Thursday, November 14, 2024

ఆరు గ్యారెంటీలపై దిశా నిర్దేశం?

- Advertisement -
- Advertisement -

రేపు కలెక్టర్ల కాన్ఫరెన్స్

మన తెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడానికి మార్గదర్శకాలను ఖరారు చేసేందుకు ప్రభుత్వం భారీ కసరత్తు అందులో భాగంగానే ఆరు గ్యారెంటీల అమలులో కిందిస్థాయిలో ఎదుర య్యే ఇబ్బందులపైన కలెక్టర్ల సలహాలు, సూచనలు స్వీకరించేందుకు ఈనెల 24వ తేదీన అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లాల ఎస్‌పిలతో సచివాలయంలో సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా అమలుచేయాలని సంకల్పించిన ఆరు గ్యా రెంటీల అమలుపై రాష్ట్ర ప్రజలు ఉత్కంఠత, ఆత్రుతతో ఎదురుచూస్తున్నందున ఆదివారం జరగబోయే కలెక్టర్ల సమావేశానికి అత్యంత ప్రాముఖ్యత ఏర్పడింది. ఈ సమావేశానికి సిఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షత వహిస్తారు. ఇప్పటికే కలెక్టర్లందరికీ సమావేశంలో చర్చించాల్సిన ఎ జెండాపై ఒక అవగాహన ఉందని, అందుచేతనే జిల్లా స్థాయి అధికారులతో కలెక్టర్లు కూడా ప్రాథమికంగా జరిపి ఒక అవగాహనకు వ చ్చారని కొందరు సీనియర్ అధికారులు వివరించారు. ఈ కలెక్టర్ల సమావేశంలో చర్చించిన త ర్వాతనే ఆరు గ్యారెంటీలను అమలు చేయడానికి అవసరమైన మార్గదర్శకాలను కూడా ఖరారు చేస్తారని ఆ అధికారులు వివరించారు. ఇప్పటికే రెండు గ్యారెంటీలు అమలవుతున్నాయని, మరో రెండు గ్యారెంటీలు ఈనెల 28వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని వివరించారు. కలెక్టర్ల సమావేశానికి హైదరాబాద్‌కు వచ్చే ముందుగా కొద్దిపాటిగానైనా ప్రిపేర్ అయ్యేందుకే రెండురోజుల పాటు గడువు ఇస్తూ సమావేశాన్ని ఆదివారానికి (ఈనెల 24వ తేదీ) వాయిదా వేశారని వెల్లడించారు. అందులో భాగంగా కలెక్టర్‌లు తమ జిల్లాలకు సంబంధిం చి సమాచారాన్ని పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకోవాలని ఇప్పటికే సిఎస్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు అందినట్టుగా తెలిసింది. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కలెక్టర్లతో సమావేశమై ప్రభుత్వ ప్రాధాన్యాల గురించి వివరించాలని సిఎం భావిస్తున్నారు.

ముఖ్యంగా ఈ సమావేశంలో భూ రికార్డులతో ముడిపడిన సమస్యలు, కౌలు రైతుల గుర్తింపు వంటి అంశాలపై చర్చించే అవకాశంతో పాటు కొత్త రేషన్ కార్డుల జారీ, మహాలక్ష్మి వంటి పథకాల అమలుకు సంబంధించి చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ఆరు గ్యారంటీల అమలుతో పాటు ధర ణి వెబ్‌సైట్‌కు సంబంధించి లక్షకు పైగా ఫిర్యాదులు ఉన్న నేపథ్యంలో వాటిపై కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. జిల్లా కలెక్టర్‌లు పూర్తి నివేదిక అందిస్తే త్వరలోనే ధరణిపై ఉన్నతస్థాయి సమీక్షను సిఎం నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. ఈనెల 28వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుండగా దానికి సంబంధిం చి గ్రామసభలను ఎలా నిర్వహించాలని, అర్హులను ఎలా గుర్తించాలన్న విషయాలపై కూడా సిఎం కలెక్టర్‌లతో చర్చించనున్నట్టుగా తెలిసింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వ ఆలోచనా విధానాలను జిల్లా అధికారులకు తెలియచేయడంతో పాటు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేసేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ప్రజాదర్బార్ పేరుతో ప్రారంభించిన ప్రజావాణికి అనూహ్యమైన స్పందన వస్తుండటంతోనే ప్రజలకు మరింత దగ్గరగా ఈ కార్యక్రమాన్ని పట్టణాలు, జిల్లా స్థాయిల్లో కలెక్టర్లు నిర్వహించేందుకు వీలుగా విస్తరించే ప్రతిపాదనలు కూడా ఉన్నాయని, అందుకు తగినట్లుగా ప్రజా సమస్యలను పరిష్కరించడానికి కలెక్టర్లు హోదాతో పనిచేయకుండా ఒక సేవకుడిగా పనిచేసే విధంగా వారికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేస్తారని వివరించారు. ధరణి సమస్యలతో పాటు పలు భూ సంబంధిత అంశాలు, జీఓ 58, 59 అమలు, ఇళ్లు కట్టు కునేందుకు లబ్ధిదారుల ఎంపికపై మార్గదర్శకాల ఖరారు, రైతు భరోసా అమలుకు తీసుకోవాల్సిన చర్యలు, వాటి కోసం అనుసరించాల్సిన పద్ధతి తదితర అంశాలపై చర్చ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇందిరమ్మ పథకం కింద రూ.5లక్షలు…
ఇప్పటికే గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం దరఖాస్తులను రద్దు చేసిన ప్రభుత్వం వాటి స్థానంలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించాలని యోచిస్తోంది. దీంతో రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు ఉండి, ఇళ్లు లేని పేదలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం చేసే కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభించాలని సిఎం రేవంత్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండ్ల స్థలాల గుర్తింపు, ఇళ్ల నిర్మాణానికి అవసరమైన నిధుల పంపిణీ కోసం మార్గదర్శకాల ఖరారుపై కలెక్టర్ల సమావేశంలో సిఎం కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలిసింది. ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కేంద్రాలు, పట్టణాలకు విస్తరించాలని, వారంలో రెండు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో కూడా నిర్వహించాలని సిఎం రేవంత్ భావిస్తున్నారు. అందులో భాగంగా జిల్లా స్థాయిలో కలెక్టర్లు, క్షేత్రస్థాయిలో ఏయే అధికారులు ప్రజావాణిని ఏయే వారాల్లో నిర్వహించాలన్న దానిపై కూడా కలెక్టర్ల భేటీలో నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News