Wednesday, January 22, 2025

దక్షిణాదిపై వివక్ష ఎందుకు?

- Advertisement -
- Advertisement -

భారత దేశం భిన్నత్వంలో ఏకత్వం గల దేశం. భిన్న భాషలు, సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నా.. మనదంతా ఒకే దేశం. కానీ దేశాన్ని ఏలుతున్న పాలకులు భిన్నత్వాన్ని అణచివేస్తూ, ఏకత్వానికి ముప్పు తలపెడుతున్నారు. ప్రాంతం, కులం, భాష, రాష్ట్రం ప్రాతిపదికన పోలరైజేషన్ చేస్తూ.. ఎన్నికల్లో లబ్ధి పొందుతున్నారు. రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తిని మారుస్తూ.. వారికి నచ్చిన రాష్ట్రాలను అభివృద్ధి చేస్తూ.. నచ్చని వాటికి మొండి చెయ్యి చూపుతున్నారు. 2014లో కేంద్రంలో మోడీ నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం.. దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపుతున్నది.

ఇటీవల తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో కొనసాగుతున్న జనపనార ప్రాంతీయ బోర్డులను ఎత్తేసింది. జ్యూట్ అవసరాలను, జనపనార ఉత్పత్తులు, పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఎంతో దోహదపడుతున్న ప్రాంతీయ కార్యాలయాలను ఎత్తేసి ఉత్తరాదికి తరలించడం ఎంత వరకు సబబు? దక్షిణాది రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున పన్నులు వసూలు చేసుకొని తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం.. దక్షిణాదిలో అధికారం కోసం ప్రయత్నం చేస్తున్నది కాషాయ ప్రభుత్వం.. అభివృద్ధి ప్రాజెక్టులు, ప్రత్యేక నిధులు మాత్రం ఉత్తరాది రాష్ట్రాలకు ఇస్తూ.. దక్షిణాది రాష్ట్రాలపై సవతి తల్లి ప్రేమ చూపుతున్నది.

దక్షిణాది రాష్ట్రాలు వాటి మౌలిక అభివృద్ధికి కావాల్సిన నిధులను అప్పు తెచ్చుకుంటుంటే, ఉత్తరాది రాష్ట్రాలు కేంద్రం నుంచి గ్రాంట్లు పొందుతున్నాయి. చేసిన అప్పులను తిరిగి తీర్చాల్సిందే. అదే కేంద్ర గ్రాంటులైతే తిరిగి చెల్లించనక్కర్లేదు. నిజానికి దక్షిణాది రాష్ట్రాలు చేయగల అప్పుల మీద కేంద్రం పరిమితి విధించడంతో ఆ వసతి కూడా లేకుండా పోతున్నది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు కోరిన ఏ ప్రాజెక్టునూ ఎన్‌డిఎ ప్రభుత్వం మనస్ఫూర్తిగా మంజూరు చేసిన దాఖలాలు లేవు. మొన్నటి అక్టోబర్ నెలలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సిఐ) భారీ ఖర్చుతో ఆయా రాష్ట్రాల్లో 12 గోదాములు నిర్మించనున్నట్లు ప్రకటించింది. ఆ12 గోదాముల్లో ఒక్కటీ దక్షిణాది రాష్ట్రాలవి లేవు. తొలి విడతలో ఎంపిక చేసిన 9 రాష్ట్రాలూ ఉత్తరాదివే. అందులోనూ 6 బిజెపి పాలిత రాష్ట్రాలే కావడం గమనార్హం.

తెలంగాణ ఇచ్చిందేమీ లేదు

రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణకు ఇచ్చిన ఏ ఒక్క హామీని బిజెపి ప్రభుత్వం నెరవేర్చడం లేదు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు కర్మాగారం, పసుపు బోర్డు ఏర్పాటు, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు, వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు, తెలంగాణకు ఐటిఐఆర్ వంటి వాటి కోసం సిఎం కెసిఆర్ ఎన్నిసార్లు కేంద్రాన్ని కోరినా ఎలాంటి ప్రయోజనం ఉండటం లేదు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే తెలంగాణ బిడ్డలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని బిఆర్‌ఎస్ ఎంపిలు పార్లమెంట్లో అనేక సార్లు ప్రశ్నించినా.. కేంద్రం సరైన సమాధానం ఇవ్వలేదు. దాన్ని మహారాష్ట్రలోని లాతూర్‌కు తరలించింది. పసుపు బోర్డు హామీ ఉత్తదే అయింది. హైదరాబాద్‌లో ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించి, దాన్ని గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు మార్చారు. రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా 13వ షెడ్యూల్లో ఇరు రాష్ట్రాల్లో విద్యాభివృద్ధికి గిరిజన యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలని కేంద్రం చట్టం చేసినా, దానిపై ఇంకా నాన్చుడు ధోరణే కొనసాగిస్తున్నది.

ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించినప్పటికీ కేంద్రం పట్టించుకోకుండా పక్షపాత వైఖరి అవలంబిస్తున్నది. తెలంగాణలో ఓ ప్రాజెక్టుకు జాతీయ హోదా, మామునూర్‌కు ఎయిర్‌పోర్టు లాంటి హామీలనూ గాలికొదిలింది. ఇప్పుడు తెలంగాణలో ఉన్న జనపనార ప్రాంతీయ కార్యాలయాన్ని ఎత్తేసింది. తెలంగాణలో వరి ధాన్యం భారీగా దిగుబడి పెరిగినందున ధాన్యం సంచులు పెద్ద ఎత్తున అవసరం అవుతున్నాయి. వీటన్నంటిని కోల్‌కతా నుంచి తెప్పించుకోవాల్సి వస్తున్నది. జనపనార మిల్లులను తెలంగాణలో స్థాపించేందుకు చర్యలు తీసుకోవాలని సిఎం కెసిఆర్ ఆదేశాలతో మంత్రి కెటిఆర్ ఐదు ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఆయా సంస్థలతో మాట్లాడారు. వాటికి ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు, రాయితీలను ప్రకటించారు. ఇదంతా ఒకవైపు జరుగుతుంటే.. మరో వైపు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఏకంగా ప్రాంతీయ కార్యాలయాన్నే మూసివేసి వివక్షను చాటుకున్నది.

ఆంధ్రాకూ అరకొర నిధులే..

నవ్యాంధ్రకు విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చడం లేదు. ఆంధ్రాకు ప్రత్యేక హోదా, విశాఖ రైల్వేజోన్, రాజధానికి నిధులు ఇలా అనేక హామీలు ఇచ్చినా, ఏ ఒక్కదానికీ అతీగతీ లేదు. కొత్త రాష్ట్రం, పైగా రాజధాని నిర్మాణం జరగాల్సిన ప్రాంతం కాబట్టి గ్రాంట్ల కేటాయింపులో కేంద్రం కొంత మానవీయంగా ఆలోచించాల్సి ఉన్నా.. వివక్షనే కొనసాగిస్తున్నది. ఉదాహరణకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)ని తీసుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారులను అభివృద్ధి చేయాలంటే, అక్కడ పెట్టే ఖర్చుకు 15 శాతం రాబడి రావాలంటున్న ఎన్‌హెచ్‌ఎఐ, అదే గుజరాత్‌లోని సోమనాథ్ చుట్టూ అభివృద్ధి చేస్తున్న జాతీయ రహదారికి మాత్రం అలాంటి షరతులేమీ పెట్టలేదు.

ప్రత్యేక హోదా కోసం, మరిన్ని గ్రాంట్ల కోసం ఆంధ్రప్రదేశ్ చేస్తున్న డిమాండును పెడచెవిన పెడుతోంది. ఉత్తరాంధ్రలో 3, రాయలసీమలోని 4 జిల్లాలకు విభజన చట్టం ప్రకారం ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ఇవ్వాల్సి ఉంది. ఇది బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ మార్గదర్శకాల ప్రకారం ఉంటుందని అప్పట్లో ప్రధాని పార్లమెంట్లో హామీ ఇచ్చారు. కానీ ఆ మేరకు నిధులు ఇవ్వకుండా కోత పెట్టింది. రాయలసీమ కరువు నివారణ పథకానికి, ఉత్తరాంధ్ర సులజ స్రవంతి పథకానికి నిధులు ఇవ్వాల్సి ఉన్నా, రాలేదు. విశాఖ సభా వేదికగా ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రధాని ముందు ఎపికి ప్రత్యేక హోదా, పోలవరం, విభజన హామీలు, స్టీల్ ప్లాంట్‌ల విజ్ఞప్తులను గుర్తు చేసినా, పెద్దగా స్పందన లేదు.

మిగతా రాష్ట్రాల్లోనూ ఇదే తీరు..

దక్షిణాదిలో బిజెపి అధికారంలో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం కర్నాటక. అధికార ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నది. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్నా, రాష్ట్రానికి కేంద్రం నుంచి పెద్దగా నిధులు వచ్చింది లేదని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు అనేక సార్లు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. కన్నడ క్లాసికల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ స్టడీస్‌కు స్వయం ప్రతిపత్తి హోదా కల్పించడంలో కేంద్రంలో జాప్యం చేస్తున్నది. అదీగాక కన్నడనాట నిరసనల తర్వాతనే 3 వేల ఏళ్ల చరిత్ర కలిగిన కన్నడ భాషకు కేంద్ర ప్రభుత్వం శాస్త్రీయ హోదా కల్పించింది. అయినా భాషాభివృద్ధి కోసం కేంద్రం ఇస్తున్న నిధులు మాత్రం అరకొరనే ఉంటున్నాయి. తీర ప్రాంత రాష్ట్రాల్లోని ముఖ్య నగరాలను కలుపుతూ హైస్పీడ్ రైలు కారిడార్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తమిళనాడులో ఎప్పటి నుంచో ఉన్నది.

దీనిపై ఆ రాష్ట్ర సిఎం స్టాలిన్ అనేక సార్లు ప్రధాని మోడీని అడిగారు కూడా. అయినా కేంద్రం స్పందించలేదు. పైగా ఇప్పుడు తాజాగా చెన్నైలో ఉన్న జనపనార ప్రాంతీయ కేంద్రాన్ని బిజెపి ప్రభుత్వం ఎత్తేసింది. దేశ ఆర్థిక రంగానికి ఊతమిచ్చేలా ఉత్పాదకతకు దోహదపడే రీతిలో రాష్ట్రాల్లో వ్యయం జరిగేలా చూడాలని కేరళ సిఎం పినరయి విజయన్ ఆ మధ్య దక్షిణాది రాష్ట్రాల సిఎంలతో భేటీ అయిన అమిత్ షా తో అన్నారు. అదీ ప్రతిపాదన స్థాయిలోనే నిలిచింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశం కూడా ఆయా రాష్ట్రాల సమస్యలను పరిష్కరించలేకపోయింది. కావేరీ జలాల పంపకం, ఆయా రాష్ట్రాల సరిహద్దు వివాదాలు, తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలను ఈ సమావేశం ఎటూ తేల్చలేకపోయింది. ఇదీగాక కేంద్ర మంత్రివర్గంలో దక్షిణాది రాష్ట్రాలకు సరైన ప్రాతినిధ్యమే ఉండటం లేదు. రైల్వే ప్రాజెక్టుల విషయంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న సౌత్ సెంట్రల్ రైల్వే, సౌతర్న్ రైల్వే జోన్లు మెరుగైన ఆదాయం ఇస్తుంటే..కేంద్రం వీటి అభివృద్ధికి కేటాయిస్తున్న నిధులు, ప్రాజెక్టులు నామమాత్రంగానే ఉంటున్నాయి.

బచ్చు శ్రీనివాస్
93483 11117

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News