కర్నాటకలో రెండో దశ లోక్‌సభ ఎన్నికలకు ముందు ‘డర్టీ వార్’ కొనసాగుతోంది. 28 లోక్‌సభ స్థానాలున్న కర్నాటకలో తొలి దశలో 14 స్థానాలకు ఏప్రిల్ 26న ఎన్నికలు జరుగగా, మే 7న చివరి దశలో మిగిలిన 14 స్థానాల ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపేలా ‘డర్టీ వార్’ జరుగుతోంది. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు, ఎన్‌డిఎ కూటమికి మధ్య హోరాహోరీగా పోరు జరుగుతున్న నేపథ్యంలో ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షమైన జెడి(ఎస్) ఎంపి, మాజీ ప్రధాని దేవెగౌడ మనువడు ప్రజ్వల్ రేవణ్ణ , ఆయన తండ్రి మాజీ మంత్రి, ఎంఎల్‌ఎ హెచ్‌డి రేవణ్ణపై దేశమంతా ఉలిక్కిపడేలా సెక్స్ స్కాండల్ బయటపడింది. ప్రత్యేకించి ప్రజ్వల గత కొన్నేళ్ళుగా తన రాజకీయ అధికారం, పలుకుబడి ఉపయోగించి వందలాది సెక్స్ వీడియోలు తీశారని, ఈ రాక్షసంలో వెయ్యి మంది దాకా మహిళలు బాధితులుగా ఉన్నారని దాని తాలూకు అశ్లీల వీడియోలు ప్రజ్వల్ రేవణ్ణ ఎన్నిక రోజునే బయటపడ్డాయి.
ఈ వీడియోలు ఎన్నికల ముందు ఎవరు బయటపెట్టారనే విషయమై ఎన్‌డిఎకు, కాంగ్రెస్‌కు మధ్య పెద్ద ఎత్తున యుద్ధం జరుగుతున్నది. ఈ జుగుప్సాకర వీడియోల వివాదం బిజెపి, జెడి(ఎస్) కూటమి అభ్యర్థుల రెండో దశ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తుందని పరిశీలకులు చెబుతుండగా దీనిపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్, బిజెపిల మధ్య రాజకీయ యుద్ధం సాగుతున్నది. 33 ఏళ్ళ యువకుడైన రేవణ్ణ హాసన్ నియోజకవర్గానికి ఎంపిగా ఉండి తిరిగి ఎన్‌డిఎ కూటమి అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేశారు. రేవణ్ణకు ఓటు వేయాలని ప్రధాని మోడీ నియోజకవర్గంలో ప్రచారం చేశారు. మహిళల జీవితాలతో ఆడుకున్న రేవణ్ణకు ఎలా మద్దతు ఇచ్చారని కాంగ్రెస్ ప్రశ్నిస్తున్నది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ రేవణ్ణపై ఎందుకు చర్య తీసుకోలేదని, ఆయన జర్మనీకి పారిపోయే దాకా ఎందుకు ఉపేక్షించారని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కాంగ్రెస్‌ను ప్రశ్నించారు.
తాము మహిళలకు నిజమైన రక్షకులుగా ఉన్నామని రేవణ్ణపై ఆధారాలుంటే కాంగ్రెస్ ఎలాంటి చర్యలు తీసుకున్నా తమకు అభ్యంతరం లేదని ఆ ప్రభావం తమ పార్టీపై పడకుండా అమిత్ షా సెక్స్ స్కాండల్‌పై ప్రతిస్పందించారు. రేవణ్ణ ఘాతుకాలకు బలైన ఒక మహిళ చేసిన ఫిర్యాదుపై మొత్తం రేవణ్ణ బండారం బయటపడింది. ఎన్నికల ముందు నిజంగా ఇది బిజెపికి , ఆ పార్టీకి మిత్ర పక్షంగా ఉన్న జెడి(ఎస్)కు షాక్‌లాంటి పరిణామమే. దీనిపై కర్నాటకలోని సిద్ధ రామయ్య ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను ఏర్పాటు చేసి సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న వీడియోలు అసలైనవి అవునా, కావా అని వాటిని ఎఫ్‌ఎస్‌ఎల్ పరిశీలనకు పంపారు. మరోవైపు ఆ వీడియోల్లో బాధితులైన మహిళలను గుర్తించి వారి సాక్షాలు తీసుకొనే ప్రయత్నంలో ఎస్‌ఐటి టీం ముందుకు కొనసాగుతున్నది.
అవన్నీ మార్ఫ్‌డ్ వీడియోలు అని వాటితో తనకు సంబంధం లేదని ప్రకటించిన ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీ నుంచి ఎక్స్‌లో స్పందించారు. కాని ప్రజ్వల్ రేవణ్ణ ఈ మహా ‘డర్టీ పిక్చర్’లో అమాయకుడైతే ఎందుకు దేశం విడిచి పారిపోవాలని కాంగ్రెస్ ప్రశ్నిస్తున్నది. పారిపోతుంటే అధికారంలో ఉన్న మీరేం చేస్తున్నారని బిజెపి అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నది. మరోవైపు ఈ మొత్తం సెక్స్ స్కాండల్ బయటపడగానే నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కెఆర్ శివకుమార్ రేవణ్ణను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కాని ఈ ఆరోపణల్లో భాగస్వామిగా ఉన్న ఆయన తండ్రి హెచ్‌డి రేవణ్ణపై జెడి(ఎస్) ఎలాంటి చర్య తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తున్నది. కర్నాటక రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా ఉన్న జెడి(ఎస్)కు రేవణ్ణ ఉదంతం పెద్ద మచ్చగా భావించక తప్పదు.
వెయ్యి మంది మహిళలను లైంగికంగా లోబర్చుకుని వీడియోలను తీసి బ్లాక్ మెయిల్ చేయడమనే విషయం సాధారణం కాదు. విచారణలో నిజమని తేలితే రేవణ్ణ భవిష్యత్తే కాకుండా జెడి(ఎస్)కు కూడా రాజకీయ దెబ్బ పడే పరిస్థితులు ముఖ్యంగా రెండో దశ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులకు ప్రతికూలంగా మారే అవకాశాలున్నాయి. ఈ ‘డర్టీ వార్’ నుంచి బిజెపి తప్పించుకోవాలని అది జెడి(ఎస్), కాంగ్రెస్ రాజకీయ యుద్ధమని ప్రకటిస్తున్నా ఇలాంటి అభ్యర్థికి ప్రధాని మోడీ ప్రచారం చేయడం ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తున్నది. ఇంతగా బరి తెగించిన యువ నేత రేవణ్ణకు ఎలాంటి శిక్ష వేసినా తక్కువేనని మహిళా బాధితులు అంటున్నారు. పశ్చిమబెంగాల్‌లో ఒక గ్రామంలో ఒక నేత అరాచకాలపై దేశ వ్యాప్త ప్రచారం చేసిన బిజెపి తన మిత్రపక్షమైన జెడి(ఎస్) అమానుష కృత్యాలపై ఎలాంటి సమాధానాలు ఇస్తుందో వేచి చూడాలి.