గేమ్ చేంజర్, సంక్రాంతి వస్తున్నాం సినిమాలను నిర్మించిన నిర్మాత దిల్‌రాజు. ఈ సంక్రాంతి సందర్భంగా గేమ్ చేంజర్‌ను జనవరి 10న, సంక్రాంతికి వస్తున్నాం సినిమాను జనవరి 14న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. “గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో చాలా సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. అలా జరగటానికి కారణం.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మేం అడగగానే ఈవెంట్‌కు రావటం ఆనందంగా అనిపించింది.
అలాగే ఏపీ ప్రభుత్వం సంక్రాంతికి వస్తోన్న సినిమాలకు సంబంధించి బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వటం, టికెట్ రేట్స్ పెంచుకోవటానికి అనుమతినిచ్చింది. సంక్రాంతి పండుగ వస్తుందంటే మన తెలుగు ప్రేక్షకులు ఏ రోజు ఏ సినిమా వస్తుందనే ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు తమిళ, కర్ణాటక సహా గ్లోబల్ ఆడియెన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నార్త్‌లోనూ, ఓవర్సీస్‌లో తెలుగు సినిమాలకు క్రేజ్, రేంజ్ పెరుగుతున్నాయి. గేమ్ చేంజర్ పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ అవుతుంది. గేమ్ చేంజర్ సినిమాలో ప్రేక్షకులు విజిల్స్ కొట్టే మూమెంట్స్ చాలానే ఉంటాయి. ‘శంకర్ ఎంత పెద్ద కమర్షియల్ సినిమా చేసినా అందులో మంచి మెసేజ్ ఉండేది, అలాగే నువ్వు కూడా ఎంత పెద్ద కమర్షియల్ సినిమా చేసినా ఒక విలువ ఉండేది’ అని ఓసారి చిరంజీవి అన్నారు.
అదేవిధంగా కమర్షియల్ అంశాలతో పాటు గౌరవంగా ఫీల్ అయ్యే సినిమా గేమ్ చేంజర్. శంకర్ చేసిన శివాజీ సినిమా చూస్తే అందులో హీరోయిజం ఉంటూనే హీరోకి, విలన్‌కు మధ్య ఓ టిట్ ఫర్ టాట్ ఉంటుంది. ఇప్పుడు పొలిటికల్‌గా చూసుకున్నా హీరో రామ్ చరణ్, విలన్ ఎస్.జె.సూర్య మధ్య వచ్చే సన్నివేశాలు విజిల్స్ వేసేలా ఉంటాయి. ఫైనల్‌గా చూసుకుంటే అన్నీ చక్కగా కుదిరాయి. ఇక సాంగ్స్ కోసం రూ.75 కోట్లు ఖర్చు పెట్టాం. అద్భుతమైన విజువల్ గ్రాండియర్‌తో పాటలు మెప్పించనున్నాయి. సినిమా 2 గంటల 43 నిమిషాలు రన్ టైమ్ ఫిక్స్ అయ్యింది. సినిమా చక చకా పరుగులు పెడుతుంది. నేను చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం నాకు కమ్‌బ్యాక్ ఫిలిమ్స్ అని నమ్మకంగా ఉన్నాను.
ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా విషయానికి వస్తే ఇదివరకే సూపర్ హిట్ అని అందరూ అంటున్నారు. ఈ బజ్ రావటానికి కారణం అనీల్ రావిపూడి. తను కథ చెప్పినప్పటి నుంచి అన్నీ తన మీద వేసుకుని సినిమాను ఎఫ్ 2లాగా సూపర్ హిట్ కొట్టాలని కష్టపడ్డారు. ఎఫ్2ను ఆడియెన్స్ ఎలాగైతే ఎంజాయ్ చేశారో, అలాగే సంక్రాంతికి వస్తున్నాం సినిమా బిగ్ హిట్ కాబోతుంది. అలా రెండు సినిమాలతో ఫుల్ ఎనర్జీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. ఏపీలో సినిమాలకు సంబంధించిన బెనిఫిట్ ఫోలు, టికెట్ రేట్స్ పెంచటంపై క్లారిటీ వచ్చేసింది. ఈ విషయమై త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రిని కూడా కలిసి కోరుతాము. తుది నిర్ణయం మాత్రం ప్రభుత్వానిదే.. నిర్మాతగా నా బాధ్యత అది”అని అన్నారు.