Sunday, December 22, 2024

భారతీయుల్లో ‘కెనడా’ అలజడి

- Advertisement -
- Advertisement -

విదేశీ విద్యార్థులకు ఉన్నత భవిష్యత్‌ను కల్పించే గమ్యంగా కెనడాకు చరిత్ర ఉంది. గత ఏడాది రికార్డు స్థాయిలో 10,40,000 మంది విదేశీ విద్యార్థులు కెనడాకు వచ్చారని ఇమ్మిగ్రేషన్ డిపార్టుమెంట్ డేటా చెబుతోంది. 2015 నుంచి విదేశీ విద్యార్థుల చదువుల పర్మిట్లు మూడు రెట్లు పెరిగినా ఇప్పుడు పరిస్థితి మారుతోంది. స్టడీ పర్మిట్ల సంఖ్య తగ్గిపోతోంది. 2023 లో కెనడా 5,09,309 ఇంటర్నేషనల్ స్టడీ పర్మిట్లను అనుమతించగా, 2024 లో మొదటి ఏడు నెలల్లో కేవలం 1,75,920 స్టడీ పర్మిట్లను జారీ చేసింది. 2025 నాటికి స్టడీ పర్మిట్లను 4,37,000 వరకు తగ్గించాలని కెనడా నిర్ణయించింది. ఇక విదేశాల్లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు 1.3 మిలియన్ వరకు ఉండగా, వారిలో 4,27,000 మంది కెనడాలోనే చదువుకుంటున్నారని భారత ప్రభుత్వ డేటా వెల్లడించింది.

20132022 మధ్య కాలంలో కెనడాకు వెళ్లే భారతీయుల సంఖ్య 260% వరకు అనూహ్యంగా పెరగడం విశేషం. ఈ నేపథ్యంలో కెనడా భారత్ దేశాల మధ్య దౌత్యపరంగా తలెత్తిన ఉద్రిక్తతలు రెండు దేశాల వాణిజ్య వ్యవహారాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఇప్పటికిప్పుడే చెప్పలేం కానీ విద్యార్థుల చదువులపై మాత్రం ప్రతికూల ప్రభావం ఉంటుందన్న ఆందోళనలు కనిపిస్తున్నాయి. ఉన్నత చదువుల కోసం కెనడాకు వెళ్లి అక్కడే ఉద్యోగాలలో స్థిరపడాలనుకుంటున్న భారతీయ విద్యార్థులు ఇప్పుడు అయోమయంలో ఉంటున్నారు. భారత విద్యార్థులను లేదా ‘పెర్మనెంట్ రెసిడెంట్ వీసా’ పై ఉంటున్న భారతీయ సంతతిని, కెనడా పౌరులు కావాలనుకుంటున్న భారతీయులను కెనడా టార్గెట్ చేసుకుందనడానికి ఇప్పుడు ఎలాంటి సంకేతాలు లేవు. కానీ భవిష్యత్ పరిణామాలు రానురాను అనుకూలంగా ఉండకపోవచ్చు.

భారత్ సంతతికి చెందిన వారు దాదాపు 2 మిలియన్ మంది కెనడాలో ఉంటున్నారు. కారణం తెలియకపోయినా భారతీయులకు వీసా జారీ చాలావరకు కెనడాలో తగ్గింది. దాంతో కెనడాకు భారత విద్యార్థుల విమాన ప్రయాణాలు కూడా చాలా వరకు తగ్గాయి. 2023లో రెండు దేశాల మధ్య 2.2 మిలియన్ మంది రాకపోకలు సాగించారు. ఎయిర్ ఇండియా, ఎయిర్ కెనడా విమాన సర్వీసుల్లోనే గత ఏడాది 45% భారతీయుల ప్రయాణం జరిగింది. కానీ జులై, సెప్టెంబర్ నెలల్లో ఇండియా కెనడా రూట్లు ఆగిపోయాయి. సాధారణంగా ఈ నెలల్లో భారత్ నుంచి విద్యార్థుల ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండాల్సిందిపోయి కెనడా వీసా జారీ కట్టుదిట్టం చేయడంతో ట్రాఫిక్ రద్దీ బాగా తగ్గింది. ఇండియా కెనడా రూట్లలో ముఖ్యంగా విద్యార్థులు, వలసజీవులు, వాణిజ్యవేత్తలు, విజిటింగ్ ఫ్యామిలీ, రెలెటివ్స్ రద్దీ ఎక్కువగా ఉంటుంది.

టూరిజంలో భారత్‌కు ఐదో భారీ మార్కెట్ కెనడాయే. 2023లో మొత్తం విదేశీ టూరిస్టుల్లో 4% కెనడా టూరిస్టులే ఉన్నారు. కెనడాకి వచ్చే విద్యార్థుల సంఖ్య క్రమేపీ తగ్గిపోతే కెనడాలో పనిచేసే భారతీయ బ్యాంకులపై తీవ్ర ప్రభావం పడుతుందని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. కెనడాలో మెజారిటీ బ్యాంకు కస్టమర్లు భారతీయ విద్యార్థులే. వారి ఆర్థిక లావాదేవీలు బ్యాంకుల ద్వారానే జరుగుతుంటాయి. ఇక చిన్నపాటి ఉద్యోగాలతో బతుకు నెట్టుకొస్తున్న భారతీయులు కెనడాలో వేలాది మంది ఉంటున్నారు. క్లీనింగ్, కుకింగ్ వంటి తక్కువ వేతనాల ఉద్యోగాలైనా ఇప్పుడు దొరుకుతాయో, దొరకవో అన్న నిరాశా నిస్పృహలు కమ్ముకుంటున్నాయి. కెనడా టెంపరరీ ఫారెన్ వర్కర్ (టిఎఫ్‌డబ్లు) కార్యక్రమం గత నెల కఠినంగా తయారు కావడంతో క్రమంగా ఈ చిన్నపాటి ఉద్యోగాలకు కూడా గేట్లు మూసుకుపోతున్నాయి.

కేవలం 10% అతి తక్కువ వేతన కార్మికులనే టిఎఫ్‌డబ్లు కార్యక్రమం కింద తమ సంస్థల్లోకి తీసుకుంటున్నారు. ఫలితంగా వందలాది భారతీయులు రెస్టారెంట్లు, జాబ్ సెంటర్ల బయట ఏదైనా జాబ్ దొరుకుతుందా అన్నఆశతో పడిగాపులు కాస్తున్నారు. దీనివల్ల వర్కింగ్ ఇండియన్ల సంఖ్య తగ్గిపోతోంది. ఇక మరోవైపు భారత్ కెనడా మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు ఆర్థిక, వాణిజ్య రంగాలపై అంతగా ప్రభావం చూపవని భారత్ చెబుతోంది. ప్రస్తుతం కెనడాతో భారత్ వాణిజ్య వ్యవహారాలు దాదాపు 19 బిలియన్ డాలర్ల వరకు స్తంభించాయి. 2000 ఏప్రిల్ నుంచి 2024 జూన్ వరకు భారత్‌లో కెనడా 3.9 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులు పెట్టింది. అలాగే కెనడా పెన్షన్ ఫండ్స్ 54 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడుల రూపంలో ఉన్నాయి. కెనడా ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డ్ (సిపిపిబిఐ) భారత్‌లో దాదాపు లక్ష కోట్ల వరకు పెట్టుబడులను పెట్టింది. భారత్‌లో కెనడా కంపెనీలు 600 వరకు ఉండగా, కెనడాలో భారత్ కంపెనీలు 30 వరకు పనిచేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో తమ పెట్టుబడులను కెనడా ఉపసంహరించుకుంటుందా లేక కొనసాగిస్తుందా అన్నది ఇప్పుడు చెప్పలేం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News