మనతెలంగాణ/ హైదరాబాద్: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాలు, వరదలతో ఆగమవుతున్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అత్యవసర సాయాన్ని విడుదల చేసింది. తుఫాను, కరువు, భూకంపం, అగ్నిప్రమాదం. వరదలు, సునామీ, వడగళ్ల వాన, కొండ చరియలు విరిగిపడడం, హిమపాతం, మేఘాల పేలుడు, తెగుళ్ల దాడి, మంచు, చలి వంటి విపత్తుల బాధితులకు తక్షణ సాయం అందించడానికి ఎన్టీఆర్‌ఎఫ్ కింద ఈ సాయాన్ని ప్రకటించింది. 22 రాష్ట్రాల్లోని రాష్ట్ర విపత్తు స్పందన నిధి (ఎస్‌డిఆర్‌ఎఫ్) కోసం మొత్తంగా రూ.7532 కోట్లు విడుదల చేసింది.
ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ.493.60 కోట్లు కేటాయించగా.. తెలంగాణకు రూ.188.80కోట్లు కేటాయించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సిఫార్సు మేరకు ఎస్‌డిఆర్ ఎఫ్ నిధులను విడుదల చేసినట్లు ఆర్థికశాఖలోని వ్యయ విభాగం వెల్లడించింది. దేశవ్యాప్తంగా భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకొని వీటిలో నిబంధనలను సడలించినట్లు తెలిపింది. గత ఆర్థిక సంవత్సర నిధులకు సంబంధించిన వినియోగ ధ్రువీకరణపత్రాల కోసం వేచిచూడకుండానే ఈ మొత్తాన్ని విడుదల చేస్తున్నట్లు పేర్కొంది.