మన తెలంగా ణ / హైదరాబాద్ : ఒబిసి పార్లమెంట్ కమిటీతో సెంట్రల్ యూనివర్సిటీ బిసి అసోసియేషన్లు చర్చలు జరిపాయి. మంగళవారం సుమారు 30 మంది సభ్యులతో కూడిన పార్లమెంట్ కమిటీ బృందాన్ని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఓబీసీ ఎంప్లాయిస్ అసోసియేషన్, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్‌లు ఈ మేరకు కలిశాయి. ఈ సందర్భంగా బిసిలకు సంబంధించిన సుమారు 30 సమస్యలను కమిటీ దృష్టికి తీసుకెళుతూ పలు విజ్ఞాపన పత్రాలను సమర్పించారు. పార్లమెంట్ కమిటీ చైర్‌పర్సన్ రాజేష్ వర్మను, పార్లమెంట్ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ , ఇతర సభ్యుల్ని యూనివర్సిటీ హైదరాబాద్ ఓబి సి ఎంప్లాయిస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఈ వెంకటేశు, అధ్యక్షుడు గోపాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి దుర్గేష్ సింగ్ , ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి అరుణ్ కేతన్ జాతీయ కార్యదర్శి సాయికిరణ్ తదితరులు కలిశారు.
మహాత్మా జ్యోతిబా పూలే పేరు మీద దేశవ్యాప్తంగా, యూనివర్సిటీ హైదరాబాద్‌లో బిసి సమస్యలపై పరిశోధన కేంద్రాలను పెట్టాలని, రోస్టర్‌ను తూచా తప్పకుండా పాటించాలని, ప్రొఫెసర్ , అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ కేడర్లలో 27 శాతం రిజర్వేషన్లను పాటించాలని బిసి విద్యార్థులకు రీసెర్చ్ ఫెలోషిపులను 5 వేలకు పెంచాలని, ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్ ఫెలోషిప్‌లో రిజర్వేషన్లను పాటించాలని ఎంప్లాయ్ క్వార్టర్స్ లొకేషన్‌లో రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. యూనివర్సిటీల ఉపకులపతుల నియామకంలో జాతీయస్థాయి కమిటీలలో బిసిలను జనాభా ప్రాతిపదికన నియమించాలని యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్‌కు ఇండియన్ కౌన్సిల్ ఫర్ సోషల్ సైన్సెస్ రీసెర్చ్ వారు పరిశోధన కోసం ఇచ్చే ఆర్థిక నిధులలో 27 శాతం ఒబిసి రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.