శర్వానంద్ హీరోగా శ్రీకార్తీక్ దర్శకత్వంలో అమల అక్కినేని, రీతూ వర్మ, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్‌ఆర్ ప్రకాష్ బాబు, ఎస్‌ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమా తాజాగా విడుదలై బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో దర్శకుడు శ్రీకార్తిక్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. “కథని రాయడానికి రెండేళ్ళు పట్టింది. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి దాదాపు ఐదేళ్ళు పట్టింది. అయితే నా నిరీక్షణకి తగిన ఫలితం దక్కింది. సినిమా అందరికీ కనెక్ట్ అయింది. నాకు చాలా ఆనందంగా వుంది. శర్వానంద్‌తో పని చేయడం గొప్ప అనుభవం. ఈ సినిమా నాకు, శర్వాకి ఇద్దరికీ ఒక ఎమోషనల్ రైడ్. శర్వాకి కూడా అమ్మ అంటే ప్రాణం. శర్వా లాంటి స్టార్ హీరో ఈ సినిమా చేయడమే పెద్ద సక్సెస్. అమలని తీసుకోవాలనే ఆలోచన నాదే. కథ విన్న తర్వాత ఆమెకి చాలా నచ్చింది. వెంటనే సినిమా చేస్తానని చెప్పారు. ఈ సినిమా చూసిన తర్వాత నాగార్జున…శర్వానంద్‌తో ’ఇకపై నిన్ను నా కొడుకులా చూస్తా’ అన్నారు. ఈ కాంప్లిమెంట్ నాకు దొరకలేదు కానీ అది నాకు దక్కిన కాంప్ల్లిమెంట్‌లానే భావిస్తా. అలాగే అఖిల్ చాలా ఎమోషనల్ అయ్యారు. ఒక గొప్ప సినిమా చూసినప్పుడు సినిమా గురించి కాకుండా జీవితం గురించి మాట్లాడుకుంటాం. అది ‘ఒకే ఒక జీవితం’కు జరిగింది. అలాగే మారుతితో పాటు మరికొందరు దర్శకులు సినిమా గురించి గొప్ప గా మాట్లాడారు”అని అన్నారు.
Director Srikarthik interview about ‘Oke Oka Jeevitham’