Wednesday, January 22, 2025

బడ్జెట్‌పై కసరత్తు

- Advertisement -
- Advertisement -

భారం మోపకుండానే ఆదాయం పెంపుపై దృష్టి
కొత్త బడ్జెట్‌లో రెవెన్యూ మిగులు ఉండకపోవచ్చు?

వివిధ శాఖల నుంచి ప్రతిపాదనలు కోరనున్న ఆర్థిక శాఖ

Discussion on Telangana budget

మన తెలంగాణ/ హైదరాబాద్: అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడంలో, వాటిని సమర్ధవంతంగా అమలు చేయడంలోనూ జాతీయస్థాయిలో ప్రత్యేక గుర్తింపును పొందిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రానున్న 2022-23వ ఆర్ధిక సంవత్సరానికి సరికొత్త విధానాలతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ఆర్ధికశాఖ దృష్టి సారించింది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కావడం, కరోనా సృష్టించిన ఇబ్బందులను కూడా పరిగణనలోకి తీసుకొని ప్రజలపై ఎలాంటి అదనపు పన్నుల భారాన్ని మోపకుండా ఇతర ప్రత్యామ్నాయ మార్గాల్లో ఖజానాకు ఆదాయాన్ని పెంచుకునే విధంగా ఆర్ధిక శాఖ, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులు కసరత్తులు మొదలు పెట్టారు. రానున్న 2022-23వ ఆర్ధిక సంవత్సరానికి ఏయే శాఖలకు ఎంతెంత బడ్జెట్ నిధులు అవసరమవుతాయోననే బడ్జెట్ ప్రతిపాదనలను ఇవ్వాలని కోరుతూ అన్ని శాఖల ఉన్నతాధికారులకు ఆదేశాలు పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో 2 లక్షల 30 వేల కోట్ల రూపాయల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో అన్ని రంగాల నుంచి సుమారు ఒక లక్షా 76 వేల 177 కోట్ల రూపాయల వరకూ రెవెన్యూ రాబడులు ఉంటాయని, అన్ని ఖర్చులు పోనూ సుమారు 6,743 కోట్ల రూపాయల వరకూ రెవెన్యూ మిగులు చూపించగలిగామని కొందరు సీనియర్ అధికారులు వివరించారు. కరోనా కారణంగా ఆశించిన మేరకు ఆదాయం రాలేదని, అలాగని ఆర్ధిక ఇబ్బందులు మాత్రం తలెత్తకుండా ముఖ్యమంత్రి కే.సీ.ఆర్. సుధీర్ఘమైన సమీక్షలు, సమాలోచనల మూలంగా రెవెన్యూ రాబడులను రికార్డుస్థాయిలో రాబట్టుకోగలిగామని వివరించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రెవెన్యూ లోటుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు ఆర్ధిక సహాయం చేసిందని, ఒకవేళ రానున్న కొత్త ఆర్ధిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రానికి కూడా రెవెన్యూ లోటు ఏర్పడితే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణ రాష్ట్రానికి కూడా ఆర్ధికంగా సహకరిస్తుందా? లేదా? అనే చర్చలు జరుగుతున్నాయని ఆ అధికారులు వివరించారు. కాకుంటే వచ్చే ఏడాదిలో అభివృద్ధి, సంక్షేమ పథకాలకే కాకుండా వైద్య-ఆరోగ్య రంగానికి భారీగా నిధులను కేటాయించాల్సి ఉంటుందని, కొత్తగా ఆసుపత్రులు, బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయడమే కాకుండా కొత్తగా మెడికల్ కాలేజీలను కూడా ఏర్పాటు చేసే ప్రతిపాదనలు కూడా ఉన్నందున ఖర్చులు పెరిగే అవకాశాలున్నాయని, అందుచేతనే సొంత రెవెన్యూ రాబడులు, ఖర్చులు బేరీజు వేసుకుంటే మొదటిసారిగా రెవెన్యూ లోటు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

అలా కాకుండా రెవెన్యూ మిగులును ప్రవేశపెడితే కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో కూడా కోతలు పడే ప్రమాదం ఉందని ఆ అధికారులు టెన్షన్ పడుతున్నారు. బడ్జెట్ సమావేశాలకు మరో రెండు నెలల సమయం ఉంది. కొత్త జోనల్ వ్యవస్థ అమల్లో భాగంగా ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్యోగుల విభజన తరువాత 2022-23వ ఆర్ధిక సంవత్సరం బడ్జెట్‌పై ప్రభుత్వం దృష్టి సారించనుంది. కేంద్ర బడ్జెట్ కోసం ఆర్ధికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల అన్ని రాష్ట్రాల ఆర్ధికమంత్రులతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. అన్ని రాష్ట్రాల ఆర్ధికశాఖా మంత్రల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ప్రారంభం నుంచి అన్ని ఆదాయ మార్గాలపై కరోనా ప్రభావంతో తీవ్రంగా పడటంతో ఆర్ధిక వ్యవస్థ అస్తవ్యస్తమై భారీగా ఆదాయం తగ్గింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఆశావహ దృక్ఫధంతో 2.30 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ప్రజలపై ఆర్ధిక భారం మోపకుండానే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చడంలో ప్రభుత్వం విజయం సాధించింది.

భూముల మార్కెట్ విలువ, రిజ్రిస్టేషన్ ధరల పెంపు, భూముల అమ్మకాలు, వాణిజ్య పన్నుల్లో లీకేజీలు అరికట్టడం లాంటి చర్యలతో ఆదాయాన్ని పెంచుకోవడంలో ప్రభుత్వం సక్సెస్ అయ్యింది. ఒక్క స్టాంపులు-రిజిస్ట్రేషన్ల ద్వారా డిసెంబర్ నెలాఖరుకు ఖజానాకు సుమారు ఎనిమిది వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు సమాచారం. ఇదే ఒరవడి కొనసాగితే మార్చి నెలాఖరు నాటికి ఈ శాఖ నుంచి సుమారు 11 వేల కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వచ్చే అవకాశాలున్నాయని అధికారవర్గాలు ఆశాభావాన్ని వ్యక్తంచేస్తున్నాయి. దీంతో ఆదాయ, వ్యయాలపై ప్రభుత్వానికి ఒక స్పష్టత వచ్చిందని అంటున్నారు. గడచిన అక్టోబర్ నెలాఖరు నాటికే ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో కేటాయించిన 2.30 లక్షల కోట్ల బడ్జెట్‌లో 50 శాతానికిపైగా నిధులను ఖర్చు చేశామని, మిగతా 50 శాతం నిధులను కూడా రానున్న మార్చి నెలాఖరు నాటికి నూటికి నూరు శాతం వ్యయం అవుతాయని అధికారవర్గాలు ధీమా వ్యక్తంచేస్తున్నాయి. ఈ ధీమాతోనే రానున్న 2022-23వ ఆర్ధిక సంవత్సరంలోనూ బడ్జెట్ భారీగానే ఉంటుందని, కరోనా కష్ట కాలంలోనూ తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ దేశంలోనే సరికొత్త రికార్డును సృష్టిస్తుందని ఆ సీనియర్ అధికారులు అంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News