Monday, December 23, 2024

మనసున్న ప్రతి మనిషికి నచ్చే సినిమా ‘సార్’ : వెంకీ అట్లూరి

- Advertisement -
- Advertisement -

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ద్విభాషా చిత్రం ‘సార్'(తెలుగు)/‌ ‘వాతి'(తమిళం). శ్రీకర స్టూడియోస్ సమర్పించిన ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. స్టార్ యాక్టర్ ధనుష్, సంయుక్త మీనన్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 17న విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. షో షోకి వసూళ్ళు పెంచుకుంటూ ఈ చిత్రం భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా విలేకర్లతో ముచ్చటించిన దర్శకుడు వెంకీ అట్లూరి సినిమా విజయం పట్ల ఆనందం వ్యక్తం చేయడమే కాకుండా.. సినిమాకి సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఇది 1990-2000 నాటి కథ కదా.. ఇప్పటి యువతకి నచ్చుతుందా అనే సందేహం కలగలేదా?
ఏ కథైనా చక్కగా చెబితే ఎవరైనా వింటారు. ఇది విద్య నేపథ్యంలో తెరకెక్కిన సినిమా. అప్పటికి ఇప్పటికి పరిస్థితులు మెరుగు పడలేదు. 90ల కథ అయినప్పటికీ ఇప్పటికి కూడా సరిగ్గా సరిపోయే కథ. ఎంట్రన్స్ ఎగ్జామ్ లు, ఒత్తిడులు అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి. చదువు అనేది నిత్యావసరం. అందుకే ఈ సబ్జెక్ట్ ఎప్పుడూ కనెక్ట్ అవుతుంది.

ఈ కథలో ధనుష్ గారి కంటే ముందు ఎవరినైనా అనుకున్నారా?
లేదండీ ధనుష్ గారినే అనుకున్నాం. లాక్ డౌన్ లో ఈ కథ రాసుకున్నాను. ఆ సమయంలో ధనుష్ గారికి కథ చెప్పాలి అనుకున్నాను. ఆయనకు కథ చెప్పే అవకాశం వచ్చింది. లాక్ డౌన్ సమయంలో ఓటీటీ వల్ల భాషతో సంబంధం లేకుండా ఫహద్ ఫాజిల్, ధనుష్, పృథ్వీరాజ్ వంటి నటులు మనకు మరింత చేరువయ్యారు. ఓటీటీల వల్ల నేను ధనుష్ గారిని ఇంకా ఎక్కువ అర్థం చేసుకోవడం, ఇంకా ఎక్కువ ఇష్టపడటం చేశాను. ఆయనతో సినిమాతో చేయాలనే కోరిక పెరిగింది. మా నిర్మాతలు ధనుష్ గారికి కథ చెప్తారా అనగానే చాలా సంతోషించాను. కథ చెప్పగానే ఆయన క్లాప్స్ కొట్టి డేట్స్ ఎప్పుడు కావాలి అనడంతో ఆనందం కలిగింది.

ఇది ఎమోషన్స్ ని నమ్ముకొని రూపొందించిన ఎడ్యుకేషనల్ ఫిల్మ్ కదా?
ఈ సినిమా తల్లిదండ్రులు కూడా బాగా కనెక్ట్ అవుతారు. సినిమా చూశాక నాకు బాగా కావాల్సిన ఆయన ఫోన్ చేసి నేను ఇంకా ఎక్కువ చదువుకుంటే బాగుండు అనిపించింది అన్నారు. అలాగే పిల్లలకు కూడా ఈ సినిమా చూశాక తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో తెలుస్తుంది. స్టూడెంట్స్, పేరెంట్స్ కి అందరికీ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. మనసున్న ప్రతి మనిషికి ఈ సినిమా నచ్చుతుంది.

అతిథి పాత్రలో సుమంత్ గారిని తీసుకోవాలనే ఆలోచన ఎలా వచ్చింది?
ఈ సినిమాలో సుమంత్ గారిని అనుకున్నప్పుడు సీతారామం సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు. మేం షూట్ చేసే సమయానికి ఆయన సీతారామంలో ఉన్నారని మాకు తెలీదు. ఇందులో ఆ పాత్ర ఎవరైనా స్పెషల్ పర్సన్ చేస్తే బాగుంటుంది అనుకున్నాం. ఎవరా ఎవరా అని ఆలోచిస్తుంటే సుమంత్ గారైతే బాగుంటుంది అనిపించింది. ఆయనను సంప్రదిస్తే కథ నచ్చితే చేస్తాను అన్నారు. కథ విని ఆయన వెంటనే ఈ పాత్ర చేయడానికి అంగీకరించారు.

త్రివిక్రమ్ గారు ఏమైనా సలహాలు, సూచనలు ఇచ్చారా?
నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి.. ఒక ప్రొడ్యూసర్ కి, డైరెక్టర్ కి మధ్య కథా పరంగా ఎలాంటి చర్చలు జరుగుతాయో అలాంటి చర్చలు జరిగాయి. ఏదైనా సీన్ నచ్చితే వెంటనే బాగుందని మెచ్చుకునేవాళ్ళు. కొన్ని కొన్ని సీన్లు ఇలా చేస్తే బాగుంటుందని సలహాలు ఇచ్చారు. ఇందులో తండ్రీకొడుకుల మధ్య మంచి సన్నివేశం ఉంటుంది. అది త్రివిక్రమ్ గారితో జరిపిన సంభాషణల నుంచే పుట్టింది.

సీక్వెల్ ఆలోచన ఉందా?
సీక్వెల్ ఆలోచన లేదు. నిజాయితీగా ఒక కథ చెప్పాలనుకున్నాను. అదే చేశాను.

ఇందులో సముద్రఖని-ధనుష్ మధ్య ఫైట్ లేకపోవడానికి కారణం?
నేను సినిమా చేసేటప్పుడు ఏ రోజూ కూడా సముద్రఖని గారికి, ధనుష్ గారికి మధ్య ఫైట్ పెట్టాలనుకోలేదు. అలా పెడితే బాగోదు. సహజంగా ఉండదు. ఆ పాత్రల స్వభావం ప్రకారం వాళ్ళు నేరుగా తలపడకపోవడమే సరైనది.

ఈ చిత్రాన్ని త్రీ ఇడియట్స్, సూపర్ 30 తో పోలుస్తున్నారు కదా?
దీనికి, త్రీ ఇడియట్స్ కి సంబంధమే లేదు. సూపర్ 30 అనేది బయోపిక్. నేను సార్ కథ ముందే అనుకున్నాను. అయితే సూపర్ 30 వచ్చినప్పుడు రెండు కథలు కలుస్తాయేమో అని భయపడి చూశాను. కానీ ఆ కథ వేరు, ఇది వేరు. అది బయోపిక్, ఇది ఫిక్షనల్.

తమిళ్ లో స్పందన ఎలా ఉంది?
నేను చెన్నైలో ప్రేక్షకులతో కలిసి షో చూశాను. వాళ్ళు సినిమా చూస్తూ చప్పట్లు కొడుతూనే ఉన్నారు. అది చాలు అక్కడ స్పందన ఎలా ఉందో చెప్పడానికి. తెలుగులో కూడా ప్రీమియర్ షోల నుంచే సినిమా బాగుందంటూ చాలా ఫోన్లు వచ్చాయి. కొందరైతే హిందీలో కూడా విడుదల చేయాల్సింది అన్నారు. ఇది యూనివర్సల్ సబ్జెక్ట్. అన్ని భాషల ప్రేక్షకులను మెప్పిస్తుంది.

ప్రేమకథల నుంచి ఈ వైపు టర్న్ తీసుకోవడానికి కారణమేంటి?
మూడు ప్రేమకథలు చేశాను. ఈసారి ప్రేక్షకులను కొత్తదనం చూపించాలి అనుకున్నాను. అలా ఏ సబ్జెక్ట్ చేద్దామని ఆలోచిస్తున్న సమయంలో సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు చూసి.. విద్య నేపథ్యంలో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. నా విద్య 90లలో సాగింది. ఆ సమయంలో నాకు ఎదురైన అనుభవాలు, నేను చూసిన సంఘటనలను ఆధారంగా చేసుకొని ఈ కథ రాసుకున్నాను.

సార్ చిత్రానికి సినీ పరిశ్రమ నుంచి ఎలాంటి ప్రశంసలు దక్కాయి?
త్రివిక్రమ్ గారు చాలా మంచి సినిమా చేశావు అన్నారు. శిరీష్ గారు, నితిన్, వరుణ్ తేజ్ ఇలా ఎందరో ఫోన్ చేసి ప్రశంసించారు.

మీ తదుపరి చిత్రం కూడా సితార బ్యానర్ లోనే ఉంటుందా?
సితార నాకు హోమ్ బ్యానర్ లాంటిది. నిర్మాత వంశీ గారు నాకు చాలా మంచి స్నేహితుడు. త్రివిక్రమ్ గారంటే ప్రత్యేక అభిమానం ఉంటుంది. వారితో కలిసి పని చేయడం నాకెప్పుడూ సంతోషాన్ని ఇస్తుంది. అయితే తదుపరి సినిమా గురించి ఇప్పుడే చెప్పలేదు. నేను సార్ అనే ఒక మంచి సినిమా తీశాను. అది ఎక్కువ మందికి చేరువ అవ్వాలి అనుకుంటున్నాను. ఆ తర్వాతే కొత్త సినిమా గురించి ఆలోచిస్తాను.

ఇక నుంచి కమర్షియల్ సినిమాల వైపు అడుగులు వేస్తారా?
ఇది పూర్తి కమర్షియల్ సినిమా అనను. కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన సందేశాత్మక చిత్రం. ఇక నుంచి సినిమా సినిమాకి వైవిధ్యం చూపించాలి అనుకుంటున్నాను. విభిన్న జోనర్లలో సినిమాలు చేస్తాను.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News