అనాలోచిత, విచక్షణారహిత మానవ ప్రమేయంతో అడవుల నరికివేత, అడవులు కాలిపోవడం, కరువు కాటకాలు, ప్రతికూల వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచ పర్యావరణ ప్రాధాన్యత కలిగిన అమెజాన్ వర్షారణ్యాలు అధిక శాతం తరిగిపోవడం, తిరిగి పొందలేని పరిస్థితులకు చేరడం జరుగుతోందని తాజా శాస్త్రీయ అధ్యయనం హెచ్చరిస్తున్నది. ‘జర్నల్ ఆఫ్ నేచర్ క్లైమేట్ ఛేంజ్’ తాజా సంచికలో ముద్రిత పరిశోధన వ్యాసం ద్వారా పలు ప్రమాదకర అంశాలను శాస్త్రవేత్తలు ప్రస్తావించారు. ప్రపంచ జీవ వైవిధ్యానికి 25 శాతం అమెజాన్ అడవులే కారణంగా నిలుస్తున్నాయని గమనించాలి. అమెజాన్ అడవులతోనే వాతావరణ మార్పులు ఆధారపడి ఉంటున్నాయి. అమెజాన్ అడవుల ప్రస్తుత దుస్థితి వల్ల వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ పరిమాణం మారుతుందని, పర్యవసానంగా భూగ్రహం తీవ్రంగా దెబ్బ తింటుందని వివరిస్తున్నారు. కార్బన్ ఉద్గారాలు పెరగడంతో వాతావరణ ఉష్ణోగ్రతలు 1.1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెరిగాయని అంచనా వేశారు. అటవీ విస్తీర్ణం తగ్గడంతో కార్బన్‌ను పీల్చడ్‌ం (కార్బన్ సింక్) తగ్గుతూ, భూతాపానికి దారి తీస్తుంది.
అమెజాన్ అడవులతో పాటు గ్రీన్‌లాండ్/అంటార్కిటిక్ మంచు కొండలు, సైబేరియన్ కార్బన్ డై ఆక్సైడ్/ మీథేన్ శాశ్వత మంచు, దక్షిణ ఆసియా రుతుపవన వర్షాలు, పగడపు దిబ్బల పర్యావరణ వ్యవస్థలు, అట్లాంటిక్ మహాసముద్ర కరెంట్స్ వంటివి ప్రపంచానికే ప్రతికూలంగా మార్చనున్నాయని తెలిపారు. గత కొన్నేళ్లుగా బ్రెజిల్ వాసులు అమెజాన్ అడవులను విచక్షణారహితంగా నరికి వేయడంతో పరిస్థితి మరింత దిగజారింది. అమెజాన్ అడవులలోని 60 శాతం వర్షారణ్యాలు బ్రెజిల్‌కు చెందినవిగా ఉండడంతో నేడు అవి ‘కార్బన్ సింక్ (కార్బన్‌ను పీల్చుకోవడం) లుగా కాకుండా ‘కార్బన్ సోర్స్ (కార్బన్ మూలం)’ లుగా మారాయనే భయంకర విశ్లేషణ వెల్లడైంది. దీని ఫలితంగా గత దశాబ్దకాలంగా వాతావరణంలో గ్రీన్ హౌజ్ వాయువుల శోషణాల కన్న ఉద్గారాలు పెరుగుతున్నాయని తేల్చారు. 1960 నుంచి నేటికీ కార్బన్ ఉద్గారాలు దాదాపు 50 శాతం వరకు పెరిగినా హరిత క్షేత్రాలు, నేలలు 30 శాతం వరకు మాత్రమే శోషణం చేసుకోవడం జరుగుతోంది.
అమెజాన్ అడవులలో అత్యధికంగా 90 బిలియన్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ వాతావరణంలోకి విడుదల కావడం, 100 బిలియన్ టన్నుల కార్బన్ నిలువలను కలిగి ఉండడంతో ప్రపంచ వ్యాప్తంగా అతివేగంగా భూతాపం పెరుగుట గమనిస్తున్నాం. కోల్పోయిన అడవులను తిరిగి నిర్మించని యెడల భూగోళం త్వరలో అగ్నిగుండంగా మారడం ఖాయమని తెలుస్తున్నది. ఉపగ్రహా డేటా విశ్లేషణతో భూమిపై విస్తరించిన ‘బయో మాస్’, ‘హరిత హారం’ పరిమాణాలను గణించి, శాస్త్రీయంగా విశ్లేషించారు. ప్రతికూలతలను గమనించి సత్వరమే జాగ్రత్తలు తీసుకోని యెడల జీవవైవిధ్య వినాశనం ఖాయమని తీర్మానించారు. కార్బన్ డై ఆక్సైడ్ గాఢతను పరిమిత స్థాయికి తగ్గించడం, అవసరమైన జియో -ఇంజినీరింగ్ ప్రయోగాలు చేయడం వెంటనే చేపట్టాలి.
అమెజాన్ అడవులు 16,000 జాతులకు చెందిన 39,000 కోట్ల చెట్లకు ఆవాసంగానే కాకుండా 25 లక్షల రకాల కీటకాలు, 200 రకాల చేపలు, 1,294 రకాల పక్షులు, 427 రకాల క్షీరదాలు, 378 రకాల సరీసృపాలకు ఆలవాలంగా నిలుస్తూ భూగ్రహానికే ఊపిరితిత్తులుగా నిలుస్తూ ప్రాణి కోటికి అమూల్య సేవలను అందిస్తున్నది. సహజ విపత్తులు, మానవ ప్రమేయాలతో అమెజాన్ అడవులు తగ్గిపోవడంతో వాతావరణ ప్రతికూల మార్పుల తలుపులు తెరిచినట్లు కావడం, కార్చిచ్చులతో గాలిలో బ్లాక్ కార్బన్ రేణువులు చేరి సూర్యరశ్మిని అతిగా శోషించుకోవడం, అడవుల నరికివేతతో వర్షపాతం తగ్గడం, ప్రపంచ మీథేన్ వాయువులో 3.5 శాతం అమెజాన్ అడవులు విడుదల చేయడం, గ్రీన్‌హౌజ్ వాయువులపైన నైట్రోజన్ ఆక్సైడ్‌లను వెలువరించడం లాంటి పలు కారణాలతో కార్బన్ ఉద్గారాలు పెరిగి భూతాపం అధికమవుతున్నది. అమెజాన్ అడవుల తరుగుదలతో ప్రపంచ వ్యాప్తంగా నీటి లభ్యత, జీవవైవిధ్యం, వ్యవసాయం, ప్రజారోగ్యం కూడా ప్రత్యక్షంగా ప్రభావితం అవుతున్నాయి. వాతావరణ ప్రతికూల మార్పులకు కారణం అవుతున్న అమెజాన్ అడవులతో పాటు ధరణిపై నెలకొన్న హరిత సంపదను కాపాడుకోవలసిన అవసరం అందరి మీద ఉన్నది.
* డా: బుర్ర మధుసూదన్ రెడ్డి- 9949700037