Thursday, January 23, 2025

గోప్యత పేరిట గుప్పెట?

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: దేశ మొట్టమొదటి డిజిటల్ వ్యక్తిగత సమాచార చట్టం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన బిల్లును బుధవారం నాడు రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. రాష్ట్రపతి ఆమోద ముద్ర పడడంతోనే ఇది పూర్తి చట్ట రూపం ధరించి అమల్లోకి వస్తుంది. సహేతుకమైన పరిమితులతో వ్యక్తిగత గోప్యత పౌరుల ప్రాథమిక హక్కు అని 2016లో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఈ చట్టం ఆవశ్యకత ప్రాధాన్యం పొందింది. 2018లో, 2019లో దీనికి సంబంధించిన బిల్లు పార్లమెంటు ముందుకు వచ్చింది. ఆ తర్వాత సంయుక్త పార్లమెంటరీ కమిటీకి నివేదించారు.

ఆ కమిటీ రెండేళ్ళపాటు పరిశీలించి తగిన సవరణలు చేసి 2021లో తుది ప్రతిని సమర్పిం చింది. గత జులైలో కేంద్ర మంత్రివర్గం దానిని ఆమోదించింది. మొన్న 7వ తేదీన బిల్లు లోక్‌సభ ఆమోదం పొందింది. అయితే ఈ చట్టం వల్ల దేశ పౌరుల వ్యక్తిగత సమాచారానికి రక్షణ కలగడం కంటే హాని ఏర్పడడానికే అవకాశాలున్నట్లు విమర్శలు వినవస్తున్నాయి. సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) పెడరెక్కలు విరిచికట్టి, దాని కాళ్ళూ చేతులూ నరికేసిన ఘన చరిత్ర గల ప్రధాని మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఈ చట్టాన్ని కూడా ప్రజలకు గల సమాచార హక్కును నీరుగార్పించే విధంగానే రూపొందించినట్టు బోధపడుతున్నది. తాజా డేటా చట్టంలోని అనేక నిబంధనలు కేంద్ర ప్రభుత్వాధికారులకు విస్తృతమైన సెన్సార్ షిప్ అధికారాలను కట్టబెడుతున్నాయి. ప్రజల సమాచార హక్కుకు తూట్లు పొడుస్తున్నాయి.

వ్యక్తిగత గోప్యత పేరిట సమాచారాన్ని తన గుప్పెట్లో బంధించడానికి ప్రభుత్వానికి గల అధికారాన్ని ఈ బిల్లులోని 37(1)(బి) క్లాజ్ మరింత పెంచుతుందని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఎత్తి చూపింది. అదే విధంగా జర్నలిస్టులు తమ వృత్తి బాధ్యతలో భాగంగా కొన్ని సంస్థల, వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించవలసి వచ్చినప్పుడు వారి స్వాతంత్య్రాన్ని అరికట్టే విధంగా ఈ చట్టం రూపొందిందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇటువంటి సందర్భాల్లో జర్నలిస్టులకు కొన్ని చట్ట నిబంధనల నుంచి మినహాయింపులు ఇవ్వకుండా ఇది నిరోధిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆయా సంస్థల, వ్యక్తుల సమాచారాన్ని జర్నలిస్టులు సేకరించవలసి వచ్చేటప్పుడు వ్యక్తిగత సమాచార పరిరక్షణ చట్టం నిబంధనలకు విధిగా బద్ధులై వుండాలనడం వారి వృత్తి బాధ్యతల భారాన్ని నిస్సందేహంగా పెంచుతుందని జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ స్పష్టం చేసింది.

ఈ చట్టాన్ని రూపొందించడంలో కేంద్ర ప్రభుత్వం దానిని దృష్టిలో పెట్టుకోలేదని రూఢి అవుతున్నది. 2005 నాటి సమాచార హక్కు చట్టాన్ని 2019లో మోడీ ప్రభుత్వం సవరించింది. తద్వారా సమాచార హక్కు కమిషనర్లకు అప్పటి వరకూ వున్న సంపూర్ణ స్వాతంత్య్రాన్ని పూర్తిగా కబళించి వేసింది. వారి హోదాలను, పదవీ కాలాన్ని తగ్గించి వేతనాల విషయంలో ప్రభుత్వాలపై ఆధారపడేలా చేసింది. ప్రజలు కోరే సమాచారాన్ని ప్రభుత్వం నుంచి ఇప్పించలేని దుస్థితికి వారిని దిగజార్చింది. బ్యాంకుల నిరర్థక ఆస్తులు, పెద్ద పెద్ద రుణాలు తీసుకొని ఎగవేసిన వారి వివరాలు ఇవ్వాలని సమాచార హక్కు కమిషన్ ఆదేశించగా రిజర్వు బ్యాంకు నిరాకరించిన ఉదంతం ఇందుకొక ఉదాహరణ. ప్రజలు గాని, మీడియా గాని అడుగుతున్న సమాచారం వ్యక్తిగతమైనదనే సాకుతో దానిని నిరాకరించేందుకు వివిధ మంత్రిత్వ శాఖల సమాచార అధికారులకు డేటా చట్టం మినహాయింపులు ఇస్తున్నది.

అదే సమయంలో ఈ చట్టం ద్వారా రాష్ట్రాల్లో నెలకొల్పబోయే సమాచార రక్షణ బోర్డుకు తగిన స్వాతంత్య్రాన్ని నియమాల రూపకల్పన అధికారాన్ని ఈ చట్టం ఇవ్వడం లేదు. పిల్లలు జ్ఞానాన్ని పెంచుకోడానికి ఆన్‌లైన్ సమాచారాన్ని తెలుసుకొనే విషయంలో కూడా ఆంక్షలు విధించినట్టు బోధపడుతున్నది. ప్రస్తుత సమాచార హక్కు చట్టం ప్రజల సమాచార హక్కును, గోప్యతను సహేతుక పరిధుల్లో వుంచుతున్నదని, డేటా బిల్లు మాత్రం గోప్యతను కాపాడే పేరుతో సమాచార హక్కును నిరోధిస్తుందని వస్తున్న విమర్శ కొట్టివేయదగినది కాదు. ఈ చట్టం వల్ల పత్రికా స్వేచ్ఛకు తీవ్ర అంతరాయం కలుగుతుందన్న భయాలను తొలగించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై వున్నది.

దేశ పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని వారి అనుమతి లేకుండానే సామాజిక మాధ్యమాల్లోని వారి వివరాల ద్వారా సంగ్రహించే అవకాశాన్ని కృత్రిమ మేధ కంపెనీలకు, ఇతర నిఘా సంస్థలకు ఈ చట్టం కల్పిస్తూ వుండడం మరో ఆందోళనకరమైన అంశం. సమాచార హక్కు చట్టాన్ని సవరించినప్పుడు కూడా యుపిఎ ప్రభుత్వం దానిని అనేక లోపాలతో ఆదరాబాదరాగా పార్లమెంటు చేత ఆమోదింపజేసిందని, వాటిని తొలగిస్తున్నామని ప్రధాని మోడీ ప్రభుత్వం చెప్పింది. వాస్తవంలో దానిని నిర్వీర్యం చేసింది. ఈ ప్రభుత్వం ఏ చట్టం తెచ్చినా ప్రజల హక్కులను హరించి తన నిరంకుశాధికారాలను పెంచుకోడమే లక్షంగా వ్యవహరిస్తున్నది. ఈ ధోరణిని నిరోధించవలసిన బాధ్యత దేశ ప్రజలపైనే వున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News