Thursday, November 14, 2024

మనలో ఒకరి కథలా.. ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’: శ్రీనివాస్ అవసరాల

- Advertisement -
- Advertisement -

ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫిల్మ్ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి నిర్మాతలు. ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ సినిమాలతో రచయితగా, దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ‘కళ్యాణ వైభోగమే’ చిత్రంతో వెండితెరపై మ్యాజిక్‌ చేసిన హిట్ జోడి నాగశౌర్య, మాళవిక నాయర్ ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ వంటి మ్యాజికల్ ఫిలిమ్స్ తర్వాత శ్రీనివాస్ అవసరాల-నాగశౌర్య కలయికలో వస్తున్న సినిమా కావడంతో ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, ‘కనుల చాటు మేఘమా’ పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని అంచనాలను రెట్టింపు చేశాయి. మార్చి 17న ఈ చిత్రం థియేటర్లలో భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు శ్రీనివాస్ అవసరాల శనివారం నాడు విలేకర్లతో ముచ్చటించి ఈ చిత్రానికి సంబంధించిన ఎన్నో విశేషాలను పంచుకున్నారు.

సినిమాకి ఈ టైటిల్ పెట్టడానికి కారణమేంటి?
ఇది చాలా సహజంగా ఉండే సినిమా. పాత్రలు, సంభాషణలు సహజంగా ఉంటాయి. నిజంగా ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటుంటే ఎలా ఉంటుందో అంత సహజంగా ఉండాలని తీసిన సినిమా ఇది. ఈ కథ కూడా నిజ జీవితంలో నేను చూసిన కొన్ని సంఘటనల ఆధారంగా రాసుకున్నాను. ఇది జనాలకు దగ్గరగా ఉండే కథ. మనకు తెలిసిన కథలా, మనలో ఒకరి కథలా ఉంటుంది. అంత సహజమైన సినిమాకి ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ లాంటి టైటిల్ పెడితే బాగుంటుంది అనిపించింది. మొదట దీనిని వర్కింగ్ అనుకుంటున్నాను అని చెప్పాను. అయితే ఈ టైటిల్ నిర్మాతలకు ఎంతగానో నచ్చి వెంటనే రిజిస్టర్ చేయించారు.

ఈ సినిమాలో కొత్తగా ఏమైనా చూపించబోతున్నారా?
కొత్తగా ఏముంది అనేది మీకు సినిమా చూసిన తరువాత అర్థమవుతుంది. నాది-నాగ శౌర్య కాంబినేషన్ లో సినిమా అనగానే అందరూ ‘ఊహలు గుసగుసలాడే’ తరహాలో రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ అయ్యుంటుంది అనుకుంటున్నారు. అయితే ఈ సినిమా స్క్రిప్టెడ్ లాగా అనిపించదు. నిజ జీవితంలో పాత్రలు ఎలా ప్రవర్తిస్తాయి, ఎలా మాట్లాడుతారో అలాగే ఈ సినిమా ఉంటుంది. ట్రైలర్ చూశాక ఈ సినిమా ఎలా ఉండబోతుందో మీకో అవగాహన వస్తుంది. ప్రతి సినిమాకి ఓ శైలి ఉంటుంది. నా గత చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది.

మీరు నెమ్మదిగా సినిమాలు తీయడానికి కారణం?
నేను కథ రాయడానికి ఏడాది, ఏడాదిన్నర సమయం తీసుకుంటాను. ఈ సినిమా 2019లో మొదలుపెట్టాను. 2020 లో యూకే, యూఎస్ లో షూట్ చేయడానికి సన్నాహాలు చేస్తుండగా కోవిడ్ కారణంగా వీసాలు ఇవ్వడం ఆపేశారు. ఆ తరువాత 2022 లో యూకే వెళ్లి షూటింగ్ పూర్తి చేశాం. అప్పుడు కూడా 40 మందికి వీసాలు అప్లై చేస్తే పదిమందికే ఇచ్చారు.

సంగీత దర్శకుడు కళ్యాణ్ మాలిక్ గారితో ప్రయాణం?
కళ్యాణ్ మాలిక్ గారు అష్టాచమ్మా సినిమా సమయం నుంచే తెలుసు. మా ఇద్దరికీ మంచి అనుబంధం ఉంది. మా ఆలోచనలు, అభిప్రాయాలు ఎలా ఉంటాయో ఒకరికొకరికి తెలుసు. ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ సినిమాలు సంగీత దర్శకుడిగా ఆయనకు మంచి పేరు తీసుకురావడంతో నేనంటే కొంచెం ఎక్కువ ప్రేమ ఆయనకు. ఆ అనుబంధం వల్లే సినిమా సినిమాకి ఇంకా మంచి అవుట్ పుట్ వస్తుంది. ‘కనుల చాటు మేఘమా’ పాటను కీరవాణి గారి లాంటి దిగ్గజం సహా అందరూ ప్రశంసించడంతో కళ్యాణ్ మాలిక్ గారు ఎంతో ఆనందంగా ఉన్నారు.

వరుసగా నాగశౌర్యతోనే సినిమాలు చేయడానికి కారణం?
నాగశౌర్య నాకు చాలా ఇష్టమైన నటుడు. యూకేలో షూటింగ్ కి పదిమందితోనే వెళ్లడంతో అక్కడ మేం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అయితే నాగశౌర్య తన నటనతో ఆ ఇబ్బందులను మర్చిపోయేలా చేసేవాడు. ప్రతిరోజూ అవుట్ పుట్ చూసుకొని సంతృప్తి కలిగేది. ఇది ముఖ్యంగా నటన మీద ఆధారపడిన సినిమా. నాగశౌర్య ఎంత బాగా నటించాడనేది మీకు సినిమా చూశాక తెలుస్తుంది. అయితే నేను కథ రాసుకునేటప్పుడు ఫలానా నటుడిని దృష్టిలో పెట్టుకొని రాయను. కథ రాసుకున్నాక దానికి తగ్గ నటీనటులను, సాంకేతిక నిపుణులను ఎంచుకుంటాను.

ఈ సినిమా గురించి ఇప్పటికే నాగశౌర్య చాలా గొప్పగా చెప్పారు.. ఎలా ఉండబోతోంది సినిమా?
ఈ సినిమాలో ఏడు చాప్టర్లు ఉంటాయి. ఒక్కో చాప్టర్ నిడివి సుమారుగా 20 నిమిషాలు ఉంటుంది. ఈ ఏడు చాప్టర్లు పదేళ్ల వ్యవధిలో జరుగుతాయి. ఈ పదేళ్లలో 18 నుంచి 28 ఏళ్ళ వరకు నాగశౌర్య, మాళవిక పాత్రల ప్రయాణం ఉంటుంది. వయసుకి తగ్గట్లుగా పాత్ర తాలూకు ప్రవర్తన, ఆహార్యంలో వ్యత్యాసం చూపించడానికి నాగశౌర్య ఎంతో కష్టపడ్డాడు. ఈ సినిమా పట్ల శౌర్య చాలా నమ్మకంగా ఉన్నాడు.

తెలుగు సినిమాకి ఈ తరహా చిత్రాన్ని తీసుకురావడం ఎలా ఉంది?
‘బిఫోర్‌ సన్‌రైజ్‌’ అనే ఇంగ్లీష్ సినిమా నాకు చాలా ఇష్టమైన సినిమా. ఈ తరహా సినిమా తెలుగులో చేయాలి అనిపించింది. ఇలాంటి సినిమాలకు డైలాగ్స్ స్క్రిప్టెడ్ ఉంటే సహజత్వం పోతుంది. నటీనటులు సహజంగా మాట్లాడున్నట్లు ఉండాలి. దర్శకుడిగా నా బలం నటీనటుల నుంచి సహజ నటన రాబట్టుకోవడం. నేను ఫ్రేమ్ లో మొదట నటీనటులు అభినయం ఎలా ఉంది అనేదే చూస్తాను. ఆ నమ్మకంతోనే ఈ సినిమా చేశాను. మా నిర్మాతలు నన్ను, నా కథని, ఈ ప్రయోగాన్ని నమ్మారు.

టీజర్ లో ఉన్న ముద్దు సన్నివేశం గురించి మాళవిక గారికి ముందే చెప్పారా?
నేను కథ చెప్పినప్పుడే ఉన్న సన్నివేశాలన్నీ చెప్పాను. కథ విన్నాక ఆమె ఎమోషనల్ గా స్పందించారు. ఆమె కథకి అంతలా కనెక్ట్ అవ్వడంతో.. ఈ సినిమాలో కూడా అంత ఎమోషన్ తీసుకురాగలదనే నమ్మకం కలిగింది. ప్రతి సన్నివేశం ఆమెకు ముందుగానే చెప్పాను. ఆ సన్నివేశానికి సరైన కారణాలు ఉంటే, కథకి ఖచ్చితంగా అవసరం అనిపిస్తే నటీనటులు చేయడానికి
సిద్ధపడతారు అనేది నా అభిప్రాయం.

ఈ పదేళ్లలో నటుడిగా నాగశౌర్యలో గమనించిన మార్పులు ఏంటి?
నటుడిగా నాగశౌర్యలో చాలా తపన ఉంది. సినిమా సినిమాకి ఎంతో మెరుగుపడుతున్నాడు. ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ సమయంలో నటుడిగా నిరూపించుకోవాలనే తపన ఎంతో ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. ఇంకా చెప్పాలంటే సినిమా సినిమాకి డెడికేషన్ పెరుగుతూ వస్తుంది. అలా అని నా తదుపరి సినిమా కూడా నాగశౌర్యతోనే చేస్తానని చెప్పలేను. ఎందుకంటే ముందుగా కథ రాసుకొని, ఆ తరువాత కథకు సరిపోయే నటీనటులను ఎంచుకుంటాను.

బ్రహ్మాస్త్ర, అవతార్-2 సినిమాలకు తెలుగులో మాటలు రాసే అవకాశం ఎలా వచ్చింది?
ఒకసారి టీమ్ ఫోన్ చేసి బ్రహ్మాస్త్రకు రాస్తారా అని అడిగారు. అప్పటికే ఆ సినిమా గురించి నాకు తెలుసు. నాగార్జున గారు కూడా నటిస్తున్నారని తెలుసు. పెద్ద సినిమా, ఎక్కువమంది చేరువయ్యే సినిమా కావడంతో వెంటనే రాయడానికి అంగీకరించాను. ఆ సినిమా చూసి నాకు అవతార్-2 అవకాశం ఇచ్చారు. హిందీ సినిమాలతో పోల్చితే ఇంగ్లీష్ సినిమాలకు తెలుగు సంభాషణలు రాయడం కొంచెం కష్టం. దానిని ఛాలెంజింగ్ గా తీసుకుని అవతార్-2 కి రాశాను.

తదుపరి సినిమాలు?
ప్రస్తుతం ఒక కథ అనుకుంటున్నాను. ఇంకా నేరేట్ చేసేదాకా రాలేదు. కథ పూర్తయ్యాక నటీనటుల ఎంపిక జరుగుతుంది. నానితో మంచి అనుబంధముంది. ఆయనతో సినిమా చేయాలని ఉంది. కానీ దానికి సమయముంది. నటుడిగా కన్యాశుల్కం అనే వెబ్ సిరీస్ చేశాను. త్వరలోనే విడుదల కానుంది. నటుడిగా తృప్తినిచ్ఛే పాత్రలు మాత్రమే చేస్తూ ఎక్కువగా రచన, దర్శకత్వం మీద దృష్టి పెట్టాలి అనుకుంటున్నాను.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News