Sunday, January 12, 2025

బాలకృష్ణ మొండి గుర్రంపై స్వారీ చేసి మమ్మల్ని ఆశ్చర్యపరిచారు..

- Advertisement -
- Advertisement -

వరుస ఘన విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి ’డాకు మహారాజ్’ చిత్రంతో అలరించనున్నారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలు. బాబీ డియోల్, ఊర్వశి రౌతేలా, చాందిని చౌదరి కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా ఆదివారం ’డాకు మహారాజ్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు బాబీ కొల్లి మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన పలు ఆసక్తికర విషయాలు…

చాలా నిజాయితీగా కథను చెప్పాము…
బాలకృష్ణ ఇమేజ్‌ని, ప్రేక్షకుల్లో ఆయన సినిమాపై ఉండే అంచనాలను దృష్టిలో ఉంచుకొని ’డాకు మహారాజ్’ సినిమా చేయడం జరిగింది. అయితే బాలకృష్ణ గత చిత్రాలకు భిన్నంగా కొత్తగా చూపించడానికి ప్రయత్నించాము. బాలయ్య సెటిల్డ్‌గా డైలాగ్ లు చెప్తే చాలా బాగుంటుంది. ’నరసింహానాయుడు’, ’సమరసింహారెడ్డి’ తర్వాత ’సింహా’ ఎలా అయితే గుర్తుండే సినిమా అయిందో.. డాకు మహారాజ్ కూడా అలాంటి పేరు తెచ్చుకుంటుందనే నమ్మకం ఉంది. చాలా నిజాయితీగా కథను చెప్పాము.
డూప్ లేకుండా నటించడానికి ఇష్టపడతారు…
బాలకృష్ణ నుంచి ఎవరైనా క్రమశిక్షణ నేర్చుకోవచ్చు. దర్శకుడికి ఎంతో గౌరవం ఇస్తారు. సెట్స్‌లో అందరితో సరదాగా ఉంటారు. అభిమానులు తనను చూడటానికి వస్తారు కదా అని, డూప్ లేకుండా నటించడానికి ఇష్టపడతారు. మొండి గుర్రాన్ని సైతం అదుపు చేస్తూ, స్వయంగా స్వారీ చేసి మమ్మల్ని ఆశ్చర్యపరిచారు.
అందుకే విజువల్స్ అంత అద్భుతంగా…
నిర్మాత నాగవంశీ బాలకృష్ణని ఎంతో అభిమానిస్తారు. ఆ అభిమానంతోనే తమ బ్యానర్ లో వచ్చే సినిమా వైవిధ్యంగా ఉండాలని అనుకున్నారు. అలాగే ఒక దర్శకుడిగా నాకెంతో స్వేచ్ఛ ఇచ్చారు. ఇద్దరం కలిసి ఈ సినిమాలో విజువల్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడేలా చేయాలని అనుకున్నాము. కెమెరామెన్ విజయ్ కన్నన్‌తో నాకు ముందే పరిచయముంది. అప్పుడు ఆయన జైలర్ సినిమాకి పని చేస్తున్నారు. నాగవంశీ కూడా విజయ్ పేరు చెబితే వెంటనే ఓకే అని, ఆయనతో మాట్లాడారు. అలా విజయ్ ఈ సినిమాలో భాగమయ్యారు. ఆయన ఎంతో అంకిత భావంతో పని చేస్తారు. అందుకే విజువల్స్ అంత అద్భుతంగా వచ్చాయి.
ఆయుధం కొత్తగా ఉండాలని…
హీరోకి ఆయుధం అనేది కీలకం. ముఖ్యంగా బాలకృష్ణ సినిమాల్లో గొడ్డలి వంటి పవర్‌ఫుల్ ఆయుధం బాగా ఫేమస్. ఈ సినిమాలో ఆలాంటి శక్తివంతమైన ఆయుధం ఉండాలి, కానీ అది కొత్తగా ఉండాలి అనుకున్నాము. అందుకు తగ్గట్టుగానే ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ అద్భుతమైన ఆయుధాలను డిజైన్ చేశారు.

వారి కష్టం ముందు మా కష్టం చిన్నది…
రాజస్థాన్ ఎడారిలో షూటింగ్ సమయంలో దర్శకుడు, నటీనటుల కష్టం కంటే కూడా సిబ్బంది ఎక్కువ కష్టపడ్డారని చెప్పగలను. ఎందుకంటే మేము షూట్ గ్యాప్ లో నీడలో ఉంటాము. కానీ సిబ్బంది విరామమే లేకుండా ఎండలో ఎంతో కష్టపడతారు. అందుకే వారి కష్టం ముందు మా కష్టం చిన్నది అనిపిస్తుంది.
ఇద్దరూ పూర్తి న్యాయం చేశారు…
ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ ఇద్దరు హీరోయిన్లు మంచి ప్రాధాన్యమున్న పాత్రలు పోషించారు. వారివి రెగ్యులర్ హీరోయిన్ తరహా పాత్రలు కావు. నటనకు ఆస్కారమున్న పాత్రలు. ఇద్దరూ వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
బాబీ డియోల్ పాత్ర కొత్తగా…
సినిమాలో రెగ్యులర్ విలన్ పాత్రలా కాకుండా బాబీ డియోల్ పాత్ర కొత్తగా ఉంటుంది. ఆయన నిబద్ధతగల నటుడు. పాత్రకి న్యాయం చేయడం కోసం సెట్‌లో ఎంత సమయాన్ని అయినా కేటాయిస్తారు. అలాగే బాబీ డియోల్… ఎన్టీఆర్‌ని, బాలకృష్ణని ఎంతో గౌరవిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News