Thursday, November 21, 2024

ఈ – శ్రమ్‌పై తర్జన భర్జన..

- Advertisement -
- Advertisement -

కోటి మంది అనుకున్నా అరకోటి కూడ చేరని వైనం
డిసెంబర్ నాటికి ఆ లక్ష్యం నెరవేరేనా?
తగినంత ప్రచారం లేదంటున్న కార్మికులు..కర్షకులు..
అందుకే ఆ సంఖ్య తగ్గిందా…!!

మన తెలంగాణ / హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఉన్న అసంఘటిత రంగ కార్మికులకు ప్రత్యేక డేటాబేస్ ఏర్పాటు చేసేందుకు ‘ఈ – శ్రమ్’ వెబ్ పోర్టల్‌ను ప్రారంభించగా అందులో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 43 లక్షల 50 వేల మంది కార్మికులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ పోర్టల్ ఏర్పాటు సమయంలో ప్రతి రాష్ట్రం కోటి మందిని చేర్పించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. తద్వారా దేశ వ్యాప్తంగా కనీసం 38 కోట్ల మంది కార్మికులను ఇందులో నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్రం ప్రకటించింది.

ఈ ప్రక్రియ పూర్తిగా ఉచితంగా జరుగుతుందని, ప్రతి కార్మికుడు ఈ వెబ్ పోర్టల్‌లో తన పేరు నమోదు చేసుకోవాలని కోరింది. ఈ క్రమంలో తెలంగాణలోనూ కోటి మంది కార్మికులను ఇందులో నమోదు చేయించాలని కార్మిక ఉపాధి కల్పన శాఖ భావించింది. పోర్టల్ ప్రారంభం అయిన రోజు నుండి పేర్లు నమోదు చేస్తున్నప్పటికీ ఈ సంఖ్య ఇప్పటి వరకు 43 లక్షల 50 వేల వరకు మాత్రమే నమోదు అయ్యింది. ఈ ఏడాది చివరి నాటికే కోటి మందిని చేర్పిస్తామని ప్రకటించిన కార్మిక శాఖ వర్గాలు ఆ దిశగా తగినంత ప్రచారం చేయడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఇటు కార్మికులు ..కర్షకులు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా స్పందిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ – శ్రమ్ పోర్టల్ గురించి తగినంత ప్రచారం కూడా లేదని , అసంఘటిత రంగ కార్మికులు అంటే ఎవరు? ఈ – శ్రమ్ పోర్టల్‌లో పేరు నమోదుకు ఎవరెవరు అర్హులు? ఈ శ్రమ్‌లో చేరిన ప్రతి కార్మికుడికి చేకూరే ప్రయోజనాలు ఏమిటీ? అసలు ఎక్కడ ఎలా నమోదు చేసుకోవాలి? వంటి సమాచారం కార్మికులకు చేరడం లేదంటున్నారు.

ఏవో కొన్ని కరపత్రాలు ముద్రించారే తప్ప వాటిని కార్మికులకు కూడా ఇవ్వడం లేదని చెబుతున్నారు. ఈ కారణంగానే కార్మికులు ఈ – శ్రమ్ వైపు వెల్లడం లేక పోతున్నారని చెబుతున్నారు. ఈ వర్గాలు చెబుతున్నట్లుగానే.. ఈ – శ్రమ్ గురించి తగినంత ప్రచారం చేయాల్సిన బాధ్యత కూడా అధికారులపైనే ఉంటుంది కూడా. ముఖ్యంగా ఈ-శ్రమ్ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకున్న వారికి వచ్చే కార్డు ద్వారా కలిగే లబ్దిని వారికి వివరించాల్సి ఉంటుంది.

12 అంకెల నంబర్ కీలకం..
కాగా ఇందులో చేరిన ప్రతి అసంఘటిత రంగ కార్మికుడికి 12 అంకెలు గల ప్రత్యేక గుర్తింపు కార్డు యూనివర్షల్ ఐడెంటిఫికేషన్ నెంబర్‌ను ఇస్తారు. ఈ కార్డు ఉంటే ప్రభుత్వం అందించే అన్ని రకాల సామాజిక భద్రత పథకాలు, వివిధ సంక్షమ పథకాలు విధిగా వర్తించనున్నాయి. ఈ శ్రమ్ పోర్టల్‌ను రెండేళ్ల క్రితం 2021 ఆగస్టు నెల 26న ప్రారంభం కాగా అందులో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదు చేసుకున్న కార్మికులకు 29 కోట్ల 13 లక్షల 2 వేల 410 ఈ – శ్రమ్ కార్డులను పంపిణీ చేశారు. ఎవరికి ఏ సమాచారం కావాలన్నా ఈ శ్రమ్ వెబ్ పోర్టల్‌లోనూ అందుబాటులో ఉంచుతున్నట్లు అధికారులు చెబుతున్నా తగినంత సమాచారం కార్మికుల దరికి చేరడం లేదని కార్మికులు పేర్కొంటుండడం గమనార్హం.

అసంఘటిత రంగ కార్మికులు ఎవరంటే..భవన , ఇతర నిర్మాణ రంగాల్లో పని చేస్తున్న తాపీ , తవ్వకం ,రాళ్లు కొట్టే పని, సెంట్రింగ్, కార్పెంటింగ్, టైల్స్ పని, ఎలక్ట్రిషియన్, వెల్డింగ్, ఇటుక , సున్నం వర్క్ అన్నింటికీ మించి వ్యవసాయ, అనుబంధ విభాగాల్లో ఉపాధి పొందే చిన్న సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, ఉద్యానాలు, నర్సరీలు, పాడి పరిశ్రమలపై ఆధారపడి బతికే వారు, మత్సకారులు ఇలా..వివిధ వర్గాలు అంతా కార్మికుల కిందికే రానున్నారు. అయితే తప్పని సరిగా అసంఘటిత రంగ కార్మికులై 16 నుంచి 59 సంవత్సరాలలోపు వయసున్న వారు ఇందులో చేరాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆదాయపన్ను చెల్లించని వారు,ఈపిఎప్, ఈఎస్‌ఐ వంటి సదుపాయాల పరిధిలోనికి రాని వారు మాత్రమే దీనికి అర్హులుగా కార్మిక శాఖ అధికారులు తెలియజేస్తున్నారు.

ఈ – శ్రమ్‌లో చేరితే ప్రయోజనాలు ఎన్నో..
ఈ – శ్రమ్‌లో చేరిన ప్రతి కార్మికుడికి 12 అంకెల ప్రత్యేక గుర్తింపు నంబరు ( యూనివర్సల్ అకౌంట్ నంబర్ – యూఏఎన్)ను ఇస్తారు. ఈ కార్డుంటేనే ప్రభుత్వ సామాజిక భద్రత, సంక్షేమ పథకాలు వర్తించనున్నాయి. ఇప్పటి వరకు కొన్ని పథకాలు కుటుంబంలో ఒక్కరికే వర్తిస్తుంటాయి. దీని వల్ల ఆ కుటుంబంలో ఒకరిద్దరు అసంఘటిత రంగ కార్మికులు ఉంటే నష్టపోతున్నారు. అయితే ఇప్పడు ఆ సమస్య ఉండదని కార్మిక శాఖ చెబుతోంది. ఈ – శ్రమ్ కార్డున్న అందరికీ ప్రయోజనాలు దక్కుతాయని అధికారులు అంటున్నారు. మరీ ముఖ్యంగా నమోదైన ప్రతి కార్మికుడికి ఒక ఏడాది పాటు ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన కింద రూ. రెండు లక్షల ప్రమాద, మరణ, అంగవైకల్య బీమా ఉచితంగా వర్తిస్తుందని చెబుతున్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News