Monday, December 23, 2024

దిగంతాలకు సారించిన విమర్శనా బాణం దిక్చక్రం

- Advertisement -
- Advertisement -

దిక్చక్రం.. తెలుగు పుస్తకాల్లో కొత్తగా కనిపించిన పేరు..పేరుకు తగినట్లే తెలుగు సాహిత్య విమర్శను మల్టీ డైమన్షన్ లో ప్రతిఫలించిన అరుదైన పుస్తకమిది. తెలుగు వర్తమాన రచనలపై, వాటి తీరుతెన్నులపై రచయిత దృష్టి చేరినంత మేరకు చర్చ ఇందులో సాగింది. విల్లునెక్కుపెట్టి విమర్శనా బాణాన్ని దిగంతాలకు చేర్చగల సత్తా గల రచయిత ఆడెపు లక్ష్మీపతి విస్తారంగా, విశాల క్షేత్రంగా సాహిత్యాన్ని మధించి కుప్ప బోసిన వ్యాస సంపుటి ఇది. తెలుగులో పై పై చూపులతో, తానొయ్యాక నొప్పింపక సాగుతున్న సాహిత్య వ్యాసాలతో, పుస్తక సమీక్షలతో, ముందు మాటలతో వట్టిపోతున్న విమర్శను పునర్నిర్వచించే ధీటైన అక్షరధార ‘దిక్చక్రం’. ఆయన సుదీర్ఘ పఠనం లోతైన పరిజ్ఞానం, విశాల దృక్పథం కలగలసి ఉండబట్టనీయక ఆది నిష్ఠురంగా, ఉన్నదున్నట్లుగా రాయించిన సద్విమర్శలు, ఆరోగ్యకర వ్యాసాలు ఇవి.

దిక్చక్రం సుమారు 400 పేజీల 48 వ్యాసాల భారీ సంపుటి. విలక్షణ కథకుడిగా ముద్ర పడిన రచయిత ఆడెపు లక్ష్మీపతి సమాంతరంగా నిరంతర చదువరి, నిర్మొహమాట విమర్శకుడు. తాను గత 25 ఏళ్లుగా రాస్తున్న సాహిత్య వ్యాసాలు మరియు ప్రసంగాల్లోంచి ఎంచుకున్న వాటికి పుస్తక రూపమిచ్చి నేటి రచయితలకు కొత్త టానిక్ ను అందించారు. అప్పుడప్పుడు, అవసరాన్ని బట్టి రాసిన వ్యాసాలైనా పరిశోధన గ్రంథంలో అధ్యాయాల మాదిరి వీటి మధ్య ఒక క్రమబద్దత కనబడుతుంది. వ్యాసాల ఎంపిక, పుస్తకాన్ని కూర్చిన తీరువల్ల ఇది సాధ్యపడి ఉండవచ్చు. ఇన్ని పేజీలు, ఇన్నేసి వ్యాసాలైనా ఎక్కడా పునశ్చరణ కనబడదు. క్రితం పేజీలో ఈ ప్రస్తావన వచ్చింది కదా అనిపించింది. విమర్శలో భాగంగా ఉదహరించిన పుస్తకాలు కూడా మళ్ళీ కనబడ్డ సందర్భాలు అరుదు. రోజుకో కొత్త పాఠం చెప్పే అధ్యాపకుడి బోధనలాగా వ్యాసాలన్నీ దేనికదిగా భిన్నంగా ఉన్నాయి.

ఈ వ్యాసాలను కవిత్వం, కథలు, నవలలు, రచనా తీరులు అనే భాగాలుగా విభజించారు. అయితే సగం దాకా కథల విశ్లేషణయే ఉంది. విస్తారమైన చర్చ కూడా ’కథ’ పైనే సాగిందనవచ్చు. తెలుగు కథా గమనాన్ని ఒక్క చోట పరిశీలించాలనుకొంటే తగినంత సమాచారం ఇందులో ఉంది. కాలానికి నిలిచిన ఆధునిక తెలుగు కథల, కథకుల గురించి అర్థవంతంగా సాగిన ఈ చర్చ కథలు రాసేవాళ్లకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ వ్యాసాల్లో రచయిత ప్రస్తావించిన కథలు, వాటి రచయితల పేర్లు నోట్ చేసుకుని విడిగా చదివితే నేటి రచయితలకు తామెక్కడున్నదీ తెలిసే అవకాశముంది. లక్ష్మీపతి ఆయా కథలను విశ్లేషించిన తీరు శాస్త్రబద్ధంగా ఉంది. కథల లాక్షణిక కోణాల్ని ఆయన ఆవిష్కరించిన విధానం ప్రత్యేకమైనది. గట్టి పండు రసాన్ని పిండినట్లు సాధారణ దృష్టితో అర్థం చేసుకోలేని కథల లోతులను గ్రహించి సంగ్రహించారు.

చదవడం, చదవడమే పనిగా ఏళ్ల తరబడిగా తెలుగు, ఇంగ్లీష్ సాహిత్యాన్ని వడబోసిన శ్రమ, ఈనాటి తెలుగు రచనలలో గుణాత్మక విలువల కోసం రచయిత పడుతున్న తాపత్రయం ప్రతి పుటలో కనబడుతుంది. అందుకే సాహిత్య స్రష్టలు, అభిలాషులు తప్పకుండా ఈ వ్యాసాలు చదవాలి. దీని వల్ల ఉత్తమ సాహిత్యం పరిచయమై పుస్తకప్రియుల చూపు విశాలమవుతుంది. అలాగే వీటిని చదివాక రాసేవాళ్ళు కలం పట్టే ముందు తప్పక ఆలోచనలో పడతారు. ఇంతవరకు తాము రాసినవి అసలు కథలే కాదని కొందరనుకున్నా ఆశ్చర్యం లేదు. కవిత్వ విభాగంలో ఆరుగురు కవుల సంపుటాలపై రచయిత వివిధ పత్రికల్లో రాసిన సమీక్షలున్నాయి.ఏనుగు నరసింహారెడ్డి కవిత్వం ’మూలమలుపు’ సమీక్షలో సమకాలీన కవిత్వంపై సూటి విమర్శ ఉంది. ’కవిత్వంలోని పాదాలు ఒకటి మరోదాన్ని సమర్థించుకుంటూ, విశదీకరించుకుంటూ, ఒకానొక మానసిక చట్రంలో చక్కటి పదచిత్రాలు పొదిగిన వాగ్మూలాలు అనదగ్గ ఉద్రేకభరిత ఆర్థోక్తులుగా ఉండాలి’ అని లక్ష్మిపతి కవిత్వా న్ని నిర్వచించారు. కవిత్వానికి నిదర్శనాలుగా ఆయన పేర్కొన్న వివిధ ఉదాహరణల ముందు ’మూలమలుపు’ పంక్తులు సరితూగనట్లుగా ఉన్నాయి. ఇందులోని కవితా నిర్మాణ పద్దతిని మెచ్చుకుంటూనే ఈ కవిత్వంలో రైతుల ఆత్మహత్యలు, నేతన్నల ఆకలిచావులు, రాజ్యహింస తదితర సామాజిక, సమకాలీన వాస్తవాలు విస్మరణకు గురయ్యాయని నొచ్చుకున్నారు కూడా. ఇదీ లక్ష్మిపతి సూటిదనం. మిగితా కవిత్వ పరామర్శల్లో ఎక్కువగా కవిత్వం అంటే ఏమిటో, ఎలా ఉండాలో అనే విషయాల్ని తన కోణంలోంచి విశదీకరించారు. అమ్మంగి వేణుగోపాల్ రచనల అనువాదాలపై చర్చ అధికంగా తెలుగు భాష, లిపిల ఆవిర్భావ, పరిణామాలపైనే జరిగింది.

ఈ సంపుటిలో ఉన్న ముందుమాటలు, సమీక్షల రచన ఆయా పుస్తకాల స్థాయీ పరిధుల్లో ఉండగా కథా సాహిత్య సింహావలోకనంలా సాగిన వ్యాసాల్లో కథా రచనపై సుదీర్ఘ చర్చ, అరుదైన ఉటంకాలు, అర్థవంతమైన పోలికలు, ఉపయోగకార సమాచారాన్ని విస్తృతంగా చూడవచ్చు. రచయిత క్రోడీకృత సాహిత్య జ్ఞాన సంపత్తి యొక్క అమరికను తగిన క్యాన్వాసు వీటిలో లభించింది.

కథా వార్షిక 2008 కోసం రాసిన వ్యాసంలో కథ గురించి లోతైన చర్చ ఉంది. కథ ఇతివృత్తం, రూపం, శిల్పం ఎలా ఉండాలో చెప్పడానికి రచయిత దేశీ , విదేశీ కథలను విశ్లేషణాత్మక పరిచయాలతో మన ముందుంచారు. అదే వరుసలో తెలుగులో వచ్చిన కథలను ఉదహరిస్తూ వాటి గుణగణాలను ఎత్తి చూపారు. మంచి కథ ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ వ్యాసంలో రచయిత పూర్తి ప్రయత్నం చేశారు. ’ఆధునిక సాహిత్య ప్రక్రియగా కథ – సంవిధాన, ఉపాంగాల పరిచయం’అనేది కథా రచనపై శాస్త్రీయ వివరణ గల మరో వ్యాసం. కథ పుట్టుక, నిర్వచనం, సంవిధానం, స్వభావం, ఇతివృత్త నిర్మాణం, నిడివి తదితర అంశాలపై సాధికార ప్రస్తావన ఇందులో ఉంది. ’2000 – 2010 మధ్య తెలుగు కథ ప్రయోగాలు’ అనే అంశంపై రాసిన వ్యాసం ప్రపంచీకరణ, దాని పరిణామాల నేపథ్యంగా మారిన పరిస్థితుల్లో సరిపోని సంప్రదాయికతకు భిన్నంగా కథలో వచ్చిన మార్పుపై సాగింది. జీవితంలో పెరిగిన సంక్లిష్టత, సంకీర్ణతల వల్ల సరికొత్త కథనరీతులు అవసరమని అవే ప్రయోగాలకు మూలమయ్యాయని అన్నారు. వాస్తవ విరుద్ధ కథనం మొదలు చైతన్య స్రవంతి దాకా 12 రకాలుగా తెలుగు కథల్లో ప్రయోగాత్మకతను వర్గీకరించి ఆయా ప్రయోగ రీతులతో వచ్చిన కథలను విభజించి వాటిని పరిచయం చేసిన తీరు బాగుంది.

అస్తిత్వ పోరాటమే తెలంగాణ కథకు మూలపదార్థమైందని, ఆంధ్ర ప్రాంత పత్రికల అవాంతరాలను తొలుచుకొని ఈ ప్రాంత కథ వికసించిందని ’తెలంగాణ కథ – ఒక పరిశీలన’లో రచయిత పేర్కొన్నారు. తెలంగాణ తొలితరం కథకులు సురవరం, వట్టికోట, సురమౌళిల నుండి నేటి అఫ్సర్, పెద్దింటి అశోక్ కుమార్, కెవి నరేందర్, స్కై బాబా, బెజ్జారపు రవీందర్ తదితరుల కథల ప్రస్తావన ఈ వ్యాసంలో ఉంది. 2018 లో పర్స్ పెక్టివ్ వారి బహుళ సంకలనం కోసం రాసిన ’సాహిత్యం – వస్తు, శైలీ శిల్పాల పరిశీలన’ అనే వ్యాసం నిజంగా నేటి కథకులకు పాఠ్యంశమే. ఇందులో కథ, దాని మూలస్తంభాలైన అంశాలపై వివరణాత్మక విశ్లేషణ ఉంది.’కథా శిల్పమంటే ఉపమానాలు గుప్పిస్తూ మెటాఫోరికల్ గా వర్ణిస్తూపోవడమే’ అన్నట్లు కొందరు విషయాన్ని మరింత జఠిలం చేసే ప్రయత్నం చేస్తారు కానీ నిజానికి ’రచయిత తాను అనుభూతి చెందే మనః స్థితిని పఠితకు చేరవేస్తూ మేధోపరంగా, భావోద్వేగపరంగా కదిలించే వ్యూహాత్మక కథాకథన పద్ధతియే శిల్పం’ అని, ఇదేమి బ్రహ్మపదార్థం కాదని ఔత్సాహికులకు రచయిత ధైర్యం చెప్పారు. వివిధ రకాల కథా సంవిధాన పద్దతులను పరిచయం చేస్తూ కథా వస్తువును బట్టి తన ఊహ చాతుర్యం మేరకు తగిన టెక్నీక్ ను ఎంచువాలని సూచించారు. ’ఒక భావాన్ని వ్యక్తీకరించేందుకు రచయిత వాడే పదాల కూర్పు లేదా ఎంపికను శైలి అంటాము. రచనను, రచయితను బట్టి శైలి సరళం, సంక్లిష్టం, వ్యంగ్యం, జలపాతవేగంగానూ ఉండవచ్చని అన్నారు.

నవల విభాగంలో జ్వాలాముఖి రాసిన ’వేలాడిన మందారం’ ను మరణశిక్ష రద్దుకై ఘోషించిన తొలి తెలుగు నవలగా పేర్కొంటూ దీని శిల్పం, శైలీ, సంభాషణలు, కథనం పాఠకుణ్ణి చదివించేలా ఉన్నాయన్నారు. ’అంపశయ్యపై నాలుగు మాటలు’లో చైతన్య స్రవంతి పద్ధతిపై మంచి విశ్లేషణ ఉంది.’వెల్లువలో పూచిక పుల్లలు – ఒక పరిశీలన’లో రచయిత భాస్కరభట్ల కృష్ణారావు వివరాలతో పాటు నవలపై మంచి సమీక్షను అందించారు. ’కథలు’ తరవాత ’ కొత్త రచనా రీతులు, వాదాలు, తాత్విక ధోరణుల విశ్లేషణ’ అనే విభాగం సైజుతో పాటు స్థాయిలో కూడా చెప్పుకోదగ్గది. చాల మట్టుకు ఇందులో పాశ్చాత్య ఆధునిక నవలలను ఉదహరిస్తూ మారిన రచనా ఎత్తుగడలను, సృజన శీలతను, ప్రయోగాలను విశదీకరించారు. కొన్ని నవలలపై పూర్తిస్థాయి పరిచయాలు, మ్యాజిక్ రియలిజం, సైన్స్ ఫిక్షన్ అంటే ఏమిటి ? లాంటి అంశాలపై వ్యాసాలు ఇందులో ఉన్నాయి. ఇవన్నీ వివిధ సందర్భాల్లో పత్రికల్లో వచ్చిన వ్యాసాలే. ప్రధానంగా ఈ సంపుటి ద్వారా అందని ద్రాక్షలా ఉన్న వివిధ దేశాల్లోని ఉత్తమ కథల పరిచయభాగ్యం లభించిందనవచ్చు. సాహిత్యానికి నేపథ్యంగా వ్యాసకర్త ఆయా కాలాల, ఆయా దేశాల సామాజిక, చారిత్రక, రాజకీయ పరిణామాలను కూడా చేర్చారు.

ఈ విధానం ఆయన విశాల పరిశీలనా పరిధిని తెలుపుతోంది. ఈ వ్యాసాలను చదివితే లక్ష్మిపతి పుస్తక పరిచయాల కన్నా విస్తృత చర్చకు వీలున్న అంశ ప్రధానమైన వ్యాసాలు రాయడంలో దిట్ట అనిపిస్తుంది. సమీక్షలు, ముందుమాటల్లో దీర్ఘ ఉపోద్ఘాతం ఉండి పుస్తక ప్రస్తావన సగానికి తగ్గినట్లనిపిస్తుంది. రచనాక్రమంలో రచయిత పేర్కొన్న ఎన్నో విదేశీ, కొన్ని ఇతర భారతీయ భాషల కథల, రచయితల ప్రస్తావన ఈ వ్యాసాలకు విశేష బలాన్నిచ్చింది. అయితే ఉదహరింపుల్లో వీలయినన్ని తెలుగు కథలు ఉంటె బాగుండేది. పుస్తకాల పేర్లతో పాటు రచయిత ఎన్నో ఇంగ్లిష్ పదాలను ఇబ్బడిముబ్బడిగా వాడారు. ఇం కా చెప్పాలంటే ఇంగ్లిష్ పదం లేని పేజీ లేదనవచ్చు. ఆ పదాల్ని అనువాదం చేసి విషయాన్ని సంక్లిష్టం చేసే కన్నా ఉన్నదున్నట్లు వాడి ఫలితాన్ని పాఠకునికి వదిలేశారనుకోవచ్చు. చాల చోట్ల ఇంగ్లిష్ పదాల్ని వాడే అనివార్యతను కూడా పాఠకుడు అర్థం చేసుకోవచ్చు. ఈ వ్యాసాల్లో ఎక్కువగా పాశ్చాత్య రచనల, విధానాల ప్రస్తావన ఉన్నందున ఆంగ్ల పదాల ఉదృతిని కాదనలేము. రచయిత విశేష కృషి ముందు ఈ పదాల ఎత్తిపొడుపు నిలవదు. దిక్చక్రంలో ‘పాత తరాలకీ, కొత్త తరాలకీ – ప్రపంచవ్యాప్తంగా వున్న అనేక కథా శిల్ప రహస్యాల్ని అందించారు. కొత్తతరం రచయితలలో ప్రయోగవాదులకిది అమూల్య గ్రంథం’ అని కె శివారెడ్డి ఇచ్చిన కితాబును వీటిని చదివినవారు అంగీకరిస్తారు.

దిక్చక్రం (సాహిత్య వ్యాసాలు),
రచన : ఆడెపు లక్ష్మిపతి,
పేజీలు 426, వెల :రూ. 300/-
ప్రచురణ : ఆదిత్య (లిటరరీ) పబ్లికేషన్స్, హైదరాబాద్, ప్రతులకు: ఏ. రామలక్ష్మి, 9701227207

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News