కింగ్ అక్కినేని నాగార్జున, యువ సామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన బంగార్రాజు సినిమా సంక్రాంతి కానుకగా ఈనెల 14న రాబోతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాత. ఈ చిత్రం విడుదలను పురస్కరించుకొని డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణతో ఇంటర్వూ…
అప్పుడే నిర్ణయించుకున్నాము…
2016లో ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రం విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. అప్పుడే ‘బంగార్రాజు’ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాము. మధ్యలో చైతన్యతో నేను ఓ సినిమా తీస్తే నాగార్జున నిర్మించారు. ప్రతి విషయంలో ఆయన నాకు సపోర్ట్ చేస్తూనే వచ్చారు. నేను ఏం చెప్పాలని అనుకుంటున్నానో ఆయనకు అర్థమవుతుంది. ఆయన ఏం చెప్పాలని అనుకుంటున్నారో నాకు అర్థమవుతుంది. మా మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ లేదు.
ఇది ప్రీక్వెల్ కాదు…
‘సోగ్గాడే…’ సినిమాకు సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ రాబోతోంది. ఇది ప్రీక్వెల్ కాదు. రెండు సినిమాలను కలిపి చూస్తే ఐదు గంటలు అవుతుంది. ‘సోగ్గాడే…’ ఎక్కడ ముగుస్తుందో ‘బంగార్రాజు’ అక్కడ మొదలవుతుంది. ఈ చిత్రంలో బంగార్రాజు మనవడిగా చైతూ కనిపిస్తారు. పెద్ద బంగార్రాజు పాత్ర ఎలా ఉండేదో.. చిన్న బంగార్రాజు పాత్ర కూడా అలానే ఉంటుంది.
అందుకే ఇంత సమయం…
నాగార్జున, నాగచైతన్య ఇద్దరిలో ఎవ్వరూ తగ్గకూడదు. అందుకే స్క్రిప్ట్‌కు ఇంత సమయం పట్టింది. మొదట్లో కొంత మంది నాగచైతన్యది గెస్ట్ క్యారెక్టర్ అని రాశారు. రెండు పాత్రలు సమానంగా ఉంటాయి. ఇద్దరు హీరోలకు ప్రతి ఎమోషన్ సమానంగా ఉంటుంది. ఇక ఈ సినిమాను ప్రారంభించడమే సంక్రాంతి టార్గెట్‌గా చేశాము. కానీ డేట్ మాత్రం ఫిక్స్ చేయలేదు.
సెంటిమెంట్ కోసం కాదు…
పాటలో ఫన్ ఉంటే నాగార్జున ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఈ చిత్రంలో ఆయన కబడ్డీ మీద పాట పాడారు. ఈ పాట ఎవరు పాడినా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. కానీ ఆయన పాడితే ఇంకాస్త ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. అందుకే నాగార్జునతో పాడించాం. అంతేకానీ సెంటిమెంట్ కోసం కాదు.
దేనికదే ప్రత్యేకంగా…
ఈ సినిమాకు సంగీతమే ప్రధాన బలం. ఇప్పటి వరకు మూడు పాటలు వచ్చాయి. ఇంకా మూడు పాటలు రానున్నాయి. దేనికదే ప్రత్యేకంగా ఉంటుంది. ఆడియో ఎంత బాగుంటుందో.. మేకింగ్ పరంగా కూడా అంతే బాగుంటుంది. ఆర్‌ఆర్ అద్భుతంగా ఉంటుంది. ఆదివారం మ్యూజికల్ ఈవెంట్ ఉంది. అందులోనే పాటలు విడుదల చేస్తాం.
అమాయకురాలిగా కృతి…
చాలా తెలివైనదాన్ని అని అనుకునే అమాయకురాలి పాత్రలో కృతి శెట్టి కనిపిస్తుంది. బీటెక్ చదివి తనలాంటి తెలివైన అమ్మాయిలు ఊరిలో లేరని అనుకునే పాత్రలో ఆమె నటించింది. ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమాలో ఉన్నట్టుగా రమ్యకృష్ణ పాత్ర కొనసాగుతుంది.
తదుపరి చిత్రాలు…
నిర్మాత జ్ఞానవేల్ రాజాతో ఓ సినిమా ఉంటుంది. కథ, హీరో అనేది ఇంకా నిర్ణయించలేదు. హీరోను బట్టి ద్విభాష చిత్రంగా ఉండొచ్చు. కానీ నేను మాత్రం తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకునే సినిమాను తీస్తాను. నాకు పాన్ ఇండియా మూవీ ఆలోచనలు లేవు. ఇక జీవితంలో మూడు దశల్లో ఉండే ప్రేమ కథతో ఓ సినిమా అనుకున్నాను. అందులో యంగ్ పాత్రలో నాగ చైతన్య, మిగిలిన పాత్రలో నాగార్జున అని అనుకున్నాను. ఆ కథ అయితే ఉంది. ఎప్పుడు చేస్తానో తెలియదు.
Director Kalyan Krishna interview