Friday, November 15, 2024

హైదరాబాద్ చేరుకున్న దిగ్విజయ్ సింగ్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్ట్ నుంచి దిగ్విజయ్ తాజ్ కృష్ణ హోటల్‌కు చేరుకున్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దిగ్విజయ సింగ్‌తో భేటీ అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్‌లో చోటు చేసుకున్న సంక్షోభాన్ని పరిష్కరించే బాధ్యతను హైకమాండ్ దిగ్విజయ్‌కు అప్పగించింది. దీంతో ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. ఇక్కడికి వచ్చే ముందే ఢిల్లీలో ఏఐసీసీ కార్యదర్శులు, ఇన్‌ఛార్జ్ లతో దిగ్విజయ్ భేటీ అయ్యారు. మాణిక్యం ఠాగూర్ ఛాంబర్‌లో బోస్‌రాజు, నదీమ్ జావెద్‌లతో సమావేశమై తాజా పరిస్ధితులపై చర్చించారు. తెలంగాణ కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలపై ఇన్‌ఛార్జ్‌ల ద్వారా సమాచారం తెలుసుకున్నారు. గురువారం రేవంత్ టీమ్‌తో పాటు సీనియర్లతో దిగ్విజయ్ భేటీ కానున్నారు.

రెండు వర్గాల వాదనలను తెలుసుకుని .. రేపు మధ్యాహ్నం 3 గంటలకు దిగ్విజయ్ మీడియాతో సమావేశం కానున్నారు. ఇక, పీసీసీ కమిటీల విషయంలో అసలైన కాంగ్రెస్ వాదులకు అన్యాయం జరిగిందన్న సీనియర్ నేతలు సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క నివాసంలో సమావేశమై పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉమ్మడి గళం వినిపించారు. వలస వచ్చినవారికే ఎక్కువ పదవులు దక్కాయని ఆరోపించారు. ఈ క్రమంలోనే టిడిపి బ్యాక్‌గ్రౌండ్ ఉండి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ వర్గానికి చెందిన 12 మంది పిసిసి పదవులకు రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్‌లో ముసలం తీవ్రతరమైంది. ఒర్జినల్ కాంగ్రెస్ వర్సెస్ వలస నేతలుగా పరిస్థితులు మారాయి. ఈ క్రమంలోనే టీ కాంగ్రెస్‌లో వివాదాలకు చెక్ పెట్టేందుకు పార్టీ అధిష్టానం చర్యలు చేపట్టింది. ట్రబుల్ షూటర్‌గా పేరున్న దిగ్విజయ్ సింగ్‌ను రంగంలోకి దించింది. ఈ క్రమంలోనే దిగ్విజయ్ సింగ్ కొందరు సీనియర్ నేతలతో ఫోన్‌లో మాట్లాడి ప్రతి ఒక్కరి వాదనలు వింటామని చెప్పారు.

అలాగే మంగళవారం సాయంత్రం జరగాల్సిన సీనియర్ నేతల కీలక సమావేశం రద్దయ్యేలా చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా అసమ్మతి నేతలకు ఫోన్ చేసి మాట్లాడారు. సమస్యలను పరిష్కరిం చేందుకు దిగ్విజయ్ సింగ్‌ను హైదరాబాద్‌కు పంపనున్నట్టుగా చెప్పారు. అలాగే సమన్వయం పాటించాల్సిందిగా నేతలకు సూచించినట్టుగా తెలిసింది. ఇదిలా ఉండగా, ఇప్పటికే దిగ్విజయ్‌సింగ్‌ను ఢిల్లీలో పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి కలిసి తన వాదన వినిపించినట్లుగా తెలుస్తోంది. పిసిసి సీనియర్ల వ్యవహారశైలి, ఇతర పార్టీలతో అంటకాగుతున్న వైనం.. సొంత పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న విషయాలపైనా రిపోర్ట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దిగ్విజయ్ హైదరాబాద్ పర్యటనపై రేవంత్ వర్గం పెద్దగా గాభరా పడ టం లేదు. సీనియర్ నేతలతో చర్చించి వారితోపాటు ఇతర నాయకులతో కూడా మాట్లాడి సమన్వయ పరుస్తారని సీనియర్ నేత మల్లు రవి చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాసమస్యలపై పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సన్నద్ధం చేస్తారని అంటున్నారు.
ఖర్గేపై బిజెపి విమర్శలను ఖండించిన మల్లు రవి
మరో వైపు ఎఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే స్వాతంత్య్ర ఉద్యమంలో బిజెపి లేదనే పచ్చి నిజం చెబుతే బిజెపి వాళ్లు జీర్ణించుకోలేక పోతున్నారని మల్లురవి మండిపడ్డారు. ఎందుకు క్షమాపణ చెప్పాలి అనేది బిజెపి వాళ్ళు చెప్పాలన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో బిజెపి వాళ్ళు లేదనేది వాస్తవం కాదా? అని మల్లు రవి ప్రశ్నించారు. బిజెపి అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యం మీద దాడి చేస్తున్నారని, మల్లికార్జున ఖర్గే ను రబ్బరు స్టాప్ అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఒక దళిత నేతగా ఖర్గే ఓటమి ఎరగని నాయకులని మల్లు రవి గుర్తు చేశారు. మల్లికార్జున్ ఖర్గే 8 సార్లు ఎంఎల్‌ఎగా, మూడుసార్లు ఎంపిగా, గెలవడమే కాకుండా కర్ణాటకలో హోమ్, పరిశ్రమలు, నీటి పారుదల మంత్రిగా, సిఎల్‌పి నేతగా కేంద్రంలో రైల్వే, లేబర్ మంత్రిగా పార్లమెంట్‌లో ప్రతిపక్ష నాయకులుగా పని చేసిన అనుభవం ఉందన్నారు.

ఆయన ఎన్నికల ద్వారా అత్యధిక మెజారిటీ తో గెలిచిన ఎఐసిసి అధ్యక్షులు, ఆయన అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత రెండు రాష్ట్రాలలో ఎన్నికలు జరిగితే ఒకటి కాంగ్రెస్, ఒకటి బిజెపి గెలిచాయి. అలాంటి వ్యక్తిని రబ్బర్ స్టాంప్ అంటారా.. ? అని ప్రశ్నించారు. బిజెపిలో అమిత్ షా, మోడీ తప్ప మిగితా వాళ్ళందరూ రబ్బరు స్టాప్ లేనని మల్లు రవి మండిపడ్డారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా సొంత రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిపించిన ఘనత ఖర్గే దన్నారు. దళితులను అవమాన పరిచే విధంగా బిజెపి వాళ్లు మాట్లాడుతున్నారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన కాంగ్రెస్ సిద్ధాంతాలే నేటికి కొనసాగుతున్నాయన్నారు. కాంగ్రెస్ అంటే వ్యక్తులు కాదు ఒక సిద్ధాంతమని, బిజెపికి ఏ ఐడియాలజీ లేకనే ఇతర పార్టీల నుంచి చేరికలు చేసుకుంటున్నారని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News