అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడీవేడి చర్చ
గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను దశల వారీగా తీరుస్తున్నాం : మంత్రి సీతక్క
నాడు కాంగ్రెస్ కూడా బకాయి పెట్టింది : మాజీ మంత్రి హరీష్‌రావు
టీ ప్రైడ్ కింద 45 శాతం రాయితీ : ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
పీపీపీ విధానంలో రోడ్లను వేయడం లేదు : హరీశ్ రావుకు కోమటిరెడ్డి సమాధానం
కోమటిరెడ్డి సమాధానాన్ని నిరసిస్తూ సభ నుంచి బీఆర్‌ఎస్ వాకౌట్
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శనివారం ఉదయం సభలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై వాడీవేడి చర్చ జరిగింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సీతక్క సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.8,029 కోట్లకుపైగా నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు రూ.5,520.60 కోట్ల బకాయి ఉందని స్పష్టం చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.4,341 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెట్టిందన్నారు. దీంతో విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని తెలిపారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను దశల వారీగా తీరుస్తున్నామని స్పష్టం చేశారు.
కాలేజీల యాజమాన్యం పిల్లల సర్టిఫికెట్స్ ఇవ్వడం ఆపవద్దని కోరారు. యాజమాన్యాలకు భరోసా కల్పిస్తామని, ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క యాజమాన్యాలతో మాట్లాడారని చెప్పారు. ప్రస్తుతం పంట రుణమాఫీ పథకం లాంటి వాటికి నిధులు విడుదల చేయడంతో మిగతా శాఖలపై కొద్దిగా భారం పడుతోందని చెప్పారు. దాదాపు రూ.1,200 కోట్లకు టోకెన్స్ కూడా రైజ్ చేసినట్లు తెలిపారు. బిల్స్ అనేవి కంటిన్యూ ప్రాసెస్ అని, దశల వారీగా బకాయిలు చెల్లిస్తామని స్పష్టం చేశారు. బకాయిలు చెల్లిస్తామని కళాశాల యాజమాన్యాలకు హామీ ఇచ్చామని, విద్యార్థుల ధృవపత్రాలు ఆపవద్దని కళాశాలలను కోరామన్నారు. రుణమాఫీకే రూ.21 వేలు చెల్లించడం వల్ల మిగతా శాఖలపై భారం పడిందని, ఇప్పటికే రెండు విడతల్లో బకాయిలు చెల్లించామని, మిగతావి త్వరలో చెల్లిస్తామని మంత్రి సీతక్క సభలో సమాధానమిచ్చారు.
నాడు కాంగ్రెస్ కూడా బకాయి పెట్టింది : మాజీ మంత్రి హరీష్‌రావు
చర్చలో భాగంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన సమయంలోనూ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2వేల కోట్లు బకాయిలు పెట్టి పోయిందని కౌంటర్ ఇచ్చారు. వాటిని అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో తాము చెల్లించామని గుర్తుచేశారు. పెద్ద నోట్ల రద్దు, కరోనా వంటి వాటి వల్ల ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొన్నామని చెప్పారు. అయినప్పటికీ ప్రతి సంవత్సరం రూ.2వేల కోట్లకు తగ్గకుండా తొమ్మిదిన్నర ఏళ్లలో రూ.20వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేసినట్లు వివరించారు. గతంలో బకాయిలు పెట్టినట్లు బీఆర్‌ఎస్‌పై బురదజల్లుతున్నారని 2014లో బీఆర్‌ఎస్ వచ్చినప్పుడు రూ.2 వేల కోట్లు బకాయిలు పెట్టారని హరీష్‌రావు ఆరోపించారు.
రూ.2 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించామని, బీఆర్‌ఎస్ హయాంలో ఫీజు రీఎంబర్స్‌మెంట్ ఇవ్వలేదనేది సత్యదూరం అన్నారు. ఆర్థిక మాంద్యం, కరోనా వంటి దుర్భర పరిస్థితులను ఎదుర్కొన్నామని, బీఆర్‌ఎస్ హయాంలో రూ.20 వేల కోట్ల ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించామని స్పష్టం చేశారు. ప్రస్తుతం డిగ్రీ, జూనియర్ కళాశాలలు సగానికి సగం మూతపడ్డాయని, రెండేళ్లుగా బిల్లులు మంజూరు కాక కళాశాలలు మూతపడే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు ధృవపత్రాలు రాక విద్యా సంవత్సరం కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.
విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల వల్ల లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. వారికి సర్టిఫికెట్లు ఇవ్వకుండా కాలేజీల చుట్టూ తిప్పుకుంటున్నారని తెలిపారు. బకాయిల వల్ల కొన్ని చిన్న కాలేజీలు నడపడం కష్టంగా ఉందని, పలు కాలేజీలు మూతబడ్డాయని చెప్పారు. వెంటనే బకాయిలు క్లియర్ చేయాలని కోరారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలలో జాప్యంతో విద్యార్థులకు నష్టం జరుగుతోందని, విద్యార్థులు, తల్లిదండ్రులు మానసికంగా ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రభుత్వ ఆదేశాలను కళాశాలలు పాటించలేదని, రూ.వేల కోట్ల బకాయిలతో ప్రైవేట్ కళాశాలలు నడపడం కష్టమే అన్నారు. రూ.7 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఉన్నాయని, వాయిదాల పద్ధతిలో ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలు చెల్లించాలని నిర్ణయించారని, వాయిదాల పద్ధతిలో కూడా చెల్లించడం లేదన్నారు. ఫీజు చెల్లించనందున కళాశాలలు ధృవపత్రాలు ఇవ్వడం లేదని కూనంనేని సభలో ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రీన్ చానల్ ఏర్పాటు చేయాలి : బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు అద్దె, కరెంట్ బిల్లులు కట్టలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. గ్రీన్ చానల్ ఏర్పాటు చేసి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు క్లియర్ చేయాలని కోరారు.
ఈ ఏడాదే మొత్తం క్లియర్ చేయాలి : బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు
బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు మాట్లాడుతూ ఈ ఏడాదే మొత్తం బకాయిలు క్లియర్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అరకొర నిధులు కేటాయించడం సరికాదని, బకాయిలు ఇంకా పేరుకుపోయే ప్రమాదం ఉందని సూచించారు.
టీ ప్రైడ్ కింద 45 శాతం రాయితీ : ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ.10 లక్షల లోపు మూడో వంతు రాయితీ ఇస్తున్నట్లు ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. పారిశ్రామిక వినియోగం కోసం భూ మార్పిడి చార్జీలు రూ.10 లక్షలకు పరిమితం చేశామన్నారు. యూనిట్‌కు రూ.1.50 చొప్పున నిర్ణీత విద్యుత్ రీయింబర్స్‌మెంట్ ఉంటుందన్నారు. రూ.కోటి పరిమితితో ఐఐడీఎఫ్ నుంచి మౌలిక సౌకర్యాల కల్పన ఉంటుందని స్పష్టం చేశారు. టీ ప్రైడ్ కింద రూ.75 లక్షలలోపు 45 శాతం రాయితీ ఉంటుందని, రూ.కోటి పరిమితితో ఐఐడీఎఫ్ నుంచి మౌలిక సౌకర్యాల కల్పిస్తున్నట్లు చెప్పారు. ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా లక్ష మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నామని, రూ.1.11 లక్షల కోట్ల పెట్టుబడితో 5626 యూనిట్లకు అనుమతులు ఇస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు సభలో ప్రకటించారు.
ప్రైవేట్ పెట్టుబడులు ఎవరు పెడతారు : బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి
బడ్జెట్‌లో హ్యామ్ రోడ్ల విధానాన్ని ప్రస్తావించారని బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో చేపట్టిన రోడ్ల పనులు నిలిచిపోయాయని, బిల్లులు రావడం లేదని గుత్తేదారులు చెబుతున్నారన్నారు. హ్యామ్ విధానంలో 17 వేల కిలోమీటర్లు వేస్తామన్నారని, రూ.28 వేల కోట్లలో 60 శాతం కాంట్రాక్టర్లు వ్యయం చేస్తామన్నారని తెలిపారు. కాంట్రాక్టర్లు చేసే వ్యయం డబ్బు ఎవరు ఇస్తారు?, ప్రైవేట్ పెట్టుబడులు అంటే ఎవరు పెడతారని ప్రశాంత్‌రెడ్డి సభలో ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆర్ అండ్ బీ రోడ్ల పురోగతి మందగించిందని, గతంలో మొదలు పెట్టిన పనులు కూడా ఆగిపోయాయన్నారు. బిల్లులు రాక ఇబ్బందిగా ఉన్నట్లు గుత్తేదారులు చెబుతున్నారని, కొత్త రహదారులు ఏమైనా మంజూరు చేసినట్లు కూడా లేదన్నారు.
రూ.28 వేల కోట్లతో 17 వేల కి.మీ మేర హ్యామ్ విధానంలో రోడ్లని చెప్పారని, 17 వేల కి.మీ మేర ఆర్ అండ్ బీ రోడ్లా లేదా పంచాయతీరాజ్ రోడ్లు కూడా ఉంటాయా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆర్ అండ్ బీ పరిధి రహదారులు మొత్తం 27 వేల కిలోమీటర్లు కాగా బీఆర్‌ఎస్ హయాంలో 8672 కి.మీ మేర రెండు వరుసల రోడ్లు వేశామని చెప్పారు. 50 ఏళ్లలో చేసినవి కలుపుకుని రాష్ట్రంలో 14,532 కి.మీ మేర 2 వరుసల రోడ్లున్నాయని, బీఆర్‌ఎస్ హయాంలో 485 కి.మీ మేర 4 వరుసల రోడ్లు వేశామని తెలిపారు. పదేళ్లలో రహదారులకు రూ.22 వేల కోట్లు ఖర్చు చేశామని, 17 వేల కి.మీ మేర రోడ్లలో 40 శాతం ప్రభుత్వం..మిగతాది పీపీపీ విధానమన్నారని, రాష్ట్రంలో ప్రైవేటు పెట్టుబడులతో చేపట్టే రహదారులపై స్పష్టత ఇవ్వాలని కోరారు.
పని చేసినా మీలా ఎక్కువ మాట్లాడం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
రాష్ట్రంలో మొత్తం 29 వేల కిలోమీటర్ల మేర రహదారులున్నాయని, మన రహదారులే మన సంపదను పెంచుతాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. పీపీపీ విధానం వేరు..హైబ్రిడ్ యాన్యుటీ విధానం వేరని తెలిపారు. గత పదేళ్లలో రోడ్డపై రూ.3,945 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని చెప్పారు. గతంలో రోడ్ల కోసం తెచ్చిన రుణాల బకాయిలు చెల్లిస్తున్నామని మంత్రి అన్నారు. తాము పని ఎక్కువ చేస్తాం..కానీ మీలా ఎక్కువ మాట్లాడలేమని బీఆర్‌ఎస్ సభ్యులపై సెటైర్లు వేశారు. తెలంగాణ రాష్ట్రంలో తమ ప్రభుత్వం పీపీపీ విధానంలో రోడ్లు నిర్మించడం లేదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో రహదారుల నిర్మాణం చేపడుతున్నామని ఆయన తెలిపారు.
పీపీపీ, హైబ్రిడ్ యాన్యుటీ విధానాలు రెండూ వేర్వేరని మంత్రి పేర్కొన్నారు. శాసనసభలో మాజీ మంత్రి హరీశ్ రావు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ‘మన సంపద మన రహదారులను నిర్మించదు, మన రోడ్లు మన సంపదను పెంచుతాయి‘ అని జాన్ ఎఫ్ కెనడీ చెప్పిన మాటలను ఆయన గుర్తు చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో రూ. 112 కోట్లతో కేవలం 6,668 కిలోమీటర్ల రోడ్లను మాత్రమే మరమ్మతులు చేసిందని ఆరోపించారు. ఇది ప్రభుత్వ రికార్డు అని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా, రూ. 4,167 కోట్లు రుణం తీసుకున్నారని, ఆ అప్పులను తాము ఇప్పటికీ చెల్లిస్తున్నామని ఆయన అన్నారు. ఈ పద్నాలుగు నెలల్లో తాము రూ. 4 వేల కోట్లకు పైగా నిధులను రహదారుల కోసం మంజూరు చేశామని తెలిపారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్‌ను పద్దెనిమిది నెలల్లో పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. గత పదేళ్లలో రోడ్ల నిర్మాణానికి రూ. 3,945 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఆయన పేర్కొన్నారు.
సభ నుంచి బీఆర్‌ఎస్ వాకౌట్ : మంత్రి కోమటిరెడ్డి సమాధానాన్ని నిరసిస్తూ సభ నుంచి బీఆర్‌ఎస్ వాకౌట్ చేసింది. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఇతర విషయాలు ప్రస్తావించారని బీఆర్‌ఎస్ సభ్యులు మండిపడ్డారు. బీఆర్‌ఎఎస్ హయాంలో చేసిన రోడ్ల గణాంకాలు స్పీకర్ సమక్షంలో పెట్టాలని ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేశారు. స్పీకర్ సమక్షంలో పెట్టాలని డిమాండ్ చేసినా స్పందించలేదని బీఆర్‌ఎస్ వాకౌట్ చేసింది.