న్యూఢిల్లీ : రష్యా ఉక్రెయిన్ ఘర్షణ, దేశంలో ఇంధన ధరల పెరుగుదల విషయాలపై లోక్‌సభలో వచ్చే వారం చర్చ జరుగుతుంది. ఇవి అత్యంత కీలక విషయాలని, వీటిపై చర్చించేందుకు ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదని సభలో ప్రతిపక్షాలు నిలదీశాయి. దీనితో దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం వచ్చే వారం చర్చ జరుగుతుందని తెలిపింది. అజెండాలో ఈ చర్చపై సభా కార్యక్రమాల సలహా సంఘం (బిఎసి) భేటీ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగింది. వచ్చే వారం చర్చకు సిద్ధం అయినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ రెండు అంశాలపై ఓటింగ్‌కు అవకాశం లేని రీతిలో రూల్ 193 పరిధిలో చర్చ జరుగుతుంది. సభలో చర్చ తేదీలు ఇంకా ఖరారు కాలేదు.
కీలకమైన రెండు అంశాలపై చర్చకు తాను బిఎసి భేటీలో ప్రస్తావించినట్లు లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి విలేకరులకు తెలిపారు. దేశంలో క్రమం తప్పకుండా రోజువారిగా పెట్రోలు డీజిల్ ధరలు తోడుగా వంటగ్యాసు ధరలు పెరుగుతూ పోతున్నాయి. ఈ ధరల పెంపుదలకు ఉక్రెయిన్ రష్యా ఘర్షణ కారణం అని కేంద్రం ఇప్పటివరకూ చెపుతూ వస్తోంది. ఈ రెండింటికి సంబంధం ఉన్నందున తక్షణ రీతిలో వీటిపై విస్తృతస్థాయి చర్చకు ప్రతిపక్షాలు పట్టుపట్టాయి.