ఈ నేత కూడా రాజపక్ససన్నిహితుడే
18 మందితో నూతన మంత్రివర్గం ఏర్పాటు
కొలంబో: శ్రీలంక నూతన ప్రధానమంత్రిగా దేశ రాజకీయాల్లో సీనియర్ నేతల్లో ఒకరైన దినేశ్ గుణవర్ధనే నియమితులయ్యారు. దేశ నూతన అధ్యక్షుడిగా రణిల్ విక్రమ్ సింఘె ఎన్నికయిన విషయం తెలిసిందే. దీంతో 18 మంది సభ్యులతో శుక్రవారం నూతన మంత్రివర్గం ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి బాధ్యతలను సీనియర్ నాయకుడు దినేశ్ గుణవర్ధనేకు అప్పగించారు. రాజపక్స కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన గుణవర్ధనె గతంలో విదేశాంగ, విద్యాశాక మంత్రిగా పని చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో అప్పటి అద్యక్షుడు గొటబాయ రాజపక్స ఆయనను హోంమంత్రిగా నియమించారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో రాజపక్స కుటుంబం గద్దె దిగాల్సి వచ్చింది. మొదట ప్రధాని పదవికి మహింద రాజపక్స రాజీనామా చేయగా, ఆ తర్వాత అధ్యక్షుడు గొటబాయ రాజపక్స కూడా తన పదవికి రాజీనామా చేసి సింగపూర్‌కు పారిపోయారు. దీంతో తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న రణిల్ విక్రమ్ సింఘెను మెజారిటీ పార్లమెంటు సభ్యులు అధ్యక్షుడిగా ఎన్నుకోవడంతో ఆయన గురువారం ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. అయితే కొత్తప్రభుత్వం కొలువుదీరినా అందులోనూ రాజపక్స సన్నిహితులే పగ్గాలు చేపట్టడంపై లంకేయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దేశంలో పలు చోట్ల రణిల్ విక్రమ్ సింఘెకు వ్యతిరేకంగా భారీ ప్రదర్శనలు జరిగాయి. ఈ క్రమంలో గొటబాయకు అత్యతం సన్నిహితుడైన 73 ఏళ్ల గుణవర్దనెకు ప్రధాని పదవి కట్టబెట్టడంపై వారు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
ఆందోళనకారుల శిబిరాలపై దాడులు
ఇదిలా ఉండగా .. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే రణిల్ విక్రమ్ సింఘె ఆందోళనకారుల అణచివేతకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగానే శుక్రవారం తెల్లవారుజామున కొలంబోలోని అధ్యక్ష భవనం సమీపంలో ఉన్న ఆందోళనకారుల ప్రధాన శిబిరంపై లంక సౌన్యం, పోలీసులు దాడి చేశారు. అధ్యక్ష సచివాలయం ప్రధాన గేటుకు అడ్డుగా ఆందోళనకారులు పెట్టిన బారికేడ్లను తొలగించారు. శిబిరాల టెంట్లను తొలగించారు. ఆందోళనకారులు తక్షణమే ఆ ప్రదేశాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరించారు.