రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడా, టూరిజంల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం, శాసనసభ్యులు అల వెంకటేశ్వర రెడ్డి, దాసరి మనోహర్ రెడ్డి, కోరుకంటి చందర్‌లతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మంగళవారం హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో వారి నియోజకవర్గంలో నూతనంగా నిర్మించ తలపెట్టిన మినీ క్రీడా మైదానాల నిర్మాణ అనుమతులపై మంత్రితో చర్చించారు. దీంతోపాటు వారి నియోజకవర్గ స్థాయిలో ఉన్న టూరిజం అభివృద్ధిపై సమగ్రంగా చర్చించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, శాసనసభ్యులు చేసిన విజ్ఞప్తిపై వారి నియోజకవర్గాల్లో మినీ స్టేడియంల ఏర్పాట్లపై క్రీడా శాఖ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశాలు జారీచేశారు. అంతేకాకుండా టూరిజం అభివృద్ధిపై అధికారులను వెంటనే ఆయా నియోజకవర్గాల్లో పర్యటించి అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.