హైదరాబాద్: బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కిరీటంలో మరొక మణిపూస వచ్చి చేరిందని చెప్పడానికి చాలా సంతోషంగా ఉందని నటుడు, ఎంఎల్ఎ బాలకృష్ణ తెలిపారు. మన రేడియాలజీ డిపార్ట్మెంట్ లో ఇప్పటికే అత్యాధునికమైన 3డి – డిజిటల్ మమ్మోగ్రామ్ ఉందని, ఈ రోజు మనం మన ఆసుపత్రిలో డిజిటల్ రేడియో గ్రఫీని ప్రారంబించుకున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఆసుపత్రి సిఇఒ, వైద్యుడు ఆర్. వి. ప్రభాకరరావు, మెడికల్ డైరెక్టర్ వైద్యుడు టి. సుబ్రహ్మణ్యేశ్వరరావు, రేడియాలజీ విభాగాధిపతి వీరయ్య చౌదరి ప్రత్యేకంగా బాలకృష్ణ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు.
ఎలాంటి కొత్త సాంకేతికతనైనా మన ఆసుపత్రికి తీసుకురావడంలో మనమెప్పుడు ముందే ఉంటామని, ఇలాంటి అత్యాధునిక సాంకేతికత సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలనేదే నాన్న ఆశయమన్నారు. ఏ ఆశయంతో అయితే ఈ ఆసుపత్రి స్థాపించబడిందో, అదే స్పూర్తితో ఈ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తున్నానని పేర్కొన్నారు. అత్యాధునిక సాంకేతికతతో అత్యంత నిపుణులైన డాక్టర్లచే అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఉండాలనేదే ఈ ఆసుపత్రి ఆశయమని స్పష్టం చేశారు. ఈ దిశగా ప్రయత్నం కొనసాగిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలతో పాటు అభినందనలు తెలిపారు. ప్రతి రోజు ఎన్నో వందలమంది రోగులకు వారి ఆర్ధిక పరిస్థితితో సంబంధం లేకుండా ఈ ఆసుపత్రిలో చికిత్స చేయడం జరుగుతుందని బాలకృష్ణ తెలియజేశారు.
ఈ డిజిటల్ రేడియో గ్రఫీ ద్వారా మనం సాధారణంగా ఫిల్మ్ పైన తీసే ఎక్సరేని డిజిటల్ రూపంలో వెంటనే చూసే వీలుంటుందని, ఈ డిజిటల్ రేడియోగ్రఫీ ద్వారా తీసే ఇమేజ్ మంచి క్వాలిటీతో ఉండి ఖచ్చితమైన నిర్దారణ చేసేందుకు వీలుంటుందన్నారు. దీని ద్వారా కేవలం 8గంటల సమయంలో 200కి పైగా ఇమేజెస్ తీయవచ్చని, తక్కువ సమయంలో వీలైనంత ఎక్కువ మందికి సేవలు అందించేందుకు వీలవుతుందని బాలకృష్ణ ప్రశంసించారు. దీని ద్వారా రోగులు అతి తక్కువ రేడియేషన్ కి గురి అవుతారని, ఈ విధానం వల్ల మనం పర్యావరణానికి కూడా మేలు చేసినవాళ్ళమవుతామన్నారు.
- Advertisement -