‌కు క్యూఆర్ కోడ్ ఉంటుంది. దీనిని స్కాన్ చేస్తే ఇంటి యజమాని పేరుతో సహా చిరునామాను సులభంగా గుర్తించవచ్చు. కాలనీల్లోని ప్లాట్ నెంబర్‌నే డోర్ నెంబర్‌గా రూపొందించారు. ఒక ప్లాట్‌ను ఇద్దరికి విక్రయించినా, అపార్ట్‌మెంట్‌లోని ప్లాట్ కొనుగోలు చేసినా వాటికి బై నెంబర్లను కేటాయిస్తున్నారు. దీంతోపాటు డిజిటల్ నెంబర్‌లను గూగుల్‌మ్యాప్‌తో అనుసంధానించేలా www.myddn.org వెబ్‌సైట్‌ను రూపొందించారు. దీని ద్వారా వెంటనే అడ్రస్‌ను తెలుసుకోవచ్చు. దీంతోపాటు ప్రతి ఇంటికి డిజిటల్ నంబర్‌తో కూడిన పలకను అతికించాలని అధికారులు నిర్ణయించారు.
ఆస్తుల బదిలీకి అనుసంధానం
ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాద్‌లాంటి పట్టణాల్లో ఏదైనా ఇంటి చిరునామా కనుగొనాలంటే నానా తిప్పలూ పడాల్సి వస్తోంది. ఈ సమస్యను అధిగమించేందుకు ఇళ్లకు డిజిటల్ నెంబర్‌లను కేటాయించాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా జరిగే ఆస్తుల రిజిస్ట్రేషన్‌లకు త్వరలోనే వీటిని అనుసంధానం చేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లో డిజిటల్ నెంబర్‌ల కేటాయింపు అనంతరం మనం ఏదైనా ఆస్తిని కొనుగోలు చేసినప్పుడు ఈ డిజిటల్ నెంబర్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌లో వచ్చేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు.
డిజిటల్ డోర్‌నెంబర్లు
రాష్ట్రంలోని ప్రతి ఇంటికి 16 అంకెల డిజిటల్ డోర్‌నెంబర్‌లను పురపాలక శాఖ కేటాయించనుంది. ఈ 16 అంకెల్లో మూడు విభాగాలు ఉండనున్నాయి. నగరం/పట్టణాన్ని తెలిపేందుకు ఓ కోడ్, స్థానిక డివిజన్/వార్డును తెలిపేందుకు మరో కోడ్, స్థానిక కాలనీని తెలిపేందుకు మరో కోడ్ ఉండనుంది. ఈ మూడు కోడ్ల తర్వాత ప్రతి ఇంటికి ప్రత్యేక డోర్ నెంబర్‌ను కేటాయించనున్నారు. డిజిటల్ డోర్ నెంబర్ ఆధారంగా ఇళ్లు ఏ నగరం/పట్టణం, ఏ వార్డు/డివిజన్లో ఉన్నాయో తేలికగా కనుక్కునే విధంగా ఈ నెంబర్‌ల సిరీస్ ఉండనుంది.
నగరాలు, పట్టణాలు, డిజిటల్‌గా
రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో ఇంటి నెంబర్ల ఆధారంగా ఇళ్లను దొరక పట్టడం ఇబ్బందిగా మారింది. చాలాసార్లు ఇంటి నెంబర్ ఆధారంగా అడ్రస్ తెలుసుకోవాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఒక్కో ఇంటి నెంబర్ ఒక్కో దగ్గర ఉండటమే దీనికి కారణం. దీంతో ప్రతి పట్టణం, నగరాల్లోని ఇళ్లకు ఆధునిక విధానంలో క్యూఆర్ కోడ్ ఉపయోగిస్తూ ఇంటి నెంబర్లు ఇవ్వాలని మున్సిపల్ శాఖ నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటిలో ఇంటి నెంబర్లను క్యూఆర్ కోడ్ విధానంలో ఇవ్వనున్నారు. ఇంటి నెంబర్ నెంబర్లను కూడా డిజిటల్ విధానంలో ఇవ్వడం ద్వారా నగరాలు, పట్టణాలు, డిజిటల్‌గా మారనున్నాయి.
అధ్యయనం చేసిన కమిటీ
ఇంటి నెంబర్‌కు క్యూఆర్ కోడ్ విధానంలో డిజిటల్ డోర్ నెంబర్లను ఇవ్వడానికి గతంలో రాష్ట్రప్రభుత్వం 12 మందితో కమిటీని వేసింది. ఆ కమిటీ వివిధ పట్టణాల్లో విజయవంతమైన విధానాన్ని అధ్యయనం చేసిన ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. దీంతో ఈ విధానాన్ని ఇక్కడ అమలు చేయాలని నిర్ణయించడంతో పాటు సాంకేతికంగా ఇంకా మెరుగైన విధానంలో భాగంగా క్యూఆర్ నెంబర్లను కూడా డిజిటల్ నెంబర్‌లకు జత చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోని వివిధ పట్టణాల్లో ఈ విధానం విజయవంతం కావడంతో దీనిని ఇక్కడ ప్రవేశపెట్టారు. డిజిటల్ ఇంటి నెంబర్ల విధానాన్ని జిహెచ్‌ఎంసీలో గతంలో ప్రారంభించినా కొన్ని కారణాలతో అది నిలిచిపోయింది. త్వరలో తిరిగి అన్ని ప్రాంతాల్లో అమల్లోకి తీసుకురావడానికి జిహెచ్‌ఎంసి కసరత్తు చేస్తోంది.
క్యూఆర్ కోడ్ ద్వారా శానిటేషన్ వివరాలు సైతం
క్యూఆర్ కోడ్ ద్వారా శానిటేషన్ ఇంటి నుంచి సేకరించే వారు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సరిపోతుంది. వారు రోజుకు ఎన్ని ఇళ్ల నుంచి చెత్త సేకరిస్తున్నారన్న విషయం తెలిసిపోనుంది. దీంతో జవాబుదారీతనం పెరగనుందని అధికారులు తెలిపారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఇంటికి సంబంధించిన సమగ్ర వివరాలతో పాటు ఇంటి పన్ను వివరాలు, చెల్లించే తేదీ, నీటి పన్ను, ఇతర పన్నులకు సంబంధించిన వివరాలన్ని అందులో ఉంటాయి. ఆస్తిపన్ను వసూళ్లకు వచ్చే సిబ్బంది ఇంటి నంబరు పలకపై ఉన్న బార్‌కోడ్ స్కాన్ చేస్తే చెల్లింపులు, బకాయి వివరాలు వారి చేతుల్లోని పరికరంలో ప్రత్యక్షమవుతాయి. ఇతరులెవరైనా స్కాన్ చేస్తే యజమాని పేరు మాత్రమే చూపుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News