న్యూఢిల్లీ : జనపథ్ బంగళా నుంచి తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఖాళీ చేయించే విధానం తనకు మనస్తాపం కలిగించిందని, రెండోసారి ఎంపి అయినా తనకు వేరే అధికార భవనం ప్రభుత్వం కేటాయించలేదని లోక్‌జనశక్తి పార్టీ (రామ్ విలాస్ ) నేత చిరాగ్ పాశ్వాన్ గురువారం తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. నగరాభివృద్ది మంత్రిత్వశాఖ బుధవారం నుంచి ఖాళీ చేయిస్తున్న నివాస భవనాన్ని ఆయన సందర్శించి తన తండ్రి దివంగత రామ్‌విలాస్ పాశ్వాన్ ప్రతిమకు నివాళులు అర్పించారు. తరువాత ఆయన విలేఖరులతో మాట్లాడారు. నిబంధనలను, చట్టపరమైన ప్రక్రియను తాను గౌరవిస్తానని, ఈ అధికార భవనంలో శాశ్వతంగా తమ కుటుంబం ఉండేలా అవకాశం కల్పించాలని ఎన్నడూ డిమాండ్ చేయలేదని అన్నారు. తరలో లేదా తరువాత తాము నివాసాన్ని ఖాళీ చేయక తప్పదని, కానీ ఖాళీ చేయించడానికి అనుసరించే విధానం పైనే తన అభ్యంతరమని పేర్కొన్నారు. ఈ మంత్రిత్వ నివాసం 1990లో చిరాగ్ తండ్రి , దళిత నేత , అప్పటి మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్‌కు ప్రభుత్వం కేటాయించింది. రామ్ విలాస్ పాశ్వాన్ తన జీవితాంతం 2020 వరకు అక్కడే ఉన్నారు. అయితే కుటుంబం ఉండడానికి గడువు పొడిగించడంతో తమ కుటుంబంతో ఉంటున్నామని చిరాగ్ చెప్పారు.