Sunday, January 19, 2025

వెళ్లిపోండి…

- Advertisement -
- Advertisement -

కెనడా దౌత్యవేత్తలకు భారత్ అల్టిమేటం

ఇరుదేశాల మధ్య మరోసారి నిప్పు రాజేసిన నిజ్జర్ హత్యోదంతం
కెనడాలోని రాయబారుల భద్రతకు ముప్పు ఉందన్న భారత్
దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించుకోవాలని నిర్ణయం నిజ్జర్
కేసులో హైకమిషనర్ సంజయ్‌వర్మను నిందితుడిగా పేర్కొనడంతో
రెండు దేశాల మధ్య భగ్గుమన్న దౌత్యయుద్ధం

న్యూఢిల్లీ/ఒట్టావా : భారత్, కెనడాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తి స్థాయిలో బెడిసికొట్టాయి. కెనడాలోని ఖలీస్థానీ వేర్పాటువాద నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యోదంతం ఇప్పుడు ఇరుదేశాల మధ్య తిరిగి చిచ్చు రగిల్చింది. కెనడా నుంచి తమ దేశ దౌత్య ఉన్నత ప్రతినిధి హై కమిషనర్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు భా రత ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఆ తరువాత కెనడా పట్ల తమ వైఖరిని కఠినతరం చేసింది. కెనడాకు చెందిన ఆరుగురు దౌత్యవ్తే లు శనివారం లోగా బారతదేశం విడిచిపెట్టి వె ళ్లాలని ఆదేశించింది. మరో వైపు కెనడా కూ డా తమ దేశంలోని ఆరుగురు దౌత్యవేత్తలను బహిష్కరించింది. వీరు మోడీ ఏజెంట్లు అని, కెనడాలో వీరు సాగిస్తున్న క్రిమినల్ కార్యకలాపాలపై తగు సాక్షాధారాలు, సమాచారం తమ వద్ద ఉన్నాయని కెనడా పోలీసు వర్గాలు ప్రకటించాయి.

దీనిని ప్రాతిపదికగా చేసుకుని రాయబారులను తాము బయటకు పంపిస్తున్నట్లు కెనడా ప్రభుత్వం ప్రకటించింది. పరస్పర ఆరోపణలు, దౌత్యవేత్తల బహిష్కరణలతో ఇప్పుడు ఇరుదేశాల మధ్య దౌత్యసంబంధాలు పూర్తిగా తెగినట్లు అయ్యాయి. భద్రతా కారణాల వల్ల వెంటనే ఇండియా హై కమిషనర్ సంజయ్ కుమార్ వర్మను తిరిగి రప్పించేందుకు చర్యలు చేపట్టినట్లు భారత ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇది తాము ముందుగా తీసుకుంటున్న చర్య కాదని, కెనడా ప్రభుత్వం నిజ్జర్ హత్య కేసు విచారణలో కెనడాలోని భారతీయ హై కమిషనర్‌ను అనుమానితుడిగా ప్రకటించడం, ఆయనపై దర్యాప్తు అవసరం ఉందని తెలియచేయడం కవ్వింపు చర్య అని భారత విదేశాంగ శాఖ సోమవారం మండిపడింది. అక్కడి ఉగ్రవాది హత్య ఎందుకు జరిగిందనేది సరైన రీతిలో ఆరా తీయకుండా, భారతదేశంపై అనుమానాలు వ్యక్తం చేయడం, ఈ క్రమంలో చివరికి హైకమిషనర్ కూడా విచారణ వ్యక్తుల జాబితాలో ఉన్నట్లు తెలియచేయడం అసాధారణ చర్య అవుతుందని భారత ప్రభుత్వం ధీటుగా స్పందించింది.

ప్రస్తుత పరిస్థితుల్లో కెనడాలోని భారత హై కమిషనర్‌కు కానీ సిబ్బందికి కానీ అక్కడి ప్రస్తుత ప్రభుత్వం సరైన రక్షణ ఇస్తుందనే నమ్మకం లేదు. ఇందుకు అవసరం అయిన కట్టుబాట్లకు కూడా వారు దిగుతారని తాము అనుకోవడం లేదని, ఈ దశలో హై కమిషనర్ భద్రతను పరిగణనలోకి తీసుకుని వెంటనే వెనకకు పిలిపించాలనే నిర్ణయానికి వచ్చినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఈ విషయాన్ని తాము సోమవారం సాయంత్రం కెనడాకు చెందిన దౌత్య వ్యవహారాల ఇన్‌చార్జికి తెలియచేసినట్లు కూడా విదేశాంగ మంత్రిత్వశాఖ వెల్లడించింది. అక్కడి ట్రూడో ప్రభుత్వం చర్యలు దౌత్య సిబ్బంది భద్రతకు అనుగుణగా లేవు. అక్కడ పూర్తి స్థాయిలో తీవ్రవాదం, అంతకు మించిన వేర్పాటువాద ఉగ్రవాదం పెచ్చరిల్లింది. సంబంధిత హింసాకాండ ప్రమాదకరం అయిందని విదేశాంగ మంత్రిత్వశాఖ తమ ప్రకటనలో తెలిపింది. ఇప్పుడు భారత్‌కు వేరే దారి లేదు. అక్కడి రాయబారిని వెంటనే స్వదేశానికి తిరిగి తీసుకురావడం కీలకం అయిందని వివరించారు. తమకు అందిన సమాచారం మేరకు కెనడాలో హై కమిషనర్, కొందరు దౌత్యవేత్తలను ఉగ్రవాదులు తమ హిట్‌లిస్టులో పెట్టుకున్నట్లు, ఈ మేరకు వారి వద్ద నిర్ధేశిత జాబితా ఉన్నట్లు తెలిసిందని,ఈ పరిస్థితుల్లో వారందరిని ఇక్కడికి తీసుకురావడం కీలక విషయం అయిందని విదేశాంగ శాఖ తెలిపింది.

తమ దేశ పౌరుడు అయిన నిజ్జర్ పూర్వాపరాల సంగతి పక్కన పెడితే తమ దేశ పౌరుడి హత్య జరిగినందున , దీని వెనుక భారతదేశ నిఘా సంస్థలు ఇతర అధికారుల హస్తం ఉందని భావించినందున తాము సంబంధితులందరిపైనా దర్యాప్తు జరిపి తీరుతామని పలుసార్లు కెనడా ప్రధాని ట్రూడో చెపుతూ వచ్చారు. ఇప్పుడు తాజాగా భారత హై కమిషనర్ పాత్రపై దర్యాప్తు జరుగుతున్నట్లు , ఆయన తమ పర్సన్ ఆఫ్ ఇంట్రెస్టు జాబితాలో ఉన్నట్లు కెనడా ప్రకటించడంతో ఇంతవరకూ అంతర్గతంగా రగులుకుంటున్న వివాదం ఇప్పుడు మరింత భగ్గు మంది.

సోమవారం పలు కీలక పరిణామాలు చకచకా జరిగాయి. సోమవారం సాయంత్రం కెనడా రాయబారి స్టీవర్ట్ వీలర్‌కు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ సమన్లు వెలువరించింది. ఆయనను పిలిపించి కెనడా ప్రభుత్వ ఉద్ధేశం ఏమిటని నిలదీసింది. కెనడాలో ఓటు బ్యాంక్ రాజకీయాల్లో లబ్థి కోసం ప్రధాని ట్రూడ్ అచారక రీతిలో దౌత్యవేత్తలపై తప్పుడు ఆరోపణలు చేస్తే, చివరికి హత్యోదంతం, అందులోనూ ఓ ఉగ్రవాది అంతం విషయంలో ఏకంగా హై కమిషనర్, ఆయన పరిధిలోని దౌత్యసిబ్బందిని అనుమానితులుగా పేర్కొనడం గర్హనీయం అని తెలిపారు. ఆ తరువాత హై కమిషనర్ ఉపసంహరణ నిర్ణయం ప్రకటించారు.

ఆదివారం అందిన దౌత్య సమాచారం

కెనడా నుంచి భారత ప్రభుత్వానికి కీలక దౌత్య సమాచారం అందింది. తమ దేశంలో ఒకానొక కేసు దర్యాప్తునకు సంబంధించి జరిగే దర్యాప్తు క్రమంలో హై కమిషనర్, ఇతర దౌత్యవేత్తలు పర్సన్ ఆఫ్ ఇంట్రెస్టుగా ఉన్నారని, వీరిపై దర్యాప్తు జరుగుతోందని, ఇంకా జరుగుతుందని కూడా ఈ సమాచారంలో తెలిపారు. ఇది పూర్తిగా దురుద్ధేశపూరిత చర్య అని, హై కమిషనర్ పట్ల ఆపాదించడం చాలా తీవ్ర విషయం అని విదేశాంగ శాఖ తెలిపింది.

సంజయ్ కుమార్ వర్మ అత్యంత సీనియర్ దౌత్యవేత్త

కెనడాలోని భారతీయ హై కమిషనర్ సంజయ్‌కుమార్ వర్మ అత్యంత సీనియర్ దౌత్యవేత్త. 36 సంవత్సరాల విశిష్ట అనుభవం ఉంది. అంతకు ముందు ఆయన జపాన్, సూడాన్‌లలో కూడా అంబాసిడర్‌గా ఉన్నారు. ఇటలీ , చైనా, టర్కీ, వియత్నాంలలో కూడా పనిచేసిన వ్యక్తి. సుదీర్ఘ విశిష్ట అనుభవం ఉన్న దౌత్యవేత్తపై అభియోగాలకు దిగడం, విచారణకు అర్హమైన వ్యక్తిగా ప్రకటించడం పూర్తిగా కల్పితం, కేవలం దేశంలో రాజకీయ ప్రయోజనాల కోసం భారతదేశంపై బురద చల్లడం అవుతుందని భారత ప్రభుత్వం ఖండించింది.

కెనడా ప్రధాని ట్రూడో ఆది నుంచి భారతదేశం పట్ల విద్వేషంతో వ్యవహరిస్తూ వస్తున్నారని , ఆయన కేబినెట్‌లో వేర్పాటు వాదులు , భారతదేశం పట్ల వ్యతిరేకత ఉన్న వ్యక్తులు ఉన్నారని భారత ప్రభుత్వం సోమవారం వెలువరించిన ప్రకటనలో తెలిపింది. ఇటీవలే కొద్ది రోజుల క్రితమే లావోస్‌లో ఆసియాన్ సమ్మిట్ నేపథ్యంలో ప్రధాని మోడీ, ట్రూడో మధ్య సంక్షిప్త స్థాయి సమావేశం జరిగింది. ఇరువురి నేతల మధ్య ఎటువంటి ఫలప్రదమైన సంప్రదింపులు ఏమీ జరగలేదని ఆ తరువాత అధికార వర్గాలు ఢిల్లీలో తెలిపాయి. ఇప్పుడు కెనడా నుంచి తీవ్రస్థాయి స్పందన వెలువడటం, దీనికి వెంటనే భారతదేశం ప్రతిస్పందన వెలువడటం కీలక పరిణామం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News