Sunday, January 19, 2025

ఉమ్మడి స్మృతిపై ఆరాటం!

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: రాజ్యాంగం ఆదేశిక సూత్రాల్లో (ఆర్టికల్ 44) ఒకటైన ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫాం సివిల్ కోడ్ యుసిసి)ని తీసుకు రావడానికి భారతీయ జనతా పార్టీ చెప్పనలవికానంత ఆరాటాన్ని ప్రదర్శిస్తున్నది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తాజాగా గురువారం నాడు ఈ విషయాన్ని ప్రస్తావించారు. 2024 నాటికి ఉమ్మడి పౌర స్మృతిని చట్టంగా చేసే అవకాశాలున్నట్టు చెప్పారు. గుజరాత్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌లలో ఇందుకోసం ఉన్నత న్యాయమూర్తుల ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పడ్డాయని అవి అన్ని మత వర్గాల వారి అభిప్రాయాలను తీసుకుంటున్నాయని తెలిపారు. వివాహం, విడాకులు, వారసత్వ హక్కు, దత్తత వంటి అంశాల్లో అన్ని మతాల వారు ఒకే నియమ నిబంధనలు పాటించేలా చేయడమే ఉమ్మడి పౌర స్మృతి ఉద్దేశం. అయితే దీనిని చట్టం ద్వారా బలవంతంగా రుద్దితే వారు స్వీకరించి పాటించే అవకాశాలు అరుదు.

ఇప్పటికే బాల కార్మిక నిషేధ చట్టం, వరకట్న వ్యతిరేక చట్టం, స్త్రీలకు ఆస్తి హక్కు చట్టం వంటివి అమలుకు నోచుకోక అరణ్య రోదన చేస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఉమ్మడి పౌర స్మృతి పట్ల భారతీయ జనతా పార్టీ ఎందుకింత తొందరపాటును ప్రదర్శిస్తున్నది? గతంలో ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకుల సంప్రదాయాన్ని నిషేధిస్తూ తీసుకు వచ్చిన ముస్లిం స్త్రీల (వివాహ హక్కుల రక్షణ) చట్టం ఆచరణలో ఏమైందో, దానిపై ఎటువంటి విమర్శలు వచ్చాయో తెలిసిందే. వాస్తవానికి ఇటువంటి పద్ధతులను సుప్రీంకోర్టు, ఇతర ఉన్నత న్యాయస్థానాలు నిరాకరిస్తూనే వున్నాయి. ట్రిపుల్ తలాక్ విడాకులు గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గాయి. అందుచేత చట్టం ద్వారా వారిని నేరస్థులను చేసి ఆయా మత వర్గాల మనోభావాలను దెబ్బ తీయడం మంచిది కాదు.

అది బిజెపికి రాజకీయంగా మేలు చేయవచ్చునేమో గాని సమాజంలోని సామరస్యాన్ని దెబ్బ తీస్తుంది. ఇది తెలిసి కూడా ఉమ్మడి పౌర స్మృతి పట్ల బిజెపి హద్దులు మీరిన ఆసక్తిని కనపరుస్తున్నది. జనసంఘ్ నాటి నుంచి దీనిని వాగ్దానం చేస్తున్నామని, అమల్లోకి తేవలసిన సమయం వచ్చిందని, 2024 నాటికి సాధ్యం కాకపోతే ఆ ఎన్నికల్లో మళ్ళీ అధికారం చేపట్టిన తర్వాత ఉమ్మడి స్మృతిని తీసుకు వస్తామని అమిత్ షా అంటున్నారు. ఆలోగా ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో అమల్లో పెట్టడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపించడం ద్వారా మెజారిటీ హిందూ ఓటును మరింతగా ఆకట్టుకోడం బిజెపి ఉద్దేశంగా బోధపడుతున్నది. అన్ని మతాల్లోనూ వాటికే పరిమితమైన ప్రత్యేక ఆచార సంప్రదాయాలున్నాయి. వాటిలోని కొన్ని బలహీనులను అణచివేసేందుకు దోహదపడుతున్నాయి. సమాజం పూర్తిగా ప్రజాస్వామికీకరణ చెందే క్రమంలో అందులోని హానికరమైనవని భావించే వాటిని ఆయా మత వర్గాల వారే తొలగించుకుంటారు.

అటువంటి పరిణతి సహజంగా వచ్చినప్పుడే ఉమ్మడి పౌర స్మృతి ఆశయం నెరవేరుతుంది. రాజ్యాంగాన్ని సిద్ధం చేస్తున్న సమయంలో డాక్టర్ అంబేడ్కర్ కూడా ఇటువంటి అభిప్రాయాన్నే వెలిబుచ్చారు. ఏ ప్రభుత్వమైనా ముస్లింలు, క్రైస్తవులు లేదా మరే మతవర్గంపైనా వారి అభీష్టానికి వ్యతిరేకంగా ఉమ్మడి స్మృతిని రుద్దితే అది మతి తప్పినదే కాగలదని ఆయన అభిప్రాయపడ్డారు. అందుచేత ఆయా వర్గాలు తమంత తాముగా అంగీకరిస్తే తప్ప దీనిని వారిపై రుద్దకూడదని అన్నారు. అందుచేతనే భవిష్యత్తులో సర్వానుకూల పరిస్థితి ఏర్పడినప్పుడు మాత్రమే అమల్లోకి తెచ్చే విధంగా ఈ లక్షాన్ని రాజ్యాంగ ఆదేశిక సూత్రాల్లో చేర్చారు. ఇప్పటికైతే అటువంటి ఆదర్శమైన సమాజం ఏర్పడలేదు. పైపెచ్చు పాలక పార్టీయే భిన్న ప్రజా వర్గాల మధ్య మత వైషమ్యాల చిచ్చును రగిలించడమో లేక వేరొకరు ఆ పని చేస్తూ వుంటే చూసీచూడనట్టు ఊరుకోడమో జరుగుతున్నది.

అన్ని రకాల ప్రజాస్వామిక పద్ధతులను, చర్చలను ఆశ్రయించిన తర్వాతనే ఉమ్మడి పౌర స్మృతిని తెస్తామని అమిత్ షా అన్నారు. ఇది ఎంతో వినసొంపుగా వుంది. కాని మైనారిటీల పట్ల ద్వేషం నింపుకొన్న బిజెపి వంటి పాలక పక్షం నుంచి ప్రజాస్వామిక చర్చను, సంప్రదింపులను ఎదురు చూడగలమా? హిందూ ఆధిక్యత, ఆధిపత్యాలను నెలకొల్పడమే లక్షంగా ప్రజాస్వామిక అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న బిజెపి నుంచి అటువంటి వైఖరిని ఆశించగలమా? జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కలిగిస్తూ వచ్చిన రాజ్యాంగంలోని 370 అధికరణ రద్దును, దాని రాష్ట్ర హోదాను ఊడబెరకడాన్ని తాము సాధించిన గొప్ప లక్షంగా అమిత్ షా చెప్పుకొన్నారు. అయితే అక్కడి ప్రజలు హృదయపూర్వకంగా ఆమోదం తెలిపినప్పుడే ఆయన మాటలు వాస్తవమని రుజువవుతాయి. ఏ వర్గాలకు సంబంధించిన ఎటువంటి స్థితినైనా ఏకపక్షంగా మార్చడం వల్ల మంచి జరగదు. అది ఎవరి రాజకీయ ప్రయోజనాలకో చేసిందయితే దాని వల్ల అక్కడి సమాజానికి హాని మాత్రమే కలుగుతుంది. బిజెపి పెద్దలకు ఈ విషయం తెలియనిది కాదు. కాని వారు తమ ప్రయోజనాలనే చూసుకుంటారు గాని జన హితానికి ప్రాధాన్యం ఇవ్వరు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News