Wednesday, January 29, 2025

సిరిసిల్లలో కాంగ్రెస్ శ్రేణుల మధ్య భగ్గుమన్న విబేధాలు

- Advertisement -
- Advertisement -

సిరిసిల్ల : సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరిక వ్యవహారంలో ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. సిరిసిల్ల కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న పిసిసి మాజీ అధికార ప్రతినిధి చీటి ఉమేష్ రావు సారథ్యంలో సిరిసిల్ల నియోజకవర్గంలోని ముస్తాబాద్ మండలం ఆవునూరు, గూడెం గ్రామాలకు చెందిన కొందరు ఆదివారం సిరిసిల్ల డిసిసి కార్యాలయంలో కాంగ్రెస్‌లో చేరికలకు రంగం సిద్ధం చేశారు. అయితే ఇప్పటికే మూడుసార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి మరోసారి పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్న సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జీ కెకె మహేందర్ రెడ్డి ఫొటోను ఫ్లెక్సీపై ముద్రించ లేదని, నియోజక వర్గం ఇంచార్జీకి, ముస్తాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షునికి సమాచారం లేకుండా ఎలా పార్టీలో చేర్చుకుంటారని కెకె మహేందర్‌రెడ్డి వర్గం ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఉమేష్ వర్గం గట్టిగా ప్రతిఘటించడంతో తోపులాట జరిగింది.

ఈ దశలో పిసిసి సభ్యుడు సంగీతం శ్రీనివాస్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనాథ్‌లు వాదనకు దిగడంతో ఘర్షణవాతావరణం నెలకొంది. దీంతో పరస్పరం కుర్చీలు కూడా విసురుకున్నారు. ఈ సంఘటనతో స్వల్పంగా ముగ్గురు గాయాల పాలయ్యారు. ఇదంతా నియోజక వర్గ కార్యకర్తల సమావేశం ప్రారంభం కావడానికి ముందే జరిగింది. అయితే నియోజక వర్గ ఇంచార్జీ కెకె మహేందర్ రెడ్డి సమావేశం పూర్తి కాకముందే సమావేశం నుంచి బయటకు వెళ్లడంతో కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలపై తీవ్ర స్థాయిలో చర్చలు సాగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News