Monday, December 23, 2024

అగ్ని వర్షంలో చర్చలు

- Advertisement -
- Advertisement -

Discussions between Russia and Ukraine

ఉక్రెయిన్ నగరాల్లో రెండు దేశాల సేనల
హోరాహోరీ ఇంకొకవైపు బెలారస్‌లో
మొదలైన చర్చలు భూగృహాల్లో
తలదాచుకున్న రాజధాని కీవ్ రష్యా
సెంట్రల్ బ్యాంకుపై ఆంక్షలు
ఉక్రెయిన్ సేనలు ఖార్కివ్ నగరాన్ని తిరిగి
సొంతం చేసుకున్నట్టు సమాచారం
ఆయుధాలు వదిలి చేతులెత్తాలని రష్యా
బలగాలను హెచ్చరించినట్టు సోషల్
మీడియాలో ఉక్రెయిన్ సైన్యం డిప్యూటీ
కమాండర్ పోస్టింగ్
ఆదివారం నాటికి దాదాపు 3లక్షల 68వేల
ఉక్రేనియన్‌లు దేశాన్ని వీడి వెళ్లినట్టు, ఈ
యుద్ధం 4మిలియన్ల శరణార్థులను
సృష్టించనున్నట్టు ఐక్యరాజ్యసమితి ప్రకటన
ఉక్రెయిన్‌కు అమెరికా, జర్మనీ తదతర దేశాల ఆయుధ సాయం

కీవ్ : ఉక్రెయిన్‌లో రెండవ అతిపెద్ద నగరం ఖర్కీవ్‌లో రెండు దేశాల సేనల మధ్య వీధిపోరాటాలు హోరాహోరీగా సాగుతున్నట్టు సమాచారం. ఆదివారం నాడు దక్షిణ ఉక్రెయిన్‌లో కీలకమైన రేవులన్నింటిని రష్యా సేనలు స్వాధీనం చేసుకున్నాయి. విమానాశ్రయాలు, ఇంధన నిల్వల మీద దృష్టిపెట్టి రష్యా సేనలు దాడులు ముమ్మరం చేస్తున్నాయి. ఆదివారం ఉదయం రాజధాని కీవ్‌లో పెద్ద పెద్ద పేలుళ్లు సంభవించాయి. అప్పుడడప్పుడు ఒకటో, రెండో కార్లు తప్ప జనసంచారం కనిపించలేదు. 39గంటలతో పాటు కఠిన కర్ఫూ విధించడంతో జనం బయటికి రావటం లేదు. భయోత్పాతం చెందిన కీవ్ పౌరులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భూగర్భ గ్యారేజీల్లోనూ, సబ్‌వే కేంద్రాల్లోనూ బిక్కుబిక్కుమంటూ తలదాచుకుంటున్నారు. రష్యా పూర్తిస్థాయి యుద్ధ దాడులు చేయవచ్చని భయపడుతున్నారు.

ఇదిలావుండగా, రష్యా ఉక్రెయిన్‌ల మధ్య చర్చలకు రంగం సిద్ధమైనట్టు వార్తలు వెలువడ్డాయి. అణ్వాస్త్రాలను సిద్ధంగా ఉంచాలని పుతిన్ రష్యన్ సేనలను ఆదేశించారంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో జెలెన్‌స్కీ చర్చలకు అంగీకారం తెలిపి ఉంటారని పరిశీలకులు భావిస్తున్నారు. రష్యా కోరినట్టు యుద్ధ ప్రభావం ఉన్న బెలారస్‌లో చర్చలకు వెళ్లడానికి తొలుత నిరాకరించిన జెలెన్‌స్కీ ఆ తర్వాత అందుకు అంగీకరించినట్టు సమాచారం. దానితో ఉక్రెయిన్‌కు చెందిన బృందం బెలారస్‌కు బయలుదేరింది. అప్పటికే రష్యన్ బృందం బెలారస్‌కు చేరుకొని ఉంది. ఉక్రెయిన్‌లో గత నాలుగు రోజులుగా రష్యా మిలటరీ బీభత్సం సృష్టిస్తోంది. బాంబులు, మిసైళ్లతో దాడులు జరుపుతోంది. రష్యా వైఖరిపై ఇప్పటికే ప్రపంచ దేశాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తూ పుతిన్‌పై ఆంక్షలు కూడా విధించాయి.

చమురు పైపులైన్ పేల్చివేత

ఖర్కీవ్ లోని సహజవాయు పైప్‌లైన్‌ను రష్యా సేనలు పేల్చివేశాయి. దీంతో భారీ ఎత్తున మంటలు ఎగసిపడడంతో పర్యావరణంపై అధిక ప్రభావం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.

నీపర్ నదిపై పట్టు సాధించిన రష్యా

నోవా కఖోవ్‌కా నగరంపై పట్టు సాధించడంతో క్రిమియా ద్వీపకల్పానికి సెవస్థపపోల్ నగరానికి మంచినీరు అందించే నీపర్ నదిపై రష్యాకు పట్టు లభించింది. వ్యూహాత్మకంగా ఇది చాలా కీలకమైన ప్రాంతం. రష్యాలో పుట్టిన ఈ నది నుంచి సోవియట్ సమయంలో నిర్మించిన ఉత్తర క్రిమియా కాల్వ ద్వారా క్రిమియాకు నీటిసరఫరాను చేస్తున్నారు. కానీ కొన్నేళ్లుగా ఉక్రెయిన్ నీటి సరఫరాను అడ్డుకోవడంతో క్రెమ్లిన్ ఆగ్రహానికి కారణంగా నిలిచింది. క్రిమియాలో తగిన నీటి వనరులు లేవు. 2014 తర్వాత కీవ్ నీటి సరఫరాలో సమస్యలు సృష్టించడంతో గత ఏడాది క్రిమియాలో కరవు పరిస్థితి నెలకొంది. దీనికి ఉక్రెయిన్ కారణమని రష్యా గుర్రుగా ఉంది. తాజాగా రష్యా దళాలు నగరం లోకి ప్రవేశించి ఎగ్జిక్యూటివ్ కమిటీ భవనాన్ని స్వాధీనం చేసుకున్నాయి. అక్కడ ఉన్న ఉక్రెయిన్ జెండాలను తొలగించాయి. ఇక ఖెర్సావ్, మైకోలైవ్, మెల్టోపోల్‌పై కూడా రష్యా దళాలు దృష్టి పెట్టాయి.

రష్యా సెంట్రల్ బ్యాంక్‌పై ఆంక్షలు

అమెరికా, దాని మిత్ర దేశాలు రష్యా సెంట్రల్ బ్యాంక్‌పై కఠిన ఆంక్షలు విధించాయి. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థతో రష్యా లావాదేవీలనూ నిషేధించారు. రష్యన్ బ్యాంకులను ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ‘స్విఫ్ట్’ నుండి వేరు చేయాలని, రష్యా సెంట్రల్ బ్యాంక్‌పై నియంత్రణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు అమెరికా, యూరోపియన్ యూనియన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, బ్రిటన్, కెనడా దేశాధినేతలు శనివారం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. సెంట్రల్ బ్యాంక్‌పై ఆంక్షలు విధించడం ద్వారా క్రెమ్లిన్ వద్ద ఉన్న 600 బిలియన్ డాలర్లకు పైగా నిధులను లక్షం చేసుకున్నారు.

నిషేధిత రష్యన్ కంపెనీల ఆస్తులపై చర్యలు తీసుకోవడానికి జాయింట్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. భారతదేశంతో సహా 200కు పైగా దేశాల్లోని 11,000 బ్యాంకులు, ఆర్థిక సంస్థలను కలిపే ప్రపంచంలోని ప్రముఖ బ్యాంకింగ్ కమ్యూనికేషన్ సర్వీస్‌నే స్విఫ్ట్(సొసైటీ ఫర్ వరల్డ్ ఇంటర్‌బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్) అంటారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సజావుగా సాగేందుకు ఈ వ్యవస్థ చాలా ముఖ్యమైంది. దాని నుంచి రష్యాను వేరుచేస్తే ఆ దేశంపై తీవ్ర ప్రభావం చూపనుంది. స్విఫ్ట్ నుండి రష్యా బ్యాంకులను తీసివేయడం భారీ ఆంక్షనే, ఎందుకంటే ప్రపంచంలోని దాదాపు అన్ని బ్యాంకులు ఈ వ్యవస్థను ఉపయోగిస్తున్నాయి. రష్యా తన చమురు, గ్యాస్ ఎగుమతుల కోసం ఈ వ్యవస్థపైనే ఎక్కువగా ఆధారపడింది. ఈ చర్య రష్యా బ్యాంకులను అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నుండి వేరు చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పనిచేసే వారి సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది.

రష్యన్ సేనల తరిమివేత

రష్యా సేనలు ఉక్రెయిన్‌లోని కీలక నగరాలైన ఖర్కీవ్, నోవా కఖోవ్‌కాల్లోకి ప్రవేశించాయి. ఖర్కీవ్‌లో పోరాటం జరుగుతుండగా, నోవా కఖోవ్‌కా నగరాన్ని మాత్రం పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నాయి. ఖర్కీవ్ ఉక్రెయిన్‌లో రెండో అతిపెద్ద నగరం. పరిమిత ఆయుధ సంపత్తితో పోరాడుతున్న ఉక్రెయిన్ దళాలు ఖార్కివ్ నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. ఖార్కివ్‌లోని సహజవాయు పైప్‌లైన్‌ను రష్యా సేనలు పేల్చివేశాయి. ఈ క్రమంలో రష్యన్ సేనను తరిమికొట్టాయని ఖార్కివ్ గవర్నర్ తెలిపారు. ఉక్రెయిన్ రెండో పెద్ద నగరమైన ఖార్కివ్‌లో ఉక్రెయిన్, రష్యా దళాలకు మధ్య పోరు కొనసాగింది. ఆదివారం వరకు రష్యా బలగాలు ఖార్కివ్ శివార్లలోనే ఉన్నాయి. 14 లక్షల జనాభా ఉన్న ఆ నగరం రష్యా సరిహద్దుకు 20 కిమీ. దూరంలో ఉంది. రష్యా దళాలతో పోరాడేందుకు ఉక్రెయిన్ ప్రభుత్వం మిలిటరీ అనుభవం ఉన్న ఖైదీలను కూడా విడుదలచేసింది. ప్రాసిక్యూటర్స్ ఆఫీస్ అధికారి ఆండ్రియ్ సిన్యుక్ ఈ విషయాన్ని హ్రోమద్స్కే టివి ఛానల్‌కు ఆదివారం తెలిపారు. ఇదిలావుండగా రష్యా అధ్యక్షుడు పుతిన్ అణు బలగాలను అలర్ట్‌లో ఉంచారు. కాగా ‘నాటో’ చీఫ్ మాత్రం పుతిన్ న్యూక్లియర్ అలర్ట్‌ను ప్రమాదకరం, బాధ్యతారాహిత్యమైనదిగా పేర్కొన్నారు.

రష్యా దళాలు మాత్రం ఇప్పటికీ ఉక్రెయిన్ పెద్ద నగరాలలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కాగా ఉక్రెయిన్ సైనికులు మాత్రం ధృఢనిశ్చయంతో ఎదుర్కొంటున్నారు. ఉక్రెయిన్ దేశస్థులు రాజధాని కీవ్‌ను, ఇతర నగరాలను కాపాడుకోడానికి వాలంటరీగా డిఫెండ్ చేస్తున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ మాత్రం ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని కూలదోసి తనకు అనుకూలంగా ఉండే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలనుకుంటున్నారు. రష్యా బలగాలు ఖెర్సన్, అజోవ్ విమానాశ్రయాలను తమ అధీనంలోకి తీసుకున్నాయి.

ఉక్రెయిన్ మిలిటరీ డిప్యూటీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ యేవ్‌హెన్ మోయిసియుక్ రష్యా బలగాలకు గట్టి హెచ్చరికనే చేశారు. “మీరు మీ ఆయుధాలు వదిలేసి, చేతులు పైకెత్తేయండి. మా సర్వీస్‌మెన్, సివిలియన్స్ మీరు మా మాట విన్నారని మన్నిస్తారు. మీరు మీ ఇంటికి సురక్షితంగా వెళ్లిపోవచ్చు” అని మోయిసియుక్ ఫేస్‌బుక్‌లో వీడియో పెట్టారు. ఇదిలావుండగా ఐక్యరాజ్యసమితి కాందీశీకుల సంస్థ ఆదివారం దాదాపు 3,68,000 మంది ఉక్రెయిన్లు తమ పొరుగు దేశాలకు తరలారని తెలిపింది. ఈ పోరు దాదాపు 4 మిలియన్ల కాందీశీకులను తయారుచేయగలదని పేర్కొంది. ప్రస్తుతం అమెరికా, జర్మనీ వంటి దేశాలు ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తున్నాయి. ఆయుధాలు కూడా అందిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News