Monday, December 23, 2024

డిగ్రీ చదువులకు డిజిటల్ లిటరసీ

- Advertisement -
- Advertisement -

ప్రపంచ వ్యాప్తంగా 17% జనాభా 15 – 24 ఏండ్ల లోపు వయసు గల యువజనుల రూపంలో ఉన్నట్లు విశ్లేషణలు వివరిస్తున్నాయి. ప్రపంచ యువతలో 77% అసంఘటిత ఉపాధుల్లో నిమగ్నమై వున్నారు. పురుషుల కన్నా మహిళలు అక్షరాస్యతలో 4% వెనుకబడి ఉన్నట్లు అంచ నా. యువతలో 20% మంది మానసిక అనారోగ్య వలలో చిక్కుకున్నారని, 152 మిలియన్ల యువత దారిద్య్ర రేఖకు దిగువన మగ్గుతున్నారని తెలుస్తున్నది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 66.67 శాతం యువత ఆర్థికంగా బలహీనంగా ఉన్నారని, 126 మిలియన్ల యువత చదవడం/రాయడం చేయలేరని విశ్లేషణ చేస్తున్నారు. నేడు 30 ఏండ్ల లోపు యువ జనాభా 3 బిలియన్ల వరకు ఉందని, యువశక్తిని సన్మార్గంలో పడితే ప్రపంచ మానవాళి సమస్యలన్నింటికీ సత్వర పరిష్కారాలు లభించడం సాధ్యమవుతుంది.

వివిధ డిజిటల్ అంతర్జాల్ మాధ్యమ వేదికల్లో సమాచారాన్ని టైప్ చేయడం, సమాచారాన్ని అన్వేషించడం, సమాచారాన్ని మూల్యాంకనం చేయడం, సమాచారాన్ని వితరణ చేయడం లాంటి ఆధునిక యుగపు పరిజ్ఞానం కలిగిన పౌరులను ‘డిజిటల్ లిటరేట్స్’గా వర్గీకరిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా 15- 24 ఏండ్ల లోపు యువతలో 71% ఇంటర్నెట్ వాడుతున్నారని, డిజిటల్ అసమానతలతో 346 మిలియన్ల యువత (పేద అభివృద్ధి చెందిన దేశాలు) ఇంటర్నెట్‌కు దూరంగా ఉన్నారనితేలింది. ఇండియాలో 38% కుటుంబాలు (61 శాతం పట్టణ, 25 శాతం గ్రామీణ) డిజిటన్ లిటరసీ కలిగి ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 120 దేశాల ఇంటర్నెట్ లిటరసీ జాబితాలో భారత ర్యాంకు 73 గా విశ్లేషించారు. డిజిటల్ టెక్నాలజీతో ఉత్పత్తి, కార్యదక్షత, వనరుల నిర్వహణ, పారదర్శకత, అత్యున్నత ఖచ్చితత్వం, సంతృప్తికర సేవలు, జవాబుదారీతనం, ఇన్నోవేషన్, వేగంగా మార్కెటింగ్, ఆదాయవృద్ధి, సమకాలీనత లాంటి అనేక అభివృద్ధి సాధన ప్రయోజనాలు ఉన్నాయి.

4వ పారిశ్రామిక ‘సైబర్’ విప్లవ్ యుగంలో యువత:
ఆవిరి యంత్రాల రాకతో 1వ పారిశ్రామిక విప్లవం(1765), విద్యుత్/ గ్యాస్/ చమురు వనరుల వినియోగంతో 2వ పారిశ్రామిక విప్లవం(1870), ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్లు/ న్యూక్లియర్ ఎనర్జీల రాకతో 3వ పారిశ్రామిక కంప్యూటర్ విప్లవాలను (1969) దాటుతూ నేడు డిజిటల్ యుగపు ఆధునిక రూపంగా 4వ పారిశ్రామిక సైబర్ విప్లవ (కృత్రిమమేధ, ఆటోమేషన్, బయోటెక్నాలజీ, ఐఒటి, రోబోటిక్స్ లాంటి) ఫలాలను అనుభవిస్తున్న అత్యాధునిక సమాజంలో మానవాళి శాస్త్రసాంకేతిక సునామీలో మునిగితేలుతున్నారు.కరోనా విజృంభణతో 5వ డిజిటల్ (సూపర్ స్మార్ట్ సొసైటీ, ఆరోగ్య రంగంలో కృత్రిమమేధ వినియోగం) రిమోట్ కంట్రోల్ విప్లవం రానుందని అంచనా వేస్తున్నారు. ‘డిజిటల్ యుగపౌరులు’ గా నేటి యువతీ, యువకులకు వృత్తి, ఉద్యో గ, ఉపాధి, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా పలు రంగాల్లో అనంతమైన అవకాశాల నడుమ తీవ్ర సవాళ్ళు కూడా ఎదురవుతున్నాయి.

కంప్యూటర్లతో ఇంటర్నెట్ అనుసంధాన మేలు కలయికతో ఆధునిక తీరుతెన్నులు ఆసాంతం మారిపోయాయి.ఇంటర్‌నెట్ అయోమయ, మాయాజాల, కృత్రిమ వలలో చిక్కిన నేటి యువత తీవ్రమైన బహుమితీయ సవాళ్ళను, ప్రమాదకర పరిణామాలను ఎదుర్కోవలసి కూడా వస్తున్నది. డిజిటల్ యుగ యువత ఎదుర్కొంటున్న ముఖ్య సవాళ్ళలో సామాజిక (సోషియల్), భౌతిక (ఫిజికల్), మానసిక (సైకలాజికల్), నైతిక (మోరల్) అంశాలు అనేకం దాగి ఉన్నాయి. పలు ప్రపంచ దేశాల్లో పేదరికం, అసమానతలు, నిరుద్యోగం, అధిక జనాభా, సామాజిక ఆర్థిక సమస్యలు, ఆరోగ్య అవాంతరాలు, కనీస వనతులు కొరవడడం లాంటి సమస్యలు నేటికీ రాజ్యమేలుతున్నాయి.చిరుప్రాయం నుంచే ఇంటర్నెట్ అద్భుత్ వలయంలో గంటల పాటు గడుపుతున్న డిజిటల్ కాలంలో ఏకాంతంలో కంప్యూటర్ గేమ్స్, సామాజిక మాధ్యమాల్లో విహారాలతో మానవ సంబంధాలు బలహీనపడడం, నేత్ర జబ్బులు, అశ్లీల పోస్టుల పరిచయాలు, లైంగిక దురాలోచనలు, అత్యాచారాలు, సైబర్ బుల్లీయింగ్, అక్రమ మానవ రవాణాలు,

విచిత్ర ప్రవర్తనలు, బాలలపై అత్యాచారాలు, సామాజం నుంచి వెలి వేసిన భావన, అభ్యంతరకర ప్రవర్తన, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం, ఆత్మహత్య ధోరిణి, బాల కార్మికులు, వెట్టి చాకిరీ, చదువుపై ఏకాగ్రత లోపించడం, ఆటపాటలకు దూరం కావడం, వ్యక్తిత్వ వికాసం ఆగి / తరిగిపోవడం, కుటుంబ సంబంధాలు విచ్ఛిన్నం కావడం, సామాజిక ఘర్షణలు లాంటి అవలక్షణాలు కలుగుతాయి.గంటల తరబడి ఇంటర్‌నెట్ పట్టుకొని సోఫాలు /కుర్చీలు / బెడ్స్‌లకు అతుక్కుపోవడం వల్ల శారీరక వ్యాయామాలు లోపించడంతో బాల్యంలోనే స్థూలకాయ సమస్యలు, ఫాస్ట్ ఫుడ్స్ పట్ల వ్యామోహం, కదలిక లేని నిశ్చల జీవన శైలితో నేటి బాలలు, మానసిక ఒత్తిడి, నేర ప్రవృత్తి, ఆన్‌లైన్ మోసాలు, ఆత్మన్యూనత భావన, వ్యక్తిగత సమాచారాన్ని దాచి పెట్టడం లాంటి పలు తీవ్రమైన శారీరక, మానసిక సవాళ్ళను ఎదుర్కొంటున్నారు. డిజిటల్ ఉపకరణాల వలలో చిక్కి దృష్టి, కీళ్ళు, కండరాలు, ఒత్తిడి, చర్మ, శ్వాస, మానసిక, నిద్రలేమి సమస్యలకు దారి తీస్తున్నాయి.

డిజిటల్ వలయ దుష్ప్రభావంతో పిల్లల్లో పలు మానసిక సమస్యలు కనిపిస్తాయి. అసాంఘిక ప్రవర్తనలు, లైంగిక వికృతాలోచనలు, కుల, మత వివక్షలు, వికృత క్రీడలు, మహిళల పట్ల విపరీత ధోరిణీ, మానసిక విపరీతాలు లాంటి అనేక సమస్యలు యువత భవితకు అడ్డుగా నిలుస్తున్నాయి. సాంస్కృతిక, నైతిక, మతపరమైన విపరీత ప్రవర్తనలతో పాటు ఛాందస వాదనలు, మత విద్వేషాలు, రెచ్చగొట్టే ఉపన్యాసాలు, భావ కాలుష్యాలు, జాతి వర్ణ వర్గ వివక్షలు, అసహనం, తీవ్రవాద ఆలోచనలు, ఉగ్రవాద భావనలు, అశాంతి, అస్థిర సమాజం లాంటి సమస్యలు పిల్లల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అశ్లీల మాధ్యమాలు అరచేతిలో అందుబాటులో ఉన్నందున ఆల్కహాల్, డ్రగ్స్, స్మోకింగ్ కన్నా అతి ప్రమాదకరమైన దుష్పరిణామాలైన లైంగిక హింసలు, మహిళ వేధింపులు, అత్యాచార, హత్యలు లాంటి అనైతిక సమస్యలు పెరుగుతున్నాయి. స్మార్ట్ట ఫోన్ రూపం లో నీలి వీడియోలు అందుబాటులోకి రావడంతో బాలికల్లో 33%, బాలల్లో 13% లైంగిక హింసకు గురికావడం జరిగినట్లు తేలింది.

విద్య, డిజిటల్ నైపుణ్యం, ఆశావహ దృక్పథం కలిగిన యువతకు డిజిటల్ ప్రపంచం రెడ్ కార్పెట్ వెల్ కమ్ పలుకుతోంది. పుట్టుకతోనే ఇంటర్నెట్ అనుభవిస్తున్న పిల్లల్ని ‘డిజిటల్ నేటివ్స్’, ఇంటర్నెట్ వినియోగాన్ని నేర్చుకుంటున్న పెద్దల్ని ‘డిజిటల్ ఇమ్మిగ్రాంట్స్’ గా తరాలను వర్గీకరించాల్సి వస్తున్నది. డిజిటల్ ప్రపంచంలో విహరిస్తున్న నేటి బాల బాలికలు, యువతీ యువకులు తీవ్రమైన సమస్యలతో సంసారం చేస్తూ శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, భావోద్వోగ రోగులుగా మిగిలి పోవడంతో ప్రపంచ మానవాళి భవిత ప్రశ్నార్థకం అవుతున్నది. డిజిటల్ విప్లవ సునామీతో యువతకు అనేక ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు దారులు తెరుచుకున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్, పౌర సమాజం సమన్యయంతో కదిలితే విద్య, సాంకేతిక, ఆరోగ్య, ప్రజా సేవలు, న్యాయ వ్యవస్థ, ఆర్థిక, సమాచార సంభాషణా టెక్నాలజీ, ఇ -వ్యాపార వాణిజ్య రంగాల్లో అసంఖ్యాకమైన డిజిటల్ రంగ అవకాశాలు అందుతున్నాయి.డిజిటలైజేషన్ ఆవిష్కరణతో కరోనా విపత్తులో ఆన్‌లైన్ విద్య, సమావేశాలు, వ్యాపార సేవలు నిరాటంకంగా అందడం మనకు తెలుసు.

డిజిటల్ వేదికలుగా విద్య, శిక్షణ, ఉద్యోగ, వ్యాపార అవకాశాలు పలు రెట్లు పెరిగాయి. డిజిటలైజేషన్‌తో యువతలో శాస్త్రీయ అక్షరాస్యత, సృజనశీలత, విలక్షణ నవ్య ఆవిష్కరణలు, సంభాషనా చాతుర్యం, ఆకర్షణీయ ఉద్యోగాలు/ వేతనాలు, విశ్వ కుగ్రామ భావనలు, క్రిటికల్ థింకింగ్, సమస్యల పరిష్కారం, జట్టు స్ఫూర్తి, విదేశీ భాషలు, ప్రజా సమస్యలకు తేలికైన సమాధానాలు, నేర్చుకోవాలనే తపన, సమాచార స్టోరేజ్, ఆటోమేషన్, ఎడిటింగ్, సామాజిక అనుసంధానం, పని తీరులో మార్పు లు, డాటా ఎంట్రీ, సామాజిక మాధ్యమాల విప్లవం, క్షణాల్లో ఆలోచనల వినిమయం, గ్రీన్ వ్యవస్థలతో పర్యావరణ పరిరక్షణ, ఆన్‌లైన్ వస్తు విక్రయాలు, సామాజిక స్పృహ లాంటి ఆధునిక పరిజ్ఞానాలు పెరుగుతున్నాయి. అరచేతిలో స్మార్ట్‌ఫోన్‌తో ఏ సమస్యకైన క్షణాల్లో సరైన సమాధానం ఇవ్వగలిగిన గూగులమ్మ రాకతో మానవ జీవన శైలి పూర్తిగా మారిపోయింది. ఆధునిక యువత మారుతున్న శాస్త్ర సాంకేతికతలను ఆకలింపు చేసుకొని, క్రమం తప్పకుండా శాస్త్ర సాంకేతికతలను ఒంటపట్టించుకొని, డిజిటల్ యుగంతో నిత్యం ‘అప్ డేట్’ కావడానికి కృషి చేయని యెడల వెంటనే ‘అవుట్ డేట్’ కావలసిన అగత్యం ఏర్పడుతుందని గుర్తుంచుకోవాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News