Thursday, January 23, 2025

మళ్లీ కలబడిన చేతులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రేగిన అసంతృప్తిని చల్లార్చేందుకు హైకమాండ్ చేస్తున్న ప్రయత్నాలు మరింత మంటలు రాజేస్తున్నాయి. ఈసారి గాంధీభవన్ సాక్షిగానే ఆ పార్టీ తీ రు మరోసారి చర్చనీయాంశమైంది. నేతలు ఒకరినొకరు కొ ట్టుకునేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. సీనియ ర్ల అసంతృప్తిని చక్కదిద్దేందుకు వచ్చిన సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ గాంధీభవన్‌లో పార్టీ నేతలతో చర్చిస్తున్నారు. అయితే బయట మాత్రం తీవ్రంగా ఘర్షణ చోటు చేసుకుం ది. దిగ్విజయ్ సింగ్‌ను కలిసేందుకు వచ్చిన మాజీ ఎం ఎల్‌ఎ ఈరవత్రి అనిల్ పై పిసిసి మాజీ చీఫ్ ఉత్తమ్ వర్గీయు లు దాడికి ప్రయత్నించారు. ఇటీవల సీనియర్ నేతల తీరు పై ఈరవత్రి అనిల్ విమర్శలు గుప్పంచారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుచరులు గాంధీ భవన్‌లో అడ్డుకున్నారు. ‘సేవ్ కాంగ్రెస్’ అంటూ నినాదాలు చేశారు. అనిల్ క్షమాపణ చెప్పాలంటూ ఓయూ విద్యార్థి నేతలు డిమాండ్ చేశారు. దాంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. చొక్కాలు పట్టుకుని నెట్టుకున్నారు. ఒకరిపై ఒకరు దాడికి యత్నించారు.

ఈ దశలో సీనియర్ నేత మల్లు రవి వచ్చి సర్దిచెప్పడంతో పరిస్థితి సద్దుమ ణిగింది. ఏదైనా సమస్య ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, ఇలాంటి గొడవలు, కొట్టుకోవడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని మల్లు రవి సర్ది చెప్పారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అందరూ సమన్వయంతో పనిచేయాలని శిరసు వంచి కోరుతున్నానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బిఆర్‌ఎస్, బిజెపిలపై పోరాటం కోసం మీ శక్తినంతా వినియోగించాలి అంటూ శ్రేణులకు పిలుపు నిచ్చారు. నేతల మధ్య భేదాభిప్రాయాలను దిగ్విజయ్‌సింగ్ పరిష్కరిస్తారని మల్లు రవి తెలిపారు. మరో వైపు గాంధీభవన్‌లో పలువురు సీనియర్ నేతలు దిగ్విజయ్‌సింగ్‌ను కలుస్తున్నారు. సీనియర్ నేత విహెచ్ దిగ్విజయ్‌ను కలిసి తాజా పరిస్థితులను వివరించారు. దిగ్విజయ్‌సింగ్‌తో అన్ని విషయాలు వివరించి చెప్పినట్లు తెలిపారు. కోవర్టుల అంశం చర్చకు రాలేదని చెప్పారు. అందరితో కలిసి ముందుకు పోవాలని దిగ్విజయ్‌సింగ్ సూచించారని వెల్లడించారు. పిసిసి అధ్యక్షుడు కూడా అందరినీ కలుపుకొని వెళ్లాలని ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డికి విహెచ్ సూచించారు. రేణుకాచౌదరికూడా దిగ్విజయ్ సింగ్‌తో భేటీ అయ్యారు.

పార్టీ సమస్యలు పరిష్కరించేందుకు దిగ్విజయ్ వచ్చారని తెలిపారు. త్వరలోనే పార్టీలోని సమస్యలు పరిష్కారం అవుతాయ న్నారు. బిఆర్‌ఎస్ సర్కార్ అరాచకాలు పెరిగిపోయాయని విమర్శించారు. కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రేణుకా చౌదరి చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా దిగ్విజయ్ సింగ్ ను కలిశారు. రేవంత్ వర్గం కూడా తమను కావాలని టార్గెట్ చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తు న్నారని నివేదించినట్లుగా చెబుతున్నారు. దిగ్విజయ్ శుక్రవారం మీడియాతో మాట్లాడనున్నారు. ఢిల్లీ వెళ్లిన తర్వాత హైకమాండ్‌కు నివేదిక సమర్పిస్తారు. ఇదిలా ఉండగా, గాంధీ భవన్‌లో మాజీ ఎంఎల్‌ఎ అనిల్‌తో ఘర్షణకు దిగిన మొత్తం 8 మంది ఓయూ నేతలకు పిసిసి క్రమశిక్షణా సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. డిగ్గీరాజాతో భేటీ అనంతరం జానారెడ్డి మాట్లాడుతూ పార్టీ ఐక్యంగా ఉండటానికి, పార్టీని పటిష్టం చేయడానికి, అపోహలను తొలగించుకోవడంపై సింగ్‌కు కొన్ని సలహాలు ఇచ్చినట్టుగా చెప్పారు. దిగ్విజయ్ సింగ్‌కు రాష్ట్రంలోని రాజకీయ పరిస్ధితిపై సంపూర్ణ అవగాహన ఉందని సిఎల్‌పి నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పార్టీలో పరిణామాలను అధిష్ఠానం పరిష్కరిస్తుందని ఎంఎల్‌ఎ సీతక్క ధీమా వ్యక్తం చేశారు.
గాంధీభవన్‌లో మరో లొల్లి…
మహబూబాబాద్ డిసిసి అధ్యక్షుడిగా భరత్ చంద్రా రెడ్డిని నియామకాన్ని తప్పుబడుతూ మాజీ ఎంపీ బల్‌రాంనాయక్‌తో కొందరు గొడవ పడ్డారు. వీరన్న యాదవ్‌కు డీసీసీ అధ్యక్ష పదవి ఇస్తామని చెప్పి భరత్‌కు ఎందుకు సహకరించారంటూ బల్‌రాం నాయక్‌ను నేతలు నిలదీశారు. మహబూబాబాద్ మాజీ జెడ్‌పీటీసీ వెంకటేశ్వర్లు ఆయనతో వాగ్వాదానికి దిగారు.
దిగ్విజయ్‌తో మాజీ ఎంపీల సమావేశంలో కీలక అంశాలు చర్చకు వచ్చాయి. మీకు అన్ని తెలుసు కాబట్టి మీరే ఇన్‌ఛార్జ్‌గా వుండాలని దిగ్విజయ్ సింగ్‌ను మాజీ ఎంపిలు కోరారు. అయితే ఈ విజ్ఞప్తిని సున్నితంగా డిగ్గీ రాజా తిరస్కరించారు. కాగా ప్రస్తుత ఇన్‌ఛార్జ్‌గా వున్న మాణిక్యం ఠాగూర్‌ను మార్చాలని కొంత మంది సీనియర్లు దిగ్విజయ్‌ను కోరినట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News