Thursday, November 21, 2024

‘ఆదికేశవ’ అందరికీ కనెక్ట్ అవుతుంది: శ్రీకాంత్ ఎన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్, యువ సంచలనం శ్రీలీల జంటగా నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఆదికేశవ’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జోజు జార్జ్, అపర్ణా దాస్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం శుక్రవారం(నవంబర్ 24న) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గురువారం నాడు విలేఖర్లతో ముచ్చటించిన దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి చిత్ర విశేషాలను పంచుకున్నారు.

ఆదికేశవ ప్రయాణం ఎలా మొదలైంది?
సన్నిహితులంతా మంచి కమర్షియల్ సినిమా చేయమని సూచించారు. అప్పుడు ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా ఉండేలా మంచి కమర్షియల్ కథను సిద్ధం చేశాను.. అదే ఆదికేశవ.

ఈ కథ సితార దగ్గరకు ఎలా వెళ్ళింది?
భీమ్లా నాయక్ సెట్స్ కి వెళ్ళి వంశీ గారికి కథ చెప్పగా ఆయనకి నచ్చింది. ఆ తర్వాత చినబాబు గారికి, వైష్ణవ్ తేజ్ గారికి కథ చెప్పాను. అందరికీ నచ్చింది. అలా సితార సంస్థ తో దర్శకునిగా నా ప్రయాణం మొదలైంది .

అనుకున్న బడ్జెట్ లో సినిమా పూర్తయిందా?.. నిర్మాతల సహకారం ఎలా ఉంది?
ఏ రోజూ కూడా వంశీ గారు ఇంత బడ్జెట్ లో తీయమని నాకు చెప్పలేదు. కొత్త దర్శకుడివి నువ్వు, నీకు డబ్బుల గురించి ఆలోచన వద్దని చెప్పారు. సినిమా కోసం నేను అడిగినవన్నీ సమకూర్చి పెట్టారు. మంచి మంచి నటీనటులను ఇచ్చారు. బడ్జెట్, పారితోషికం ఇలాంటి పట్టించుకోకుండా నా దృష్టి అంతా సినిమా చిత్రీకరణ మీద ఉండేలా చూశారు.

కథ ఎలా ఉంటుంది?
హైదరాబాద్ లో ఉండే ఒక సాధారణ కుర్రాడు.. ఎక్కడో అనంతపురం దగ్గరున్న కళ్యాణదుర్గంలోని బ్రహ్మసముద్రం అనే గ్రామంలో జరుగుతున్న దారుణాలను ఎలా అడ్డుకున్నాడు అనేది ఈ సినిమా లో చూస్తారు.

యాక్షన్ సన్నివేశాలు కూడా మీరే రాసుకున్నారా?
సన్నివేశానికి, సందర్భానికి తగ్గట్టుగా అక్కడ ఎలాంటి ఆయుధం పెడితే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనే కొన్ని ఐడియాలు నేను ఇచ్చాను. ఆ ఫైట్లు ఎలా డిజైన్ చేయాలి అదంతా రామ్, లక్ష్మణ్ మాస్టర్లు చూసుకున్నారు.

ట్రైలర్ కి వచ్చిన స్పందన ఎలా ఉంది? సినిమాకి ఎలాంటి స్పందన వస్తుంది అనుకుంటున్నారు?
ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. నేను ట్రైలర్ కింద కామెంట్లు చూశాను. 75 శాతానికి పైగా ట్రైలర్ బాగుందని కామెంట్లు పెట్టారు. సినిమాకి కూడా మంచి స్పందన వస్తుందనే నమ్మకం ఉంది. సినిమా ప్రారంభమైన పది నిమిషాలకే హీరో వైష్ణవ్ తేజ్ పాత్రతో ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు.

ఈ సినిమాకి క్లైమాక్స్ హైలైట్ అని అందరూ చెబుతున్నారు.. క్లైమాక్స్ ఎలా ఉండబోతుంది?
క్లైమాక్స్ కొత్తగా ఉంటుంది. ఈ సినిమా చివరి 45 నిమిషాలు అద్భుతంగా ఉందని ఇప్పటిదాకా చూసిన ప్రతి ఒక్కరూ చెప్పారు. ఎడిటర్ నవీన్ నూలి గారు కూడా చివరి 45 నిమిషాలు అదిరిపోయింది అన్నారు. డీఐ టైంలో ఈ సినిమా చూస్తూ ఎమోషనల్ అయినవాళ్ళు ఉన్నారు. సినిమా కథ, కథనం, పతాక సన్నివేశాలు ప్రధాన ఆకర్షణ. ఖచ్చితంగా ఈ సినిమా ఎమోషనల్ గా కూడా అందరికీ కనెక్ట్ అవుతుంది.

హీరోయిన్ శ్రీలీల ఎంపిక ఎవరిది?
నాగవంశీ గారే సూచించారు. అప్పటికి ఇంకా ధమాకా కూడా విడుదల కాలేదు. వైష్ణవ్, శ్రీలీల జోడీ బాగుంటుందని వంశీ గారు అన్నారు.

జి.వి. ప్రకాష్ గారి గురించి?
జి.వి. ప్రకాష్ గారు కావాలని నేనే అడిగాను. ఆయన అనుభవం చాలా హెల్ప్ అయింది. పాటలు, నేపథ్య సంగీతం అద్భుతంగా ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News