హైదరాబాద్: అయోధ్యలో 2024 జనవరి 22న జరిగే ఆలయ ప్రాణ ప్రతిష్టాపన ఉత్సవానికి ఆహ్వానాన్ని తిరస్కరించిన వారిలో సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ముందున్నారు. అయోధ్య ఉత్సవానికి తాను హాజరుకవాడం లేదని ఆయన డిసెంబర్ 26న ప్రకటించారు. అందుకు కారణాన్ని కూడా ఆయన వివరించారు. మత విశ్వాసాలను రాజకీయం చేయడం వల్లే తాను ఈ కార్యక్రమానికి హాజరుకావడం లేదని ఆయన వెల్లడించారు. ఆలయ ప్రారంభోత్సవాన్ని ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమంగా మార్చివేశారని, ప్రధాని, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, రాజ్యాంగ పదవుల్లో ఉన్న ఇతరులు ఈ కార్యక్రమంలో భౠగస్వాములయ్యారని ఏచూరి చెప్పారు. ఇది పచ్చిగా ప్రజల మత విశ్వాసాన్ని రాజకీయం చేయడమేనేని, ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమని ఆయన అభిప్రాయపడ్డారు.
తృణమూల్ కాంగ్రెస్(టిఎంసి) కూడా సిపిఎం బాటలోనే నడిచే అవకాశం ఉంది. రామాలయ ప్రారంభోత్సవానికి టిఎంసి అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గైర్హాజరయ్యే అవకాశం ఎక్కువగా ఉందని టిఎంసి వర్గాలు తెలిపాయి. పశ్చిమ బెంగాల్‌లో టిఎంసి, సిపిఎం సైద్ధాంతికంగా, రాజకీయంగా ప్రత్యర్థులైనప్పటికీ ఈ రెండు పార్టీలు ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్నాయి. టిఎంసి తన నిర్ణయాన్ని టిఎంసి అధికారికంగా ప్రకటించనప్పటికీ మమతా బెనర్జీ సన్నిహిత వర్గాల కథనం ప్రకారం బిజెపి రాజకీయ వలలో చిక్కకూడదన్నది ఆమె అభిప్రాయంగా కనపడుతోంది. 2024 సార్వత్రిక ఎన్నికలలో ప్రచార అస్త్రంగా రామాలయాన్ని వాడుకోవాలని బిజెపి భావిస్తోందని నమ్మడం వల్లే అయోధ్య కార్యక్రమానికి దూరంగా ఉండాలన్నది టిఎంసి నిశ్చితాభిప్రాయమని వర్గాలు తెలిపాయి.