Wednesday, January 22, 2025

కమల్, రజనీ జాతకాలను మార్చేసిన దర్శకుడు

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: దేశం గర్వించదగ్గ దర్శకులలో ఆయన ఒకరు. 1970వ దశకంలో తమిళ చిత్ర దర్శకుడిగా పరిచయమైన ఆయన ఒక సంచలనం. స్టూడియో సెట్టింగులు, ఓవర్ సెంటిమెంటులతో సాగుతున్న తమిళ సినిమాను పల్లెబాట పట్టించారు. మట్టివాసన రుచి ప్రజలకు చూపించారు. గ్రామీణ నేపథ్యంలో ఆయన తీసిన సినిమాలు ఘనవిజయం సాధించడమేగాక వివిధ భాషలలో కూడా రూపొందాయి.అనేకమంది కొత్తనటీసనులనే కాక కొత్త దర్శకులు అనేకమందిని ఆయన చిత్రపరిశ్రమకు అందించారు. ఆయన వద్ద శిష్యరికం చేసిన వారిలో భాగ్యరాజా, వంశీ వంటివారు అనేకమంది ఉన్నారు. ఆయనే క్రియేటివ్ డైరెక్టర్ భారతీరాజా. ఆయన దర్శకత్వం వహించిన మొదటి పదినారు వయదినిలే(పదహారేళ్ల వయసు).

భారతీరాజా, ఇళయరాజా ఇద్దరూ సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు నుంచి ఫ్రెండ్స్. ఇళయరాజా సొంతవూరు తమిళనాడుతేనీ జిల్లా పన్నియపురం. ఇళయరాజా పెద్దన్న పావలర్ వరదరాజన్ కమూనిస్టు పార్టీలకు సాంస్కృతిక కళాకారుడిగా పనిచేసేవారు. ఆయన సోదరులే భాస్కర్, ఇళయరాజా, గంగై అమరన్. అన్నదమ్ములు అందరూ సంగీత కళాకారులే. వీరంతా గ్రామంతోపాటు చుట్టుపక్కల గ్రామాలలో జరిగే వేడుకలలో సంగీత కచేరి నిర్వహించేవారు. అదే రోజులలో ఆ గ్రామానికి మలేరియా నివారణ ప్రాజెక్టు ఇన్‌స్పెక్టర్‌గా భారతీరాజా వచ్చారు. అన్నదమ్ములతో స్నేహం కుదిరింది. అంతా కలిసికట్టుగా రంగస్థల ప్రదర్శనలు ఇచ్చేవారు. కొద్ది రోజుల తర్వాత సినిమాలలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి భారతీరాజా మద్రాసుకు వచ్చేశారు. అప్పటి ప్రముఖ దర్శకుడు పుట్టన్న కనగళ్ దగ్గర అసిస్టెంటుగా చేరిపోయారు. ఆ తర్వాత కొద్దిరోజులకే ఇళయరాజా, గంగై అమరన్ కూడా మద్రాసు వచ్చి సంగీత దర్శకుడు జికె వెంకటేష్ అసిస్టెంట్లుగా చేరిపోయారు.

పుట్టన్న దగ్గర అసిస్టెంటుగా ఒక చిత్రానికి పనిచేసిన భారతీరాజా మరి కొద్దిమంది దర్శకుల వద్ద కూడా కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత తానే దర్శకుడిగా మారేందుకు అవకాశాల కోసం వెదకసాగారు. ఇళయరాజాకు అప్పటికే సంగీత దర్శకుడిగా అవకాశం లభించింది. వీళ్ల మిత్ర బృందంలో గాయకుడిగా అప్పుడప్పుడే ఎదుగుతున్న ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం కూడా ఉండేవారు. అప్పట్లో బాలసుబ్రహ్మణ్యం దగ్గరే సొంతంగా ఫియట్ కారు ఉండేది. ఆ కారులోనే ఇళయరాజా, బారతీరాజా, బాలు కలసి సంగీత కచేరీల కోసం వివిధ ఊళ్లకు వెళ్లేవారు. భారతీరాజా చెప్పే చెప్పే సినిమా కథలు విని తన దగ్గర డబ్బు ఉంటే తానే సినిమా నిర్మించేవాడినని బాలు చెప్పేవారు. ఒకరోజు బారతీరాజా చెప్పిన మయిల్ అనే కథ విని ఎస్పీ బాలు అద్వాన్సుగా 5వేల రూపాయలు కూడా భారతీరాజాకు ఇచ్చారు. చిత్ర నిర్మాణ సంస్థకు బాలు కుమార్తె పేరు పల్లవి ప్రొడక్షన్స్ అని కూడా నామకరణం చేశారు. అయితే ఆ ఆతర్వాత బాలు గాయకుడిగా బిజీ అయిపోవడంతో కత ముందుకు కదల్లేదు.

ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా ఈ కతను సినిమాగా తీద్దామని కూడా భారతీరాజా ప్రయత్నించారు. ఆ ప్రయత్నం కూడా ముందుకు సాగలేదు. అలాంటి పరిస్తితుల్లో రాజ్ కన్ను అనే నిర్మాత ఈ కథను సినిమాగా నిర్మించడానికి ముందుకు వచ్చారు. దీన్ని ఆఫ్‌బీట్ చిత్రంగా నిర్మించాలని బారతీరాజా భావించినప్పటికీ కలర్‌లోనే తీద్దామని నిర్మాత చెప్పారు. ఈ చిత్రంలో హీరోయిన్ పేరు మయిల్. అదే సినిమా పేరుగా ముందు అనుకున్నప్పటికీ చివరకు పదినారు వయదినిలేగా మారిపోయింది.

ముందుగా ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా కమెడియన్ నాగేష్, రోజారమణిని ఎంచుకున్నారు. అయితే..కమర్ఫియల్‌గా ఇది వర్కవుట్ కాదన్న అభిప్రాయంతో రోజారమణి స్థానంలో శ్రీదేవిని తీసుకున్నారు. నాగేష్ పోసించాల్సిన పాత్రకు కమల్ హాసన్ ఎంపికయ్యారు. ఒక సినిమా షూటింగ్‌లో రజనీకాంత్‌ను చూసి ముచ్చటపడిన భారతీరాజా రౌడీ పాత్రకు ఆయననే ఎంపికచేశారు. ఈ చిత్రంలో నటించినందుకు రజనీకాంత్ తీసుకున్న పారితోషికం కేవలం 3 వేల రూపాయలు మాత్రమే. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీత దర్శకుడు. ఈ చిత్రంలో పాటలు ఎంతటి ఘనవిజయం సాధించాయో అందరికీ తెలిసిందే. 1977 జనవరి 1న విడుదలైన పదినారు వయదినిలే తమిల సినిమా దశ, దిశను మార్చేసింది.

ఇళయరాజా స్వరపరిచిన టైటిల్ సాంగ్ ఇతర భాషలలో కూడా వాడుకున్నారు. 28 రోజులలో చిత్రనిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం మొత్తం బడ్జెట్ రూ.4.75 లక్షలంటే నమ్ముతారా.. తమిళంలో విడుదలై చరిత్ర సృష్టించిన ఈ చిత్రం ఆ తర్వాత తెలుగులో పదహారేళ్ల వయసుగా కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొంది ఇక్కడ కూడా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. హిందీలో కూడా సోల్వా సావన్‌గా పునర్నిర్మాణం చెందింది. ఏ భాషలో నిర్మించినా హీరోలు మారారే తప్ప హీరోయిన్‌గా శ్రీదేవే నటించడం విశేషం.

కొసమెరుపు ఏంటంటే తెలుగులో ఈ చిత్రం తీయాలని కె రాఘవేంద్రరావు అనుకున్నప్పుడు కమల్‌హాసన్ నటించిన పాత్రను చూసి థ్రిల్ అయిపోయిన అందాల నటుడు శోభన్ బాబు ఆ పాత్రలో తానే నటిస్తానని ఆఫర్ ఇచ్చారట. అవసరమైతే పారితోషికం తగ్గించుకుంటానని కూడా ఆయన వాగ్దానం చేశారట. అయితే డీగ్లామరైజ్డ్ పాత్రలో శోభన్ నటిస్తే తెలుగు ప్రేక్షకులు చూడరన్న భయంతో ఆ పాత్రకు చంద్రమోహన్‌ను ఎంపికచేశారని రాఘవేంద్రరావు ఒక ఇంటర్వూలో చెప్పారు. ఇక రజనీకాంత్ పోషించిన పాత్రను తెలుగులో మోహన్‌బాబు నటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News