న్యూఢిల్లీ : ‘చొరబాటు రహితం’ చేయాలనే లక్షంతో జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదంపై పోరును ఉద్ధృతం చేయాలని భద్రత సంస్థలు అన్నిటినీ కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా బుధవారం ఆదేశించారు. జమ్మూ కాశ్మీర్‌లో భద్రత పరిస్థితిపై ఢిల్లీలో రెండు రోజుల్లో రెండు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాలకు అమిత్ షా అధ్యక్షత వహిస్తూ, నరేంద్ర మోడీ ప్రభుత్వం స్థిరంగా, సమన్వయంతో సాగిస్తున్న కృషి కారణంగా ఆ కేంద్రపాలిత ప్రాంతంలో ఉగ్ర వాతావరణం బలహీనపడిందని కూడా చెప్పారు. ‘చొరబాటు రహితం’గా ఆ ప్రాంతాన్ని మార్చాలనే లక్షంతో ఉగ్రవాదంపై పోరును ఉద్ధృతం చేయవలసిందని అన్ని భద్రత సంస్థలను హోమ్ శాఖ మంత్రి ఆదేశించినట్లు ఒక అధికార ప్రకటన వెల్లడించింది. ‘ఉగ్రవాదుల ఉనికిని నిర్మూలించాలన్నది మన లక్షం కావాలి’ అని అమిత్ షా స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ నుంచి ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టడానికి కట్టుబడి ఉందని అమిత్ షా తెలిపారు.
‘మాదకద్రవ్యాల వ్యాపారం ద్వారా ఉగ్రమూకలకు నిధుల సరఫరాను ఎటువంటి పరిస్థితుల్లోను అరికట్టవలసిందే’ అని ఆయన స్పష్టం చేశారు. మంగళ, బుధవారాల్లో ఆర్మీ, పోలీస్, పారా మిలిటరీ దళాలు, ఇతర సంస్థల ఉన్నతాధికారులతో జమ్మూ కాశ్మీర్ భద్రత పరిస్థితిని హోమ్ శాఖ మంత్రి సమీక్షించారు. వరుసగా రెండు రోజుల్లో జమ్మూ కాశ్మీర్‌లో భద్రత పరిస్థితిపై హోమ్ శాఖ మంత్రి ఆవిధంగా కూలంకష చర్చలు జరపడం ఇదే ప్రథమం. ఈ సమావేశాలకు హాజరైనవారిలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, ఇంటలిజెన్స్ బ్యూరో (ఐబి) డైరెక్టర్ తపన్ దేకా, డిజిపి నళిన్ ప్రభాత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఇతర సైనిక, పోలీస్, పౌర ఉన్నతాధికారులు ఉన్నారు. దక్షిణ కాశ్మీర్ కుల్గామ్ జిల్లాలో ఉగ్రవాద దాడి నేపథ్యంలో ఈ సమావేశాలు జరిగాయి. ఆ దాడిలో మాజీ సైనికుడు మంజూర్ అహ్మద్ వగే ప్రాణాలు కోల్పోగా, ఆయన భార్య, మేనకోడలు గాయపడ్డారు.