Saturday, January 25, 2025

30 రోజుల్లో డిజిటల్ హెల్త్ కార్డులు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : మరో 30 రోజుల్లో ప్రజలకు డిజిటల్ హెల్త్‌కార్డులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి తెలిపారు. ఎవరైనా ఆసుపత్రికి వెళితే తరచూ ప్రాథమిక పరీక్షలు చేయాల్సి వస్తుందని, హెల్త్ కార్డులు లేకపోవడం వల్లే తరచూ ప్రాథమిక పరీక్షలు చేయాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు. అందుకే రాష్ట్రంలో ప్రతీ ఒక్కరి హెల్త్ ప్రొఫైల్‌ను డిజిటలైజ్ చేసేందుకు చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజల హెల్త్ ప్రొఫైల్ డిజిటలైజ్ చేస్తామన్నారు. హెల్త్‌కార్డుల్లో గత చికిత్స వివరాలు పొందుపరుస్తామని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. విద్యానగర్‌లో శుక్రవారం దుర్గాబాయి దేశ్‌ముఖ్ రెనోవా క్యాన్సర్ సెంటర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మాజీ రాజ్యసభ సభ్యులు వీహెచ్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, విద్య, వైద్యానికి తమ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు.

ప్రజలందరికీ ఆరోగ్య భద్రత కల్పించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.క్యాన్సర్ చికిత్స కోసం పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని మంత్రి దామోదర రాజనర్సింహకు సిఎం సూచించారు. పేదలకు వైద్యం అందించడంలో దుర్గాబాయి దేశ్ ముఖ్ హాస్పిటల్ మరొక అడుగు ముందుకు వేయడం అభినందనీయమని పేర్కొన్నారు. క్యాన్సర్ మహమ్మారితో చాలా మంది అనేక ఇబ్బందులు పడుతున్నారని, క్యాన్సర్ చికిత్స పేదలకు భారామవుతుందని అన్నారు. రాష్ట్రంలో క్యాన్సర్ వైద్య సేవలు అందరికీ అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. సమర్థుడైన వ్యక్తి ఆరోగ్య శాఖకు మంత్రిగా ఉన్నారని అన్నారు. దుర్గాబాయి దేశ్‌ముఖ్ హాస్పిటల్ యాజమాన్యం తమ దృష్టికి తీసుకొచ్చిన ప్రతిపాదనలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సిఎం ఆంధ్ర మహిళా సభ సేవా నిరతిని కొనియాడారు. క్యాన్సర్ వ్యాధి వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ, దుర్గాబాయి దేశ్‌ముఖ్ రెనోవా కేన్సర్ సెంటర్ ద్వారా పేదలకు అత్యాధునిక చికిత్స అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. ప్రజలందరి ఆరోగ్య సమాచారాన్ని డిజిటలైజ్ చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టనుందని, ఈ విషయంలో స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్ల కట్టుబడి ఉందని, ప్రతి జిల్లాలో క్యాన్సర్ సెంటర్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రెనోవా గ్రూప్ చైర్మన్ శ్రీధర్ పెద్దిరెడ్డి, దుర్గాబాయి దేశ్‌ముఖ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ చైర్మన్, దుర్గాబాయి దేశముఖ్ హాస్పిటల్స్ మాజీ అధ్యక్షురాలు లక్ష్మి, ఆంధ్ర మహిళా సభ ట్రస్టీ ఐ.వి.ఆర్ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. క్యాన్సర్ సెంటర్ నిర్మాణానికి విరాళాలు అందించిన దాతలను ఈ సందర్భంగా సత్కరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News