మణిపూర్‌పై చర్చ కోసం ఉభయసభల్లో
విపక్ష నేతలకు లేఖలు రాశా
లోక్‌సభలో హోంమంత్రి అమిత్ షా వెల్లడి
న్యూఢిల్లీ: మణిపూర్ అంశంపై ప్రతిపక్షాలు ఎంత సేపు కావాలంటే అంతసేపు చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనిపేర్కొంటూ తాను లోక్‌సభ, రాజ్యసభలో ప్రతిపక్ష నేతలకు లేఖలు రాసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మణిపూర్ అంశంపై మంగళవారం కూడా పార్లమెంటు ఉభయ సభలో సభా కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కటిగిన విషయం తెలిసిందే. ప్రతిపక్షాల గొడవ మధ్యలోనే లోక్‌సభలో బహుళ రాష్ట్ర సహకార సంఘాల సవరణ బిల్లుపై జరిగిన స్వల్పకాలిక చర్చకు అమిత్ షా సమాధానమిస్తూ మణిపూర్ అంశంపై దాచి పెట్టడానికి ఏమీ లేదని, దీనిపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
Also Read: ఫాతిమాగా మారిన అంజూ.. మతం మార్చుకొని ప్రియుడితో పెళ్లి
‘నినాదాలుచేస్తున్న వారికి సహకారంపై కానీ, సహకార సంఘాలపైన కానీ, దళితులపైన కానీ మహిళల సంక్షేమం కానీ ఆసక్తి లేదు. మణిపూర్ అంశంపై మీరు ఎంతసేపు కావాలంటే అంతసేపు చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉభయ సభల ప్రతిపక్షాల నేతలకు నేను లేఖలు రాసానని మరోసారి స్పష్టం చేయదలిచాను, ప్రభుత్వం దేనికీ భయపడడం లేదు. మణిపూర్ అంశంపై చర్చించాలని కోరుకొంటున్న వారు చర్చించవచ్చు. ప్రభుత్వానికి దాచడానికిఏమీ లేదు’ అని అమిత్ షా చెప్పారు. అనంతరం సభ మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం తెలిపింది. అనంతరం సభ బుధవారానికి వాయిదా పడింది.