Saturday, December 21, 2024

అంతరిస్తున్న ఆర్కిటిక్ హిమఖండాలు

- Advertisement -
- Advertisement -

ఆర్కిటిక్ సముద్ర హిమఖండాలు అంతరించి పోతున్నాయి. పర్యావరణ, వాతావరణ వ్యవస్థలతో ముడిపడి ఉన్న ఆర్కిటిక్ సముద్ర మంచు కవచం వైశాల్యం కనీస పరిధి కన్నా అత్యంత అల్పస్థాయిలో కుదించుకుపోతోందని రెండేళ్ల క్రితమే శాస్త్రవేత్తలు ఆందోళన వెలిబుచ్చారు. 2012లో 4 మిలియన్ చదరపు కిలోమీటర్ల ( 1.5 మిలియన్ చదరపు మైళ్లు ) వరకు మంచు కవచ వైశాల్యం కుదించుకు పోగా, ఇప్పుడు ఆ కనీస పరిధి మరింతగా 8.89 మిలియన్ చదరపు కిలోమీటర్ల ( 1.5 మిలియన్ చదరపు మైళ్లు ) వరకు దిగజారినట్టు పరిశోధకులు చెబుతున్నారు.గత నాలుగు దశాబ్దాలుగా ఈ విధంగా రెండింట మూడొంతుల మంచు విస్తీర్ణాన్ని ఆర్కిటిక్ సముద్రం కోల్పోవడం మున్ముందు వివరీతాలకు హెచ్చరికగా భావిస్తున్నారు.

2007 నుంచి 2020 మధ్యకాలంలో ఆర్కిటిక్ మంచు విస్తీర్ణ పరిధిలో 14 సార్లు కనీస కుదింపులను ఆర్కిటిక్ ఎదుర్కొంది. ఈ విధంగా అనూహ్య మార్పులు చెందుతున్న ఆర్కిటిక్ సహజ స్వరూపానికి ప్రపంచ వాతావరణ వ్యవస్థకు సంబంధం ఎంతో ఉంది. ఆర్కిటిక్, అంటార్కిటిక్ ద్రువాల వద్ద ఏ మాత్రం మంచు కరిగినా ఉష్ణోగ్రతలు అమాంతంగా పెరిగి సముద్ర మట్టాలు కూడా పెరిగిపోతాయి. ఉప్పెనలా విరుచుకుపడతాయి. భూతాపం పెరగడానికి కూడా దోహదం చేస్తాయి.సముద్ర తీర ప్రాంతాలు ఉప్పెనల పాలై జనవాసాలు తుడుచుపెట్టుకుపోతాయి. వీటన్నిటికీ ప్రధాన హేతువైన ఆర్కిటిక్ సముద్ర మంచు పలకలు కరిగిపోడానికి దారి తీసిన పరిస్థితులను పరిశీలిస్తే ఇదో సహజ ప్రాకృతిక ప్రక్రియ.

ఆర్కిటిక్ సముద్ర మంచు దట్టంగా అద్దంలా మెరిసిపోయే కవచం. సూర్యరశ్మిలో రేడియో ధార్మిక శక్తిని 80 నుంచి 90 శాతం వరకు గ్రహించి తిరిగి ఆమేరకు అంతరిక్షం లోకి పంపేలా పరావర్తనం చెందిస్తుంది. కానీ రానురాను ఈ సహజ వ్యవస్థ అనేక కారణాల వల్ల దెబ్బతింది. సముద్రంపై పరుచుకుని ఉండే మంచు ఫలకాలు పలుచనై బలహీనమవుతున్నాయి. 80 శాతం సూర్యధార్మిక శక్తిని పరావర్తనం చెందించడానికి బదులు 90 శాతం వరకు ఆ ధార్మిక ఉష్ణాన్ని ఆర్కిటిక్ సముద్రం తనలోనే ఇముడ్చుకోవడం అనేక వైపరీత్యాలకు దారి తీస్తోంది. ఆర్కిటిక్ సముద్ర మంచు విస్తీర్ణాన్ని శాటిలైట్ల ద్వారా పరిశీలించగా, 1975 నుంచి సరాసరిన కనీసం 40 శాతం వరకు కరిగి పోతున్నాయని బయటపడింది.ఆర్కిటిక్, అంటార్కిటిక్ ఈ రెండూ ప్రపంచ రిఫ్రెజిరేటర్లుగా ప్రసిద్ధి చెందాయి.

భౌగోళిక స్వరూపాల్లో తేడా ఉన్నా మంచు వేడిని ప్రతిబింబించడం లోను ఉష్ణతరంగాలను వ్యాపింప చేయడం లోను, తీవ్ర శీతల వాయువులు ప్రసరింప చేయడం లోనూ రెండూ ఒకటే. ఉత్తరార్ధగోళం సైబీరియా లోని మంచు సముదాయాలు, హిమానీ నదాలు, వీటి ప్రభావానికి లోనవుతున్నాయి. సైబీరియాలో 100 డిగ్రీల ఫారన్ హీట్‌తో వేడి గాలులు వీస్తుండటానికి, కార్చిచ్చులు కమ్ముకుని రాడానికి, గ్రీన్‌ల్యాండ్ మంచు ఖండం కరిగిపోడానికి వీటి ప్రభావమే కారణం. కర్బన ఉద్గారాల వల్ల అంటే బొగ్గుపులుసు వాయువుల వల్ల ఆర్కిటిక్‌కు తీరని ముప్పు కలుగుతోంది. వీటివల్ల 2050 కు ముందే ఆర్కిటిక్ సముద్ర మంచు గడ్డలు నశించి పోయే ప్రమాదం ఉందని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. ఈ విపరీతాలన్నీ తొలగాలంటే భౌగోళిక ఉష్ణతాపం సరాసరిన 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్ కన్నా మించకుండా అదుపు చేయడంలో ప్రపంచ దేశాలు సమష్టి కృషి సాగించినప్పుడే సాధ్యమౌతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News