‘అధికారంలోకి రాగానే ఉచిత విద్య, వైద్యం అందిస్తాం’ ప్రతి సమావేశంలోనూ బిజెపి ఇస్తున్న ప్రధాన హామీ ఇది. ప్రజాసంగ్రామ యాత్ర సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇచ్చిన హామీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఇప్పటికే అధిష్టానం కింది స్థాయి క్యాడర్‌ను ఆదేశించింది. విద్య, వైద్యం ఉచితంగా అందితే ఒక కుటుంబానికి నెలకు ఏస్థాయిలో డబ్బులు మిగులుతాయో కూడా వివరించాలని చెప్పింది. హామీ సరే.. మరి దీనిని ఎలా అమలు చేస్తారో విడమరిచి చెప్పేందుకు పార్టీ సిద్ధం కావడం లేదు. ఎందుకంటే దానిపై ఆ పార్టీ దగ్గరే సరైన ప్రణాళిక లేనట్టు అర్థమవుతున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో అనేక ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి.
వాటన్నింటిలో విద్య ఉచితంగానే అందుతున్నది. ఆలస్యమవుతున్నా.. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్ షిప్ వంటి స్కీమ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం తల్లిదండ్రులు ఛాయిస్ ప్రకారమే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను ఎంపిక చేసుకుంటున్నారు. టీచర్ల కొరత, సౌకర్యాల లేమి అంశాలను పరిగణనలోకి తీసుకోకుంటే ఉచిత విద్య కావాలనుకున్న వాళ్లు ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించుకునే వీలుంది.అయితే ఇప్పుడు బిజెపి ఇస్తున్న ఉచిత విద్య హామీ అమలు ఎలా చేస్తారోననే సందేహం అందరిలో ఉన్నది. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలన్నింటినీ ప్రభుత్వ ఆధీనంలో తీసుకుంటారా?ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల సంఖ్యను పెంచేసి మౌలిక సదుపాయాలు కల్పిస్తారా? లేకుంటే తల్లిదండ్రులకే ఛాయిస్‌ను విడిచిపెట్టి ప్రైవేటు పాఠశాలల్లో తమ పిల్లలను చదివించిన వారికి ఫీజును పూర్తిస్థాయిలో ప్రభుత్వమే కడుతుందా? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలే. బిజెపి సమాధానమివ్వని ప్రశ్నలే. ఉచిత వైద్యాన్ని ఎలా అందిస్తారనేది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్నే. ప్రస్తుతం రాష్ట్రంలోఉన్న ప్రభుత్వ ఆస్పత్రులు, పిహెచ్ సీలు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో వైద్యం ఉచితంగానే అందుతున్నది.
కొన్ని సమస్యలున్నా.. ఆరోగ్యశ్రీ ద్వారా ప్రైవేట్ ఆస్పత్రులు, సెమీ గవర్నమెంట్ హాస్పిటల్స్ లోనూ ఉచిత వైద్య సదుపాయం ఉన్నది. అంతేకాకుండా అత్యవసర సమయాల్లో ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకొని సిఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకుంటే 50 నుంచి 70 శాతం బిల్లును ప్రభుత్వం సంబంధిత వ్యక్తులకు చెల్లిస్తున్నది. అయితే బిజెపి ఇస్తామన్న ఉచిత వైద్యం ఎలాంటిదనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. ప్రైవేటు ఆసుపత్రులను తమ ఆధీనంలోకి తీసుకొని, వాటిని ప్రభుత్వ ఆస్పత్రులుగా మార్చేస్తారా? లేకపోతే ఏదైనా ప్రత్యేక ఇన్సూరెన్స్ స్కీమ్ ను ఉపయోగించి అందరికీ ఆరోగ్య బీమా చేయించి.. రోగాలు వచ్చి ట్రీట్‌మెంట్ చేయించుకుంటే వాటికి బిల్లులు చెల్లిస్తారా? లేకపోతే సర్వరోగాలకు సవాలక్ష నిబంధనలున్న ఆయుష్మాన్ భారత్‌ను నివారిణిగా చూపిస్తారా? ఇవి కూడా బిజెపి చెప్పడానికి ఇష్టపడని ప్రశ్నలు.
జిహెచ్‌ఎంసి ఎలక్షన్ కంటే ముందు హైదరాబాద్‌లో వరదలు వచ్చాయి. వేలాది వాహనాలు ఆ వరదల్లో కొట్టుకుపోయాయి. అయితే జిహెచ్‌ఎంసి ఎన్నికల సమయంలో బండి సంజయ్ ఒక హామీ ఇచ్చారు. బిజెపి గెలిస్తే వరదల్లో కొట్టుకుపోయిన, దెబ్బతిన్న వాహనాలకు బదులు ఆ యజమానులకు కొత్త వాహనాలను కొనిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఒక ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ హామీపై విడమరిచి చెప్పి నవ్వుల పాలయ్యారు. వాహనాలకు ఉన్న ఇన్సూరెన్స్‌ను ఇప్పిస్తామని చెప్పారు. బండి సంజయ్ నోటి వెంట వచ్చిన ఉచిత విద్య, వైద్యం హామీకూడా సేమ్ అలాగే ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ఉన్నాయి కదా.. వాటిల్లో చేర్పించుకోండి.. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే అందరూ వైద్యం చేయించుకోండి అని అన్నా అనవచ్చని పేర్కొంటున్నారు.
తెలంగాణలో అధికారం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న బిజెపి నోటికొచ్చిన హామీలు ఇస్తున్నా.. వాటిని ఎలా అమ లు చేస్తామని మాత్రం ప్రజలకు వివరించలేకపోతున్నది. అంతేకాకుండా బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో అమలవుతున్నా హామీలను సైతం కొనసాగిస్తామని చెబుతున్నా.. వాటికి బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుందో చెప్పలేకపోతున్నది. ఇప్పటికే వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించాలని రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తున్నది. అయితే ఇప్పటికే రాష్ట్రం లో వ్యవసాయానికి అందుతున్న ఉచిత విద్యుత్‌ను కొనసాగిస్తుందా లేదా అన్నది దాని రాష్ట్ర యూనిట్ చెప్పలేకపోతున్నది. రుణమాఫీ గురించి అసలు మాట్లాడడానికే ఆ పార్టీ ఇష్టపడదు. ఎస్‌సి వర్గీకరణపై బిజెపి కేంద్ర నాయకులు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఎనిమిదిన్నరేండ్లు గడుస్తున్నా ఆ హామీ జోలికే వెళ్లడం లేదు. అంతేకాకుండా పలు హామీల అమలులో బిఆర్‌ఎస్ విఫలమైందని బిజెపి చెబుతున్న డబుల్ బెడ్రూం ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగభృతి, బిసిలోన్లు వంటి హామీలను తాము ఎలా నెరవేరుస్తామనే భరోసాను సైతం బిజెపి ప్రజలకు ఇవ్వలేకపోతోంది.
తెలంగాణకు వస్తున్న ప్రధాన మంత్రి మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. కేంద్ర మంత్రులు, బిజెపి జాతీయ నాయకులు కెసిఆర్ కుటుంబ పాలన గురించి మాట్లాడడమే తప్ప తెలంగాణకు వారు ఏం చేద్దామనుకుంటున్నారో ఎప్పుడూ చెప్పడం లేదు. ఇప్పటి వరకు తెలంగాణకు కేంద్రం కేటాయించిన నిధులు? ఏయే రంగంలో ఎంత ఖర్చు చేశారు? భవిష్యత్తులో వేటికి ఎంత ఖర్చు పెట్టబోతున్నారు..? వంటి వాటిని కూడా చెప్పలేకపోతున్నారు. అధికారంలోకి వస్తామని మభ్యపెడుతూ బిజెపి రాష్ట్ర నాయకత్వం కార్యకర్తలతో పని చేయించుకుంటుంది. రాష్ట్రంలో అధికారంలోకి రావడం సాధ్యం కాదని కేంద్ర నాయకత్వానికి తెలిసినా.. ఇప్పటికే ఉన్న నాలుగు ఎంపి సీట్ల సంఖ్య ఆరుకు పెరగొచ్చనే అంచనాతోనే రాష్ట్రంపై కాన్సెంట్రేషన్ పెంచింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో దాదాపు సగానికి పైగా నియోజకవర్గాల్లో బిజెపికి అభ్యర్థులే లేరనే విషయం బహిరంగ రహస్యమే. బిజెపికి ఎంపిలున్న నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో 28 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో పార్టీ ఎన్ని గెలవచ్చో కచ్చితంగా చెప్పే వారు కూడా లేరు. సరైన ప్రణాళికా లేకుండా ఎంతసేపూ తెలంగాణలో అధికార పక్షంపై దూషణలతో కాలం గడుపుతున్న బిజెపి వద్ద, బిఆర్‌ఎస్‌ను ఢీకొట్టేలా ఒక్క కొత్త హామీ కూడా లేదనడం కాదనలేని వాస్తవం.