Saturday, November 23, 2024

డిజిటల్ వేదికలకు కళ్లెం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం బుధవారం డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు 2023ను ప్రవేశపెట్టింది. ఇందులో వ్యక్తిగత సమాచార పరిరక్షణకు, డేటా లీక్ కాకుండా భద్రతకు పలు కఠినమైన నిబంధనలను రూపొందించారు. యుజర్ల వ్యక్తిగత డేటాను పరిరక్షించకపోయినా, లేదా దీనిని దుర్వినియోగపర్చినట్లు నిర్థారణ అయినా అటువంటి డిజిటల్ సంస్థలపై రూ 250 కోట్ల మేర జరిమానా విధించేందుకు వీలు కల్పించారు. సంబంధిత బిల్లును లోక్‌సభలో బుధవారం మణిపూర్ అంశంపై ప్రతిపక్షాల నిరసనలు, గందరగోళం నడుమనే కేంద్ర ఐటి మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రవేశపెట్టారు. డేటా భద్రతకు తీసుకోవల్సిన పలు నిబంధనలతో సంస్థలకు షరతులు విధించారు. వ్యక్తుల సమాచార హక్కుకు సంస్థలు ఎటువంటి హానీ కల్గించరాదు. ఇది ఉద్ధేశపూరితంగా జరిగినా లేదా నిర్లక్షంగా జరిగినా సంబంధిత సంస్థలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. జరిమానాలు తీవ్ర స్థాయిలో ఉంటాయని పేర్కొంటూ నిబంధనలను ఖరారు చేశారు.

జరిమానా స్థాయి గరిష్టంగా రూ 250 కోట్ల వరకూ కనిష్టంగా రూ 50 కోట్ల వరకూ ఉంటుంది. 2022 నవంబర్‌లో ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు విడుదల చేసిన ముసాయిదా ప్రతిపాదనలతో పోలిస్తే కట్టడిని కొంత సరళీకృతం చేశారు. వ్యక్తుల సమాచార భద్రతకు సరైన ఏర్పాటుగా డేటా ప్రొటెక్షన్ బోర్డు ఆఫ్ ఇండియా ఏర్పాటు అంశాన్ని కూడా ఈ బిల్లులో ప్రతిపాదించారు. చట్టంలోని నిబంధనలు ఉల్లంఘించినట్లు ఈ బోర్డు ఓ నిర్ణయానికి వస్తే సంబంధితులపై తగు చర్యలకు ముందు వారి వాదనలు వినేందుకు వీలు కల్పిస్తారు. ఈ బిల్లును పార్లమెంట్ ఆమోదించిన తరువాత దేశ పౌరు హక్కులకు తగు భద్రత ఏర్పడుతుందని బిల్లు ప్రవేశపెట్టిన దశలో ఎలక్ట్రానిక్ , ఐటి వ్యవహారాల సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. దీని వల్ల జాతీయ భద్రత, అనారోగ్య సంబంధిత మహమ్మారి పరిస్థితులు, భూకంపాల వంటి అత్యయిక స్థితులలో వ్యక్తులను ఆదుకునేందుకు

ప్రభుత్వం తీసుకునే చట్టబద్ధమైన న్యాయపరమైన అనుసంధానానికి ఈ బిల్లు దోహదం చేస్తుందని మంత్రి తెలిపారు. బిల్లుపై ప్రతిపక్షాల వాదనను ప్రభుత్వం తోసిపుచ్చింది. దీనిని సాధారణ బిల్లుగానే తీసుకువచ్చినట్లు, ద్రవ్యబిల్లుగా ప్రవేశపెట్టారనే వాదనలో నిజం లేదని స్పష్టం చేశారు. ఆన్‌లైన్ వేదికల ద్వారా వ్యక్తుల సమాచారం ఎక్కువగా దుర్వినియోగం అవుతోందని,ఈ దుష్పరిణామాన్ని ఈ బిల్లు కట్టడి చేస్తుందని ఐటి మంత్రి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News