Saturday, November 2, 2024

త్వరలో భూముల డిజిటల్ సర్వే

- Advertisement -
- Advertisement -

Digital Survey for Agricultural Lands in Telangana

అవినీతికి తెరదించిన ధరణి

వెంటనే టెండర్లు పిలవాలని సిఎం కెసిఆర్ ఆదేశం

సర్వే చేసిన భూములకు అక్షాంశ, రేఖాంశాలు ఇస్తాం
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తి
పారదర్శకంగా జరగాలని ఎంతో శ్రమించి ధరణి పోర్టల్
తెచ్చాం, అది నూటికి నూరుపాళ్లు విజయవంతమైంది
రెవెన్యూ శాఖలో అవినీతి అంతమైంది
నోరులేని అమాయక రైతులకు న్యాయం జరిగింది
భూ పత్రాల ఫోర్జరీల అరాచకం ఆగింది
జుట్టుకు జుట్టు ముడేసే దుష్ట పంచాయితీలు ఆగాయి
ఇది కొంతమందికి మింగుడు పడడం లేదు
ధరణిపై కొన్ని పత్రికలు తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నాయి
కలెక్టర్లు వెంటవెంటనే స్పందించి వివరించాలి
34 నెలల్లో మొత్తం భూ సమస్యలకు పరిష్కారం చూపిస్తాం
ప్రగతిభవన్ సమీక్షలో ముఖ్యమంత్రి కెసిఆర్

రెవెన్యూ శాఖకు జాబ్ చార్టు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే వ్యవసాయ భూములపై డిజిటల్ సర్వే ప్రారంభమవుతుందని ము ఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. సర్వే చేసిన వ్యవసాయ భూములకు కో ఆర్డినేట్స్(అక్షాంశ రేఖాంశాలు) ఇస్తామని ప్రకటించారు. ఈ సర్వే కోసం వెంటనే టెండర్లు పిలవాలని సిఎం ఆదేశించారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తి పారదర్శకంగా జరగాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఎంతో శ్రమించి అమలు చేస్తున్న ధరణి పోర్టల్ నూటికి నూరు పాళ్లు విజయవంతమయిందని ఆయన సంతృ ప్తి వ్యక్తం చేశారు. రెవెన్యూలో సంస్కరణలు తె చ్చిన ఫలితంగా, రెవెన్యూ శాఖ పని విధానం లో సమూల మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఆ శాఖ అధికారులు భవిష్యత్తులో నిర్వహించాల్సిన విధులకు సం బంధించి జాబ్ చార్టు రూపొందించనున్నట్లు వెల్లడించారు.

రెనెన్యూ సంస్కరణలు, ధరణి పోర్టల్ పనితీరుపై సిఎం కెసిఆర్ గురువారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సిఎస్ సోమేశ్ కుమార్, ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, కార్యదర్శులు స్మితా సభర్వాల్, భూపాల్ రెడ్డి తదితరులతో చర్చించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ, ధరణి పోర్టల్ వల్ల రెవెన్యూలో అవినీతి అంతమయిందన్నారు. నోరులేని, అమాయకుల రైతులకు న్యాయం జరిగిందన్నారు. ఒకరి భూమిని ఇంకొకరి పేరు మీద రాసే అరాచకం ఆగిందన్నారు. జుట్టుకు జుట్టుకు ముడేసి పంచాయతీ పెట్టే దుష్ట సంప్రదాయం రాష్ట్రంలో పూర్తిగా ఆగిందని వ్యాఖ్యానించారు. డాక్యుమెంట్లు గోల్ మాల్ చేసి, రెవెన్యూ కోర్టుల పేరిట జరిగే దుర్మార్గం సంపూర్ణంగా నషించిందన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా, చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ప్రభుత్వం ఎన్నో వ్యయ, ప్రయాసలకోర్చి మూడేళ్లు కసరత్తు చేసి కొత్త చట్టం తెచ్చామన్నారు. రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు పారదర్శకంగా, అవినీతికి ఏమాత్రం అవకాశం లేకుండా జరిగితున్నాయని సిఎం తెలిపారు. ఇందులో ఎలాంటి గందరగోళం, అస్తవ్యస్తం లేకుండా భూముల అమ్మకాలు, కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగుతున్నాయని పేర్కొన్నారు.

ప్రధానంగా బయోమెట్రిక్, ఆధార్ ఆధారంగా అమ్మేవారు, కొనేవారు వస్తేనే భూముల రిజిస్ట్రేషన్ జరుగుతున్నదన్నారు. ధరణిలో నమోదైన భూములను మాత్రమే అమ్మే, కొనే వీలున్నదని సిఎం తెలిపారు. ఆ భూములు మాత్రమే వారసత్వం ద్వారా, గిఫ్ట్ డీడ్ ద్వారా మరొకరికి సంక్రమించే అవకాశం ఉన్నదన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న పకడ్భందీ వ్యూహం వల్ల ఎవరూ ధరణిలో వేలుపెట్టి మార్పులు చేసే అవకాశం లేదన్నారు. చివరికి సిసిఎల్‌ఏ, సిఎస్ కూడా రికార్డులను మార్చలేరన్నారు. అంతా సిస్టమ్ డ్రివెన్(వ్యవస్థానుగత) పద్దతిన, హ్యూమన్ ఇంటర్ఫేస్(మానవ ప్రమేయం) లేకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతున్నదని సిఎం కెసిఆర్ అన్నారు. ఈ విధానంతో రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు.

కొంతమందికి మింగుడు పడడం లేదు

రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఇంత సజావుగా సాగడం కొందమందికి మింగుడు పడడం లేదని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. అందుకే ధరణి పోర్టల్ మీద చిలువలు, పలువలు ప్రచారం చేస్తున్నారన్నారు. అసంబద్ధమైన విషయాలు మాట్లాడుతున్నారన్నారు. లేని సమస్యలు సృష్టించి, పైరవీలు చేసి అక్రమ ంగా సంపాదించుకునే వారు ఇప్పుడు అవకాశం లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారన్నారు. వారే అపోహలు సృష్టించి గందరగోళ పరిచే ప్రయత్నా లు చేస్తున్నారని, వాటికి ప్రజలు తికమక పడొద్దు అని సిఎం సూచించారు.

కలెక్టర్లు వెంటనే స్పందించాలి

ధరణిపై కొన్ని పత్రికలు కావాలని తప్పుడు వార్తలు, అసంబద్ధమైన కథనాలు ప్రచురిస్తున్నాయని కెసిఆర్ తీవ్ర అసంతృప్తి, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ వార్తలపై కలెక్టర్లు ఎప్పటికప్పుడు స్పందించి సంపూర్ణ వివరాలు అందించాలని ఆదేశించారు. అలాగే సందేహాలను నివృత్తి చేయాలని ఆదేశించారు.

ప్రతి భూమికి కో..ఆర్డినేట్స్ ఇస్తాం

ప్రభుత్వం జరిపిన సమగ్ర భూరికార్డుల ప్రక్షాళన, కొత్త పాసుపుస్తకాలు, ధరణి పోర్టల్ తదితర సంస్కరణ వల్ల వ్యవసాయ భూములకు సంబంధించిన చాలా సమస్యలు పరిష్కారమయ్యాయని సిఎం పేర్కొన్నారు. మిగిలిన కొద్ది పాటి సమస్యలు కూడా ప్రభుత్వం త్వరలో జరిపే డిజిటల్ సర్వే వల్ల పరిష్కారం అవుతాయన్నారు. తాను అసెంబ్లీలో ఇంతకుముందే ప్రకటించినట్లు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ సర్వే నిర్వహిస్తామన్నారు. ప్రతి భూమికి కో ఆర్డినేట్స్ ఇస్తామన్నారు. ఇక వాటిని ఎవరూ మార్చలేరన్నారు. భవిష్యత్తులో ఎలాంటి గందరగోళానికి, తారుమారు చేయడానికి ఆస్కారం ఉండదన్నారు. నిజానికి ఇప్పటికే డిజిటల్ సర్వే ప్రారంభం కావాల్సిందన్నారు. కానీ కరోనా వల్ల ఈ ప్రక్రియ ఆగిందన్నారు. అతి త్వరలోనే డిజిటల్ సర్వే ప్రారంభం అవుతుందన్నారు. ఒకసారి సర్వే పూర్తయితే అన్ని విషయాలపై స్పష్టత వస్తుందన్నారు.

34 నెలల్లో మొత్తం సమస్యలకు పరిష్కారం

రైతుల భూముల మధ్య, అటవీ- ప్రభుత్వ భూముల మధ్య, అటవీ-ప్రైవేటు భూముల మధ్య హద్దుల పంచాయతీ కూడా పరిష్కారం అవుతుందని సిఎం కెసిఆర్ అన్నారు. అలాగే ఎంతో కాలంగా పీడిస్తున్న పోడు భూముల సమస్య కూడా పరిష్కారం అవుతుందన్న ధీమా వ్యక్తం చేశారు. 3-4 నెలల్లో మొత్తం సమస్యలు కొలిక్కి వస్తాయన్నారు. కో ఆర్డినేట్స్ మారవు… కాబట్టి భవిష్యత్తులో కూడా హద్దుల పంచాయతీకి అవకాశం ఉండదన్నారు.

ఆ దేశాల్లో 34శాతం జిడిపి అభివృద్ధి

భూ రికార్డులు సక్రమంగా ఉన్న దేశాల్లో జిడిపి 3-4 శాతం వృద్ధి సాధించిందని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కూడా అలాంటి విప్లవాత్మక మార్పుకు ప్రభుత్వం సిద్ధపడిందన్నారు. మారిన పరిస్థితుల్లో రెవెన్యూ స్వరూపం కూడా మారిందన్నారు. రెవెన్యూ శాఖ విధులు, బాధ్యతల్లో మార్పులు వచ్చాయన్నారు. గతంలో భూమి శిస్తు వసూలు చేసినప్పుడు రెవెన్యూ అనే పదం, శాఖ వచ్చాయన్నారు. ఇప్పుడు రెవెన్యూ వసూలు చేయకపోగా, ప్రభుత్వమే రైతుబంధు ద్వారా ఎకరానికి ఏటా రూ. 10వేల సాయం అందిస్తున్నదన్నారు. కాబట్టి రెవెన్యూ అనే పేరు కూడా ఇప్పుడు సరిపోదన్నారు. పేరు మారే అవకాశం ఉందన్నారు. ధరణి పోర్టల్, డిజిటల్ సర్వే తదితర కారణాల వల్ల భూ రికార్డుల నిర్వహణ, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు కూడా సులభంగా, అధికారుల ప్రమేయం లేకుండానే జరిగిపోతాయన్నారు. సేద్యం చేసే పంటలు పండించాల్సిన రైతులు తహసిల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగే ప్రయాస కూడా ఉండదన్నారు. ఇదే ధరణి ప్రధాన లక్ష్యమన్నారు. కాబట్టి రెవెన్యూ శాఖ విధుల్లో మార్పులు అనివార్యమని ఆయన వెల్లడించారు.

త్వరలోనే జాబ్‌చార్టును రూపొందిస్తాం

రెవెన్యూ శాఖలో ఎవరేమి పని చేయాలనే విషయంలో ప్రభుత్వం త్వరలోనే జాబ్ చార్టును రూపొందిస్తుందన్నారు. ఆర్‌ఐ ఏం చేయాలి? తహసిల్దార్ ఏం చేయాలి? ఆర్‌డిఒ ఏం చేయాలి? అనే విషయాల్లో స్పష్టత ఇస్తామన్నారు. రెవెన్యూ అధికారులను పనిచేయగలిగే, పని అవసరం ఉండే చోట ప్రభుత్వం వాడుకుంటుందని సిఎం ప్రకటించారు. ఏమైనా సమస్యలు, సందేహాలుంటే రైతులు ఇకపై కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సూచించారు. కలెక్టర్లు ఆ దరఖాస్తులను స్వీకరించడంతో పాటు కూలంకషంగా పరిశీలించాలన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి వచ్చే మార్గదర్శకాలకు అనుగుణంగా వాటిని పరిష్కరించాలని సిఎం చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News