Wednesday, January 22, 2025

భ్రూణ హత్యలు వద్దు

- Advertisement -
- Advertisement -

భారతీయ కుటుంబాల్లో బాలికల కంటె బాలురకు ప్రాధాన్యత ఇచ్చే సంస్కృతి రాజ్యమేలుతున్నది. కుటుంబంలోనే బాలుర బాలికల మధ్య వివక్ష చోటుచేసుకున్నది. బాలుర బాలికల మధ్య సామాజిక, ఆర్థిక, అసమానతలు ఉన్నాయి. కుటుంబ సామాజిక, ఆర్థిక స్థితిగతులు కుమారుణ్ణి ఆస్తిగా, కుమార్తెను బాధ్యతగా భావించే సాంప్రదాయం కొనసాగుతున్నది. కుమార్తెను ఆర్థికభారంగా భావించే సామాజిక పరిస్థితి బాలికల పాలిట శాపంగా మారిందని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. పుట్టబోయే బిడ్డ ‘ఆడశిశువు’ అని తెలియగానే గుట్టుచప్పుడు కాకుండా గర్భస్రావానికి పాల్పడుతున్నారు. 1870లో బ్రిటిష్ ప్రభుత్వం ఆడశిశువు హత్య నిరోధక చట్టం తెచ్చినప్పటికీ అమలుకు నోచుకోలేదు. 2020 లో ఐరాస జనాభా నిధి సంస్థ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం తల్లి కడుపులో పెరిగేది ఆడపిల్ల అని తెలిసిన మరుక్షణమే 4.58 కోట్ల మంది బాలికలు హత్యకు గురైనారని తెలిపింది. వాషింగ్టన్ కేంద్రంగా పని చేస్తున్న ప్యూ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం ప్రకారం 2009 -2019 దశాబ్ద కాలంలో 90 లక్షల మంది పిల్లలు మరణించారని తెలిపింది. ఆడపిల్ల అంటే ఆడపిల్లనే అనే సంస్కృతి సమాజంలో నెలకొనడం బాలికల పాలిట శాపంగా పరిణమించింది. తల్లిగర్భంలో పెరుగుతున్నది ఆడశిశువు అని తెలియగానే భ్రూణ హత్యలకు పాల్పడడం సర్వసాధారణమైంది.

కుటుంబం నుండే ఆడపిల్ల పెంపకంలో నిర్లక్ష్యానికి, వివక్షకు గురికావడం విచారకరం. కుటుంబం నుండి మొదలైన వివక్ష, నిర్లక్ష్యం, చిన్నచూపు బాలికల అభివృద్ధికి, వారి సాంస్కృతిక, సాంఘిక, ఆర్థిక, సామాజిక వికాసానికి గొడ్డలిపెట్టుగా పరిణమించింది. సమస్యల విష వలయంలో చిక్కుకుపోయిన ఆడపిల్లల అభివృద్ధి, సంక్షేమం ఆశించిన మేరకు జరగలేదు. ఆడపిల్లలను కించపరచడం సామాజిక రుగ్మత అయింది. పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత, ఆడబిడ్డను పోషించే స్థోమత లేక బడుగు, బలహీనవర్గాలు, గిరిజనులు ఆడ శిశువులను విక్రయిస్తున్నారు. కష్టపడి పెంచి, చదువులు చదివించినప్పటికీ పెళ్ళి సమయంలో వరుడికి కట్నకానుకలు ఇవ్వాల్సి వస్తున్నది. వరకట్న దురాచార రద్దు కోసం చేసిన చట్టాలు అమలు కావడం లేదు. పుట్టబోయే బిడ్డ ఆడబిడ్డ అని తెలిస్తే గర్భస్రావం చేసే వైద్య వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది. పెళ్ళి సమయంలో భారీ కట్నం, కానుకలు ఇవ్వలేమని, భార్యాభర్తల మధ్య గొడవలు, అల్పాదాయాలు, ఆడపిల్లను కనడానికి కుటుంబ సభ్యుల మద్దతు లేకపోవడం, ప్రభుత్వం నుండి తగిన ప్రోత్సాహం లభించకపోవడం వంటి కారణాలు ఆడశిశువుల హత్యలను ఆపలేకపోతున్నాయి.

బాలికలపై, మహిళలపై పాఠశాలల్లో, పని చేసే ప్రదేశాల్లో లైంగిక వేధింపులు, అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. మహిళల అక్రమ రవాణా, మహిళపై దాడులు పెరుగుతున్నాయి. బాలికలకు భద్రత లేదు. ఇలాంటి స్థితి గమనించిన తల్లిదండ్రులు ఆడపిల్లలను గర్భంలోనే తొలగించుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. మొబైల్ స్కానింగ్ కేంద్రాల ద్వారా లింగ నిర్దారణ పరీక్షలు చేసి ఆడశిశువని తెలియగానే భారీ సంఖ్యలో అబార్షన్లు చేయించుకొంటున్నారు. కొడుకు కావాలని కోరుకునే తల్లిదండ్రులను లక్ష్యంగా చేసుకొని స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు భారీగా డబ్బులుగుంజుతున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో ప్రతి 110 మంది బాలురకు కేవలం 100 మంది బాలికలే వున్నారని సర్వేల్లో తేలింది. చట్టాల విఫలం, బాలికలకు విద్య, వైద్యం, ఆహారం చట్టబద్ధమైన హక్కు, ఆరోగ్యసంరక్షణ, సామాజిక, భద్రత బాల్యవివాహాలు నుండి బాలికలకు విముక్తి కల్పించాలని ప్రవేశపెట్టిన అనేక చట్టాలు, పథకాలు ఆశించిన ఫలితాలు సాధించలేదు. సమస్యలే ఆడపిల్లల ఆస్తులుగా, అవమానాలు, నిర్లక్ష్యం, అనారోగ్యం, వేతన వివక్ష వారికి ఆభరణాలుగా పరిణమించాయి.

కేంద్ర ప్రభుత్వం 2015లో చేపట్టిన ‘బేటీ బచావో బేటీ పడావో’ అనే పథకం ఆడపిల్లల అభివృద్ధికి, వారి సాంఘిక, ఆర్థిక వికాసం కోసం ప్రవేశపెట్టిన పథకం రాష్ట్ర ప్రభుత్వాల అమలులో నిర్లక్ష్యం వల్ల ఆశించిన ఫలితాలు రావడంలేదు. కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2015 ఏప్రిల్ నుండి జాతీయ బాలికా దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేషనల్ గర్ల్ డెవలప్‌మెంట్ మిషన్ కార్యక్రమ రూపకల్పన జరిగింది. బాలికల సంరక్షణ కోసం ఆడపిల్లలకు షరతులతో కూడిన ధనలక్ష్మి పథకం ‘కిశోరి శక్తి యోజన సుకన్య’ సమృద్ధి యోజన, పౌష్టికాహార పథకం మొదలగు పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుంది. ఆడపిల్లను మైనస్‌గా భావించి మగ శిశువును ప్లస్‌గా పరిగణించే మానసికస్థితి సమాజంలో నెలకొనడం వల్ల పుట్టుకతోనే ఆడపిల్లలు భ్రూణ హత్యాలకు బలై వివక్షకు గురవుతున్నారు. 1970లో మగ పిల్లవాడు పుట్టే వరకు ఆడపిల్లలను కనేవారు. జనాభా పెరుగుదల సమస్యగా మారడంతో గర్భస్రావం ఒక పరిష్కారంగా ముందుకు వచ్చింది. 1990లో ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ విధానం అందుబాటులోకి రావడం వల్ల భ్రూణ హత్యలు ఎక్కువైనాయి. కేంద్ర ప్రభుత్వం గర్భస్థ శిశు లింగ నిర్ధారణ ప్రక్రియ నిషేధ చట్టం- 1994లో ప్రవేశ పెట్టింది, 2004లో సవరించారు. అయినప్పటికీ గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. భ్రూణ హత్యలకు పాల్పడిన వారికి, వారిని ప్రోత్సహించిన వారికి రూ. 50 వేల జరిమానా, జైలు శిక్ష విధించాలని నిబంధనలు పాటించకపోవడం శోచనీయం.

ప్రభుత్వం బాలికల సమగ్ర వికాసానికి, సంరక్షణకు అవసరమయ్యే విధానాలు అమలు చేయాలి. బాలికల భద్రత, లింగ నిష్పత్తి, విద్య, వైద్యం, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. బాలికలకు బాలురతో పాటు సమాన అవకాశాలు, సమాన హక్కులు, స్వేచ్ఛ కల్పించాలి. బాలికల అభివృద్ధియే లక్ష్యంగా జాతీయ విద్యా విధానంలో పలు పథకాలు ప్రవేశపెట్టడం, బాలికలకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించడం, సమాన విద్యావకాశాల సాధనకు ప్రత్యేక నిధిని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం అభినందనీయమైనచర్య. బాలికల హక్కుల రక్షణ, భద్రత పౌర సమాజం సామాజిక బాధ్యతగా గుర్తించాలి. ఆడ పిల్లలను మగపిల్లలతో పోటీపడేట్లు ప్రోత్సహించాలి. అన్ని రంగాలలో సమాన అవకాశాలు కల్పించాలి. ఆడ పిల్లల అభివృద్ధి దేశాభివృద్ధిగా భావించాలి.

దేశ ప్రగతి పురోగతిలో ఆడపిల్లలు మానవ వనరులుగా ఎదగడానికి ప్రభుత్వం కృషి చేయాలి. బడుగు బలహీన వర్గాల్లో బాలికలకు ఉచిత విద్య, వైద్యం అందించాలి. సమాజంలో మహిళల పట్ల గౌరవం ఆర్థిక స్థాయి, సామాజిక హోదా పెంచాలి. బాలికల సంరక్షణ, ప్రభుత్వం బాల్యవివాహాలు, బాలికల అక్రమ రవాణా, అత్యాచారాలు, లైంగిక వివక్ష మొదలగు సమస్యల నుండి ఆడ పిల్లలను సంరక్షించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ప్రభుత్వం బాలికలకు డిజిటల్ విద్య, టెక్నాలజీ, ఆధునాతన సాంకేతిక ఉన్నత విద్య, ఉపాధి ఉచితంగా అందుబాటులోకి తేవాలి. బాలికలకు వృత్తి నైపుణ్య విద్యను అందించాలి. బాలికల సామాజిక, ఆర్థిక స్థాయి పెంచే పథకాలను అమలు చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ రంగ ఉద్యోగ నియామకాల్లో 50% మహిళలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలి.

ప్రభుత్వం మహిళా బిల్లును ప్రవేశపెట్టి రాజకీయాలలో స్త్రీల వాటా పెంచాలి. ప్రభుత్వం మహిళా సాధికారిత సాధనకు ఉద్యమించాలి. శాస్త్రసాంకేతిక, పారిశ్రామిక, వ్యవసాయ, వ్యాపార, వాణిజ్య, రాజకీయ రంగాలలో మహిళా వికాసానికి ప్రభుత్వం పెద్ద పీట వేయాలి. బాలికల కోసం ప్రత్యేక పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేసి ఇంటర్మీడియేట్ వరకు ఉచిత వొకేషనల్ విద్య అందించాలి. భ్రూణ హత్యలను నిరోధించే చట్టాలు, అందుకు దారి తీసే పరిస్థితులపై పోరాడే చట్టాలను పటిష్టంగా అమలు పరచాలి. వరకట్న నిషేధ చట్టం 1961, లైంగిక నేరాల నుండి ఆడపిల్లలకు రక్షణ కల్పించే చట్టం 2012ను సమర్థవంతంగా అమలు చేయాలి. మగపిల్లల కోసం ఎదురు చూస్తున్న దంపతులను ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడి కార్యకర్తలు గుర్తించి గర్భ స్రావం వల్ల కలిగే అనారోగ్యం, నష్టాలపట్ల కౌన్సెలింగ్ ఇవ్వాలి. ‘ఆడపిల్లలను పుట్టనిద్దాం, బతుకనిద్దాం, చదువనిద్దాం, ఎదుగనిద్దాం’ అన్న నినాదం విధానమైనప్పుడే బాలికల సంక్షేమం, అభివృద్ధి, భద్రత జరుగుతుంది. అమ్మాయి లేనిదే అవని లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదు, అందువల్ల ఆడపిల్లలను రక్షించుదాం, అమ్మాయిలను ఆదరిద్దాం, బాలికల భవితకు బంగారు బాటలువేద్దాం.

నేదునూరి కనకయ్య
9440245771

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News