Friday, November 22, 2024

‘మ్యాడ్’ సినిమా ‘జాతిరత్నాలు’ కంటే బాగుంటుంది: దర్శకుడు అనుదీప్

- Advertisement -
వైవిధ్య భరిత చిత్రాలతో తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటిగా ఎదిగిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ క్రేజీ అండ్ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’తో అలరించడానికి 2023, అక్టోబర్ 6న వస్తోంది.  రామ్ నితిన్, సంగీత్ శోభన్, నార్నే నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌ కుమార్, గోపికా ఉద్యన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాతో హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయం అవుతున్నారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పై సాయి సౌజన్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
ఈ సినిమాకి నూతన దర్శకుడు కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ లో వేగం పెంచింది. మ్యాడ్ గ్యాంగ్ ని పరిచయం చేస్తూ మంగళవారం సాయంత్రం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఘనంగా జరిగిన ఈ వేడుకకు చిత్రం బృందంతో పాటు, ‘జాతిరత్నాలు’ ఫేమ్ దర్శకుడు అనుదీప్ సహా పలువురు హాజరయ్యారు. ఈ సినిమాలో అనుదీప్ కూడా నటించడం విశేషం.
ఈ సందర్భంగా దర్శకుడు అనుదీప్ మాట్లాడుతూ.. “దర్శకుడు కళ్యాణ్ నాకు పదేళ్లుగా స్నేహితుడు. కళ్యాణ్ లో చాలా ఎనర్జీ ఉంటుంది, హ్యూమర్ ఉంటుంది. ఎప్పుడూ మంచి కథలు రాస్తుంటాడు. ఈ సినిమా చాలా ఎనర్జీతో, చాలా హ్యూమర్ తో ఉంటుంది. కొత్తవాళ్ళని ప్రోత్సహిస్తూ నాగవంశీ గారు మరిన్ని సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. మీరందరూ అక్టోబర్ 6 థియేటర్లలో ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను” అన్నారు.
అనుదీప్ మాట్లాడిన సమయంలో నిర్మాత నాగవంశీ కాసేపు యాంకర్ అవతారం ఎత్తారు. “మీరు సినిమా చూశారు కదా. మ్యాడ్, జాతిరత్నాలు ఈ రెండు సినిమాల్లో ఏది ఎక్కువ బాగుంది” అని నాగవంశీ అడగగా.. “మ్యాడ్ సినిమానే ఎక్కువ బాగుంది. నాకు బాగా నచ్చింది” అని అనుదీప్ సమాధానం ఇచ్చారు.
నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. “జాతిరత్నాలు కంటే ఒక్కసారైనా తక్కువ నవ్వానని ఎవరైనా చెప్తే.. టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాం. సినిమా పట్ల అంత నమ్మకం ఉంది. ఇది యూత్ ఫుల్ సినిమా అయినప్పటికీ, కుటుంబమంతా కలిసి చూసేలా ఉంటుంది. ఇంజనీరింగ్ కాలేజ్ లైఫ్ ని గుర్తు చేయడానికి తీసిన సినిమా ఇది. లాజిక్ లు, ట్విస్ట్ లు ఏముండవు. సినిమా మొదలైనప్పటి నుండి చివరివరకు నవ్వుతూనే ఉంటారు. కుటుంబంతో కలిసి అందరూ ఆనందించదగ్గ సినిమా ఇది” అన్నారు.
నార్నే నితిన్ మాట్లాడుతూ.. “యువతకు నచ్చే ఒక మంచి కాలేజ్ సినిమా తీశాం. మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను” అన్నారు.
సంగీత్ శోభన్ మాట్లాడుతూ.. “సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత మ్యాడ్ గా తీశామో. ఆ మ్యాడ్ కి కారణం మా దర్శకుడి మెదడు నుండి వచ్చిన మ్యాడ్ ఆలోచనలే. మా మ్యాడ్ నెస్ కి కనెక్ట్ అయ్యి థియేటర్లలో మీరు కూడా మ్యాడ్ అయిపోతారు అనుకుంటున్నాం. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్. మీరు వస్తారు, నవ్వుతారు, ఎంజాయ్ చేస్తారు.. అది మాత్రం గ్యారెంటీ” అన్నారు.
రామ్ నితిన్ మాట్లాడుతూ.. “ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలు నాగవంశీ గారికి, హారిక గారికి, చినబాబు గారికి కృతఙ్ఞతలు. నేను ఈ పాత్రకు న్యాయం చేయగలనని నమ్మిన దర్శకుడు కళ్యాణ్ గారికి థాంక్స్. ఒక మంచి సినిమాని అందించడానికి టీం అందరూ ఎంతగానో కృషి చేశారు” అన్నారు.
అనంతిక సనీల్ కుమార్ మాట్లాడుతూ.. “ఇంత మంచి సినిమాలో భాగం కావడం సంతోషంగా ఉంది. సినిమా విడుదల తేదీ అక్టోబర్ 6 కోసం ఎదురుచూస్తున్నాం. నాకు ఈ అవకాశమిచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు” అన్నారు.
గోపికా ఉద్యన్ మాట్లాడుతూ.. “ఈ చిత్రంలో భాగం కావడం గర్వంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన నాగవంశీ గారికి, కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. థియేటర్లలో చూసి ఆనందించండి. సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది” అన్నారు.
శ్రీ గౌరీ ప్రియా రెడ్డి మాట్లాడుతూ.. “మా సినిమా టైటిల్ లోనే ఉంది.. మా సినిమా ఎంత మ్యాడ్ గా ఉండబోతుందో. సినిమా టీజర్ కి ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందనకి మేము మ్యాడ్ అయిపోయాం. సినిమా దీనికంటే పదింతలు మ్యాడ్ గా ఉండబోతుంది. మీ అందరూ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను” అన్నారు.
చిత్ర దర్శకుడు కళ్యాణ్ శంకర్ మాట్లాడుతూ.. “మొదట చినబాబు గారిని కలిసి ఈ కథ చెప్పగా, ఆయనకు నచ్చింది. ఈ సినిమాలో మ్యాడ్ క్యారెక్టర్స్ ఉంటాయి. అలాంటి పిచ్చోళ్ళ కోసం వెతుకుతుంటే ఫస్ట్ సంగీత్ దొరికాడు. హలో వరల్డ్ అనే సిరీస్ చూసి రామ్ ని వంశీ అన్న పిలిపించారు. మన సినిమాని ముందుకు తీసుకోవడానికి ఒక హీరో కావాలి అనుకున్నప్పుడు ఒక్క యాక్షన్ వీడియో చూసి నార్నే నితిన్ ని ఎంపిక చేశాం. నిర్మాత హారిక గారు స్క్రిప్ట్ దశ నుంచి షూటింగ్ వరకు మొత్తం దగ్గరుండి చూసుకున్నారు. ఈ సినిమాలో ఓన్లీ ఎంటర్టైన్మెంటే ఉంటుంది. వంశీ గారు చెప్పినట్టు మీకు డబ్బులు వెనక్కి రావు. అంతలా ఎంజాయ్ చేస్తారు” అన్నారు.
డీఓపీ షామ్‌దత్ మాట్లాడుతూ.. “ఈ సినిమా కోసం మ్యాడ్ పీపుల్ తో పనిచేశాను. సినిమా చేస్తున్నప్పుడు నవ్వుతూనే ఉన్నాను. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని దర్శకుడితో చెప్పాను. ఈ నిర్మాణ సంస్థలో పనిచేయడం, ఈ సినిమాలో భాగం కావడం సంతోషంగా ఉంది. ఇదొక క్రేజీ మూవీ. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. చూసి ఆనందించండి” అన్నారు.
సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో మ్యాడ్ చిత్రంలోని పాటలను పాడి ప్రేక్షకుల్లో ఉత్సాహం నింపారు. అక్టోబర్ 6న విడుదలవుతున్న ఈ సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు. ప్రముఖ యాంకర్ సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమం ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News